May 16,2021 13:07

కళ్ళు నా ప్రమేయం లేకుండానే మూతలు పడుతున్నాయి. పరిస్థితి చెయ్యి దాటుతున్నట్టు అర్థమౌతోంది. బలంగా అనుకుంటున్నాను.. నేను కళ్ళు తెరవాలని. 'ఓడిపోయాను' అని చెప్పడానికైనా కళ్ళు తెరవాలి. లేదంటే ఆత్మకు శాంతి ఉండదు.

                                                                       ***

ఎవరో చెప్పినట్టున్నారు. ఇంటిముందు అంబులెన్సు ఆగింది. ఎవరి మాటా స్పష్టంగా వినబడటం లేదు. స్ట్రెచర్‌పై నన్ను పడుకోబెట్టి అంబులెన్సు ఎక్కిస్తుండగా బలం కూడదీసుకుని కళ్ళు తెరిచాను. డ్రైవింగ్‌ సీటులో సన్యాసిరావు. తెలిసిన ముఖమే అయినందుకు కాసేపు సంతోషం కలిగినా, వెంటనే నెలరోజుల క్రితం జరిగిన సన్నివేశం గుర్తొచ్చి గిల్టీ ఫీలింగు కమ్మేసింది. నా కళ్ళమీది ప్రస్తుతం కమ్మేసిన మగత నిద్ర లాగే.
×××
మా కాలనీలో నేను ఒంటరి ద్వీపాన్ని. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యాక ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాను. ఏడాదిలో మూడోవంతు మా ఆవిడ అమెరికాలో ఉన్న మా పిల్లల దగ్గరే ఉంటుంది. నా వ్యాపకమంతా ఆరోగ్యం కాపాడుకోవడం, పుస్తకాలు చదువుకోవడం. అంతే! కాలనీలో ఎవరి పేరూ నాకు తెలీదు. తెలియాల్సిన అవసరం పడలేదు. మా ఇంట్లో పై పోర్షన్‌ సన్యాసిరావుకి అద్దెకిచ్చాము. ఆయన అంబులెన్సు డ్రైవర్‌. అద్దె పుచ్చుకొనే సమయం, వేరే ఒకటీ అరా సందర్భాల్లో తప్పితే వాళ్ళతో నాకు పెద్దగా మాటలుండవు. ఆయనా, ఆయన భార్యా, స్కూలికెళ్లే వయసున్న వాళ్ళ కొడుకూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు కూడా తెలియదు. అట్టే చనువిచ్చే రకం కాదు నేను.
కరోనా మహమ్మారి అప్పుడప్పుడే కమ్ముకోవడం మొదలైంది. ప్రభుత్వం లాక్డౌన్‌ ప్రకటించింది. ఈ ఊళ్ళో కూడా అడపాదడపా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడివాళ్లక్కడే ఇళ్లకు అతుక్కుపోయారు. సన్యాసిరావొక్కడే ఈ కాలనీలో బిజీ. పిలిచి చెప్పాను : ''సన్యాసిరావూ, ఏమీ అనుకోకు. ఇల్లు వెంటనే ఖాళీ చెయ్యండి.''
షాక్‌ అయ్యాడు.
''చూడూ, మీరంటే నాకు వ్యతిరేకత లేదు. ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించు. నా వయస్సెక్కువ. నీకు వృత్తిపరంగా రిస్కెక్కువ. నీ వల్ల నాకు కరోనా సోకితే నేనేమైపోవాలి? దగ్గరలో ఎవరూ లేనివాణ్ణి.''
''సార్‌. ఈ లాక్‌డౌన్‌ టైములో ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యమంటే రోడ్డున పడతాను. ఆలోచించండి.''
''లాభం లేదు సన్యాసిరావ్‌. తప్పదు.''
ఒకరిద్దరు ఆయన తరపున నన్ను ఒప్పించడానికి వచ్చారు. కానీ గట్టిగా అనలేకపోయారు. నేను మెయింటైన్‌ చేస్తున్న దూరం ఇందుకు పనికివచ్చింది.
సన్యాసిరావు ఇల్లు ఖాళీ చేశాడు. ఈ కాలనీలోనే చివరి ఇల్లు దొరికిందట. ఇల్లు ఖాళీ చేసిన రెండు వారాలకి ఆయన కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దానితో ఏమూలో ఉన్న గిల్టీ ఫీలింగ్‌ పోయింది. 'చేసింది రైటే' అనుకున్నాను.
×××
కరోనా ఉధతి పెరుగుతూ వస్తోంది. నేను మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంటికి అవసరమైన మాస్కులూ, శానిటైజర్లు, దినుసులు కొరత లేకుండా చూసుకున్నాను. ఎవరూ ఇంటికి రావడం అలవాటు లేదు కాబట్టి పెద్ద మార్పేమీ కనిపించడం లేదు. అయితే పొరపాటుగా ఎవరొచ్చినా చిరాకుగా చూడడం కొత్తగా వచ్చిన అలవాటు.
వారం క్రితం దగ్గూ జ్వరం మొదలయ్యాయి. కరోనా టెస్టు పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లో సౌకర్యాలున్నందున హౌం క్వారంటైన్‌ ఉండొచ్చన్నారు. అక్కడినుంచి వచ్చాయి అసలైన మార్పులు. కరోనాతో కాదు.. కాలనీతో. ఒక్కొక్కరూ తలుపు తట్టారు. ధైర్యం చెప్పారు. వాళ్ళ ఫోన్‌ నెంబర్‌లిచ్చారు. వేళకి తిండి అందే సదుపాయం చేశారు. ఒకర్ని మించి మరొకరు తోడున్నామంటూ భరోసా ఇచ్చారు. మనుషుల మధ్య సంబంధాల్లో ఎంత మాధుర్యముంటుందో ఇప్పుడే తెలిసింది. ఇప్పుడీ ఆపదలో వెంటనే స్పందించింది వీరే .. బంధువులు కారు.. ఆత్మ బంధువులు.
అందుకే బలంగా అనుకుంటున్నాను.. 'ప్రాక్టికల్‌ .. ప్రాక్టికల్‌ అనే నా విధానం తప్పు. ఓడిపోయాను. మానవ సంబంధాలే ముఖ్యం' అని చెప్పడానికి మళ్ళీ కళ్ళు తెరవాలనుంది. వీళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి బతకాలనుంది.

                                                                   ***

ఐసీయూ నుంచి వార్డుకి, వార్డు నుంచి ఇంటికీ చేరాను. కాలనీ వాళ్లంతా పలకరించడానికి వచ్చారు. వస్తూ 'కరోనా జయించిన వృద్ధుడు' అంటూ పేపర్లో నా గురించి వచ్చిన వార్తను ఆనందంగా చూపించారు.
''కరోనాను నేను జయించలేదు. ఈ కాలనీ వాసుల ప్రేమ, మానవత్వాలు జయించాయి. మీరు నా నిజమైన బంధువులు'' కృతజ్ఞత నిండిన స్వరంతో అన్నాను.
''మీ రుణం ఎలా తీర్చుకోను?'' గొణుక్కుంటున్నట్టు అన్నాను.
''అంత పెద్ద మాటలెందుకు సార్‌? మీరు మా సొంత మనిషి. మీరంటే గౌరవం. మాతో మార్నింగ్‌ వాక్‌లకు రండి. మా పిల్లలతో కబుర్లు చెప్పండి. మాతో కలవండి. అంతే చాలు.''
చిన్నపిల్లల్లా చుట్టూ చేరి సంబరపడ్డారు.
''అవునూ, సన్యాసిరావేడి కనబడటం లేదు. కనబడితే నేను రమ్మంటున్నానని చెప్తారా? వెంటనే మా ఇంట్లోకి వచ్చేయమని, ఈ తండ్రి లాంటివాడి మీద కోపం వద్దని, క్షమించమని అడిగానని చెప్తారా, ప్లీజ్‌.''
''భలేవారు సార్‌. సన్యాసిరావుకి మీ మీద కోపమెప్పుడూ లేదు. మీరు ఆపదలో ఉండగా ప్లాస్మా ఇచ్చి రక్షించింది కూడా ఆయనే. హాస్పిటల్‌లో ఉండగా మీ బాగోగులు ఆయన ద్వారానే తెలిసేవి. ప్రస్తుతం ఆయన డ్యూటీలో ఉన్నాడు. లేకపోతే వెంటనే ఇక్కడ వచ్చి వాలేవాడు.''
ఈసారి కూడా కళ్ళు మూతలు పడుతున్నాయి. అనారోగ్యంతో కాదు.. ఆనందంతో.. ఆనంద భాష్పాలు కళ్ళనిండా నిండడంతో. డా.

డి.వి.జి.శంకరరావు
94408 36931