తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారు. కొంతకాలంగా కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించింది. వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మేమున్నామంటూ రోగులకు భరోసాని ఇస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రం హోస్టన్ యునైటెడ్ మెమోరియల్ హాస్పిటల్ చీఫ్ జోసెఫ్ వెరోన్ 260 రోజులుగా సెలవు పెట్టకుండా సేవలు అందిస్తున్నారు. ఆయన కరోనా బాధితుడైన వృద్ధుడిని ఆలింగనం చేసుకుంటూ ఓదార్చుతున్న ఫోటో నేడు ప్రపంచమంతా వైరల్ అయ్యింది. అసలా ఫోటో వెనుక కథ ఏమిటో తెలుసుకుందాం...
కరోనా వైరస్ బారినపడి అల్లాడుతున్న ప్రజలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చికిత్స అందిస్తున్నారు వైద్యులు. టెక్సాస్ రాష్ట్రం హోస్టన్ యునైటెడ్ హాస్పిటల్ చీఫ్ జోసెఫ్ వెరోన్ 260 రోజులుగా అవిశ్రాంతంగా ఆస్పత్రిలోనే సేవలందిస్తున్నారు. ఆకలి వేసినప్పుడు ఏది దొరికితే అది తినడం. రోజులో కేవలం రెండు, మూడు గంటలు నిద్ర పోవడం, మిగతా సమయమంతా కరోనా బాధితుల సేవలో గడపడం. ఇదీ ఆయన దినచర్య. జోసెఫ్ వెరోన్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేమి జరిగిందంటే...
'కోవిడ్-19 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో ఉన్న ఓ వృద్ధుడు ఎలాగైనా ఆ గదిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలోనే గదిలోకి వెళ్లాను. నన్ను చూడగానే ఆయన బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు. తన భార్య దగ్గరకు వెళతానని మొండి కేశాడు. అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని, ఓదార్చిన తర్వాత ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాడు. ఆయనను అలా చూడగానే చాలా బాధేసింది. నిజానికి ఒక గదిలో ఒంటరిగా ఉండటమే కష్టం. అలాంటిది వృద్ధాప్యంలో ఒంటరితనం మరీ కష్టంగా ఉంటుంది. ఆయన బాధను అర్థం చేసుకున్నా. మరో వారంలోనే ఆయన డిశ్చార్జ్ అవుతాడని ఆశిస్తున్నా' అంటున్నాడు జోసెఫ్.
'కరోనా తగ్గుముఖం పడితే విశ్రాంతి తీసుకుందామని అనుకున్నా. కానీ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనంతటికి పట్టని అమెరికా పాలకులూ, ప్రజలూ ఒక కారణం. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకుండా పబ్బులు, రెస్టారెంట్లలో గుమిగూడి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. క్రిస్ట్‌మస్, నూతన సంవత్సరం రాబోయే ఆరు నుంచి 12 వారాలు ఆధునిక అమెరికా వైద్య చరిత్రలోనే కాళరాత్రులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రోజంతా పీపీఈ కిట్, ఫేస్ షీల్డ్ నెలల తరబడి ధరించి ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఇంటికి వెళ్లినా వరుస ఫోన్‌లు వస్తుంటాయి. ఈ ఆస్పత్రికి వచ్చే రోగులంతా పేదవారే. కాబట్టి సెలవు పెట్టకుండా పనిచేస్తున్నా' అని వివరించాడు జోసెఫ్.
'ప్రజలు ఇప్పటికైనా భౌతికదూరాన్ని పాటించండి. మాస్క్‌లు ధరించండి. చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. గుంపులుగా ప్రజలున్న ప్రదేశాలకు వెళ్లకండి. అలాగనుక మీరు చేస్తే ఇప్పటికైనా నాలాంటి వైద్యులకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది!' అని జోసెఫ్ అంటున్నారు.