Dec 06,2020 11:42

          బిక్షపతి బాగా పిసినారి. వ్యాపారం చేసి చాలా ధనం కూడబెట్టాడు. అయినా ఏనాడూ ఇతరులకు దానం చేసేవాడు కాదు. తుపానులతో, సునామీలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతమైనా, ఎలాంటి విపత్తులు వచ్చినా ఇతరులకు సాయం చేయనేలేదు. ఆ మాటకు అర్థమే బిక్షపతికి తెలియదని చెప్పాలి. ఈ తరుణంలో కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించి ఆ ఊరిలోనూ విజృంభించి, ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. బిక్షపతి భార్య, కుమారుడికీ కరోనా సోకిందని వైద్యులు భావించడంతో వాళ్ళతోపాటు బిక్షపతినీ పరిశీలన నిమిత్తం తీసుకుని వెళ్ళారు. ముగ్గురికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైద్యం అందించారు. కొద్దిరోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరాలలో బిక్షపతి కుటుంబానికి ఉచిత వైద్యసేవలు చేశారు. వైద్యశిబిరంలో ప్రతిరోజూ వారికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఉచితంగా ఇచ్చేవారు. ఎవరూ ఎటువంటి ధనాన్ని ఆశించకుండా వైద్యం చేయడంతో బిక్షపతి చాలా ఆనందించినప్పటికీ కారణం తెలుసుకోవాలనుకున్నాడు.
         ''అయ్యా! డాక్టర్‌గారూ! డబ్బు తీసుకోకుండా మీరు కరోనాకు వైద్యం చేస్తున్నారు కదా? మీకు నష్టం కదటండీ?'' అని ప్రశ్నించాడు బిక్షపతి.
          అందుకు వైద్యుడు బదులిస్తూ 'బిక్షపతిగారూ ! కరోనా అనే ఈ రోగం ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తుంది. ఈ వ్యాధి నయం కావడానికి పూర్తిస్థాయి మందును ఇంకా కనిపెట్టలేదు. పైగా ఈ వ్యాధి ఒకరికి సోకితే వందల మందికి అంటుకునే గుణాన్ని కలిగి ఉంది. మరణం సంభవించే ప్రమాదమూ ఉంది. అందువల్లే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి, వ్యాధిని నయం చేసి ప్రజలకు అండగా నిలబడింది. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని, ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. సరైన పనులు లేకపోవడంతో ప్రజల వద్ద ధనం ఉండకపోవచ్చని ప్రభుత్వాలే వారికి ఉచిత వైద్యాన్ని అందించి, అందరి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి' వివరించాడు వైద్యుడు మంజునాథ్‌.
'మా సంగతి సరేనండి. మీరు ఏదో ఒకటి ఉచితంగా పెడుతున్నారు. తిని బతికేస్తున్నాము. దినసరి కూలీలకు వెళ్ళే కార్మికుల పరిస్థితి ఏమిటి? ఆకలితో అలమటించాల్సిందేనా?' అనుమానంగా ప్రశ్నించాడు బిక్షపతి.
           'ప్రభుత్వాలు తమ వంతు ఆదుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తున్నాయి. అయితే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పూనుకుని వలస కార్మికులను మొదలుకుని, పేదలనూ ఆదుకుంటున్నారు. మనసున్న అనేకమంది ధనవంతులు పేదల ఆకలి తీరుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. చనిపోయిన తరువాత కట్టుకుపోయేదేముంది బిక్షపతిగారూ? మనం చేసే మంచిపనులే తృప్తినిస్తాయి. అటువంటి మంచిపనులు చేసినవాళ్ళు చనిపోయి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు' అని సవివరంగా చెప్పాడు డాక్టర్‌ మంజునాథ్‌.
           బిక్షపతి దంపతులకు కరోనా వ్యాధి నయమైందని ఇంటికి పంపించారు వైద్యులు. వాహనంలో ఇంటికి వస్తున్న ఆ దంపతులు దారిలో అనేకచోట్ల ప్రజలు ఆహార పొట్లాలకోసం ఎగబడటం, బియ్యం పంచుతున్నారని ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్ళడం చూశారు. ఆ సన్నివేశాలు బిక్షపతి హృదయాన్ని కలచి వేసి, కన్నీళ్లొచ్చాయి. బిక్షపతిలో మానవత్వం మేల్కొంది. ఆకలి బాధంటే ఇలా ఉంటుందా? అనే విషయాన్ని బిక్షపతి తెలుసుకున్నాడు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవాలని, తనకు చేతనైన సహాయం చేయాలని భావించాడు. ఎక్కడో సుదూరాన ఉన్న వారికి కాకుండా తన ఊళ్లో, చేరువలో ఉన్న పేదవారికి సహాయం చేద్దామనుకున్నాడు. ఒకరోజు ఆటో రిక్షాలో మైక్‌ పెట్టుకుని బయలుదేరాడు.
           ఆటోకు కట్టిన మైక్‌లో బిక్షపతి మాట్లాడుతూ 'మిత్రులారా ! కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పనుల్లేక ఇళ్ళు గడవని పేదవారికి నేను సాయం చేయదలిచాను. నేను ఒక్కో ఇంటికి కేవలం ఒక కూపన్‌ ఇస్తాను. ఈ కూపన్‌లో మీ వివరాలు పూర్తిచేసి, రేపు ఉదయం నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే నాకు చేతనైన సాయం చేస్తాను. సాయం అందుకునేవారు ముఖానికి మాస్కులు ధరించి, విధిగా భౌతిక దూరం పాటించాలి' అని ప్రకటించాడు.
'వీడు, వీడి పీనాసితనం. ఇంతవరకు ఇతగాడు పిల్లికి కూడా భిక్షం పెట్టలేదు. గొప్పసాయం చేయడానికి బయలుదేరాడు?' అని చాలామంది తేలిక భావంతో మాట్లాడుకుని, కూపన్‌ తీసుకోలేదు.
            అయితే అప్పటికే రెండురోజుల నుండి గంజి కూడా తాగని అతి పేదవారు వచ్చి బిక్షపతి ఇచ్చిన కూపన్లు తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే అతని ఇంటికి వెళ్ళారు. పేదవారంతా ముఖానికి మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ క్రమశిక్షణతో నిలబడ్డారు.
            వారినుద్దేశించి బిక్షపతి మాట్లాడుతూ 'మిత్రులారా! నాకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేస్తున్నాను. అంతమాత్రాన నేను గొప్పవాడిని, మీరు అర్థించే వారు కాదు. నేను చేస్తున్న ఈ సాయం భిక్షం అని భావించకండి. మనమంతా పెనువిపత్తులో ఉన్నాము. మానవత్వంతో ఒకరికొకరు అండగా నిలవాలనే అభిప్రాయంతో నేనీ సాయం చేస్తున్నాను' అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.
            బిక్షపతి ఒక్కొక్కరి వద్ద కూపన్‌ తీసుకుని, సాయం చేయడం ప్రారంభించాడు. ఏదో రెండు రోజులకు సరిపడా బియ్యం ఇస్తాడేమో? అని కొందరు భావించారు. బిక్షపతి సాయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతి పెద్ద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను చక్కగా బస్తాలలో మూటకట్టి మరీ ఇచ్చాడు. పైగా కొన్ని ఆటోలను ఏర్పాటు చేసి, సహాయం తీసుకునేవారి ఇళ్ళ వరకు ఆ మూటలను చేరవేశాడు. అందరూ బిక్షపతి సాయాన్ని అందుకుని ఇళ్ళకు చేరి మూటలు విప్పి చూసుకున్నారు. జరుగుతున్న పరిణామాలకు ఆశ్చర్యపోయారు. దాని నుండి తేరుకునే లోపే అందరూ ఉలిక్కిపడే మరో సంఘటనను చూశారు. ఎంతో పిసినిగొట్టు అయిన బిక్షపతి ఇంత భారీ సాయం చేయడం ఒక అంశమైతే, బియ్యం మూటలలో నెలవారీ ఇతర ఖర్చులకు సరిపడా నగదునూ ఉంచాడు. ఎవరూ కలలోనైనా ఊహించని ఈ సంఘటన ఆ నోటా, ఈ నోటా ప్రజలందరికీ తెలిసిపోయింది. చాలామంది సహాయాన్ని అర్థించడం కోసం బిక్షపతి వద్దకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. అంతకు ముందురోజు నిర్ణయించి కూపన్లు ఇచ్చిన వారికి మాత్రమే సహాయం అందింది. ఇంటికి వచ్చిమరీ సాయం చేస్తానన్న వ్యక్తిని తేలిక భావంతో మాట్లాడటం తాము చేసిన తప్పని కొందరికి కనువిప్పు కలిగించింది. చెడ్డవాడెప్పుడూ చెడ్డవాడిగానే ఉండడనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారు. పిసినారి అయిన బిక్షపతిలో కరోనా తెచ్చిన మార్పు గురించి అందరూ కథలుగా చెప్పుకున్నారు.

షేక్‌ అబ్దుల్‌ హకీం జాని,
9949429827