Apr 16,2023 21:58

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈనెల 15వ తేదీ ఒక్కరోజే ఎనిమిది కేసులు
సిబ్బందిని, ఆసుపత్రులను సిద్ధం చేసాం
అందుబాటులో సరిపడు ఆక్సిజన్‌ సిలిండర్లు
డిఎంహెచ్‌ఒ డి.ఆశ
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

'దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో ఈనెల 15వ తేదీ ఒక్కరోజే ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయడంతో పాటు, కోవిడ్‌ని ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం' అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దయాల ఆశ తెలిపారు. కరోనా నేపథ్యంలో శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, కరోనాపై ప్రజలను చైతన్య పరచడానికి చేపడుతున్న కార్యక్రమాలను ఆమె ప్రజాశక్తి ముఖాముఖీలో వివరించారు.
ప్రశ్న : కరోనా నియంత్రణకు వైద్యశాఖపరంగా తీసుకుంటున్న చర్యలేంటి?
జిల్లాలో ఈనెల 15వ తేదీ ఒక్కరోజే ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఆస్పత్రుల సమాచారాన్ని వైద్యశాఖ కోరింది. రాండం సర్వే నిర్వహించాము. దగ్గు, జలుబు ఉన్న వారికి రాపిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారికి ఏలూరు, జంగారెడ్డిగూడెం ల్యాబ్‌లలో ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
ప్రశ్న : ఏయే ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి?
విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో, ప్రధానంగా తెలంగాణా ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు కొత్తవ్యక్తుల పట్ల అప్రమతంగా ఉండాలి. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలి.
ప్రశ్న : కోవిడ్‌ దృష్ట్యా ఎన్ని ఆసుపత్రులను సిద్ధం చేశారు?
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఎపి పరిధిలోని 18 ఆసుపత్రులు కోవిడ్‌ చికిత్స కోసం సిద్ధం చేశాం. ఏలూరులోని మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆసుపత్రి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి ఏరియా ఆసుపత్రులు, ఆరు సామాజిక ఆసుపత్రులను సిద్ధం చేశాము. జిల్లాలోని 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. గతంలో37 ప్రయివేటు ఆసుపత్రులను ఏర్పాటు చేశాం. ఇప్పుడు వాటి విషయమై ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. రెండు, మూడు దశల కోవిడ్‌ అనుభవాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
ప్రశ్న: ఆక్సిజన్‌ సిలిండర్లు సిద్ధంగా ఉంచారా?
ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌, డి.టైప్‌ సిలిండర్స్‌ సిద్ధంగా ఉంచాము. యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ఆసుపత్రుల్లో ఉన్నాయి. పాజిటీవ్‌ వచ్చిన వారికి ఐసోలేషన్‌ కిట్లు అందిస్తున్నాము. 60 ఎంపిహెచ్‌సీల్లో ఇవి 50 చొప్పున ఉన్నాయి.
ప్రశ్న : ప్రస్తుత కరోనా నేపథ్యంలో కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
గతంలో నియోజకవర్గంలో త్రిబుల్‌ సీల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. గ్రామాల్లోనూ త్రిబుల్‌ సీల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధం చేశాం. తక్కువ జలుబు, తక్కువ లక్షణాలుంటే గ్రామాల్లోనే చికిత్స అందించారు. ఇవికాక 500 ఐసియు బెడ్స్‌, 2100 ఆక్సిజన్‌ బెడ్స్‌ మొత్తంగా 3,600 బెడ్లు సిద్ధంగా ఉంచారు. ఈసారి అత్యవసర పరిస్థితులు ఉత్ఫన్నమైతే ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా తక్షణ ఏర్పాట్లు చేస్తాం.
ప్రశ్న : వ్యాక్సినేషన్‌ ఎంతవరకు వచ్చింది?
15 నుంచి 18 ఏళ్లలోపు వారికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మూడోవేవ్‌ ముందు, తర్వాత ప్రికాషన్‌ డోస్‌ పెద్దలకు వేసాం.
ప్రశ్న : థర్డ్‌ వేవ్‌ సిబ్బందిని తీసుకుంటున్నారా?
గత కోవిడ్‌ సమయంలో పనిచేసిన 50 మంది సిబ్బందిని తీసుకున్నాం. తర్వాత అనేకమార్లు రిక్రూట్‌మెంట్ల ద్వారా అనేక మందిని తీసుకున్నాం. గతంలో కోవిడ్‌లో పనిచేసిన వారు ఉద్యోగులుగా చేరారు. దీంతో సిబ్బంది కొరత లేనట్టే.
ప్రశ్న : సీజనల్‌ వ్యాధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.?
జిల్లాలో మూడు వారాలుగా ఫీవర్‌ సర్వే జరుగుతోంది. వాలంటీరు, ఎఎన్‌ఎం ద్వారా ఈ సర్వే సాగుతుంది. త్వరలో ముగియనుంది. జిల్లాలో హెచ్‌3, ఎన్‌2 ఇన్‌ ఫ్లూ యేంజా వైరస్‌ వల్ల జ్వరం, జలుబు వంటివి సంభవిస్తున్నాయి. సిట్రిజన్‌, పారాసిట్మల్‌ వంటివి వేసుకోవాలని సూచిస్తున్నాం. ఈ మందులు పిహెచ్‌సిల్లో అందుబాటులో ఉంచాము. మలేరియా, టైఫాయిడ్‌ వంటివి ఉన్నాయి.
ప్రశ్న : ఫ్యామిలీ ఫిజిషియన్‌ కార్యక్రమం అమలు ఎలా ఉంది.?
జిల్లాలో ఫామిలీ ఫిజిషియన్‌ కార్యక్రమం సక్రమంగా నడుస్తోంది. 60 పిహెచ్‌సిలకు 120 మంది డాక్టర్లు ఉన్నారు. 15 రోజులు క్షేత్రస్థాయిలో, 15 రోజులు మంచానపడ్డవారిని సందర్శిస్తారు. పిహెచ్‌సిలకు వచ్చే రోగులను ఒక వైద్యుడు పరిశీలిస్తారు. 104 వాహనాలు 28 మండలాలకు 28 ఉన్నాయి. కొత్తగా 16 ఇచ్చారు. వాహనంలో మెడికల్‌ ఆఫీసర్‌ వెళ్లి వైద్యం అందించి మందులు ఇస్తారు.