'కృష్ణవేణి నర్మద గౌతమి/ గంగా పెన్న యలక తుంగభద్ర/ సహ్యతనయ యమున సప్త గోదావరీ/ తీరముల మునింగితిని వెలంది...' అంటాడో కతికర్త. తరతరాలుగా నదీ స్నానాలు ఆచరించడం మనకు సుపరిచితమే. పుణ్యం కోసమనో... ఆరోగ్యం కోసమనో నదీ స్నానాలు ఆచరించేది కొందరైతే, సరదాగా నదుల్లో జలకాలాడేవారు మరికొందరు. అలా అదొక ఆచారంగా స్థిరపడిపోయింది. పుష్కరాల సమయంలో నదీతీరాలన్నీ జనసంద్రాలే అవుతాయి. వాస్తవానికి నదీతీరాలు నాగరికతకు పట్టుగొమ్మలు. యవనికపై గొప్పగా వెలుగొందిన నాగరికతలకు పురుడుపోసింది నదీమతల్లులే. నీటి ధారలను చనుబాలు పట్టించి...నాగరికత వైపు అడుగులు వేయించి... బీడుభూములను మాగాణిలు చేసి రాశులకొద్దీ ధాన్యం పండించి... జాతి వికాసానికి జవసత్వాలద్దింది ఈ నదీ మతల్లులే. వారు వీరు అనిలేకుండా అందరికీ ఆదరణే... ఆపేక్షే. అందుకే... మనిషికి జలం ప్రాణాధారం. అందుకే నదులను పవిత్రంగా చూస్తారు... దేవతలను కొలుస్తారు. నదిని దేవతగా పూజించే ఆచారం మనకు అనాదిగా వుంది. నదులకు పుష్కరాలు జరగడమనేదీ చాలాకాలంగా చూస్తున్నాం. ఆ రకమైన నమ్మకానికి పెద్దగా అభ్యంతర పెట్టాల్సింది కూడా లేదు. అయితే, ఆ నదులు దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం కూడా మన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించిన మనిషి జీవితం... కాలగమనంలో నదికి దూరంగా జరిగిపోయింది.
నదులకు పుష్కరాలొచ్చాయంటూ... పన్నెండు రోజుల పాటు జరుపుతారు. నదీ జలాలను కాపాడటానికి పుష్కరాలను ప్రారంభించారా? లేదా మరేదైనా కారణం వుందా? అనేది పక్కన పెడితే... నదుల పేరుతో ప్రజల నమ్మకం మీద, సెంటిమెంట్ మీద ఆడుకుంటున్నారు. గంగాయాత్ర పేరుతో దేశమంతా గంగాజలాన్ని తిప్పారు. ఎ.పి రాజధాని అమరావతి శంకుస్థాపనకు కూడా గంగాజలం తెచ్చామంటూ ప్రధాని హడావుడి చేశారు. గంగానది చుట్టూ వున్న పరిశ్రమలు, పరీవాహ ప్రాంతంలోని నగరాలు, పట్టణాల వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న కాలుషాన్ని నివారించడానికి చర్యలేవీ తీసుకోలేదు. గంగానది రక్షణ కోసం కేంద్రప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. ఇన్ని చేసినా గంగానది పరిరక్షణ ఎక్కడా జరగలేదు. కానీ ఆ సెంటిమెంట్‌ని మాత్రం పూర్తిగా వాడేస్తున్నారు. జనాల నమ్మకాల్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు.
రెండోదశ కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంటే... ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో గంగానది ఒడ్డున పెద్దఎత్తున కుంభమేళా నిర్వహిస్తున్నారు. పవిత్ర స్నానాల కోసం లక్షలాది మంది యాత్రికులు ఒకే చోట చేరుతున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారే. వీరు వారి స్వస్థలాలకు వెళ్లి ఎంతమందికి కరోనా అంటిస్తారో తెలీదు. ఈ యాత్రికులు ఇతర రాష్ట్రాలకు కరోనా వాహకాలుగా మాత్రం మారుతున్నారు. 'కుంభమేళా నుండి తిరిగి వచ్చిన యాత్రికులు తమ సొంత రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను ప్రసాదంలా పంపిణీ చేస్తున్నారని' ముంబయి మేయర్ సైతం వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి గాలి ద్వారానూ వ్యాపిస్తున్నట్లు అంతర్జాతీయ మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్'లో ప్రచురించింది. వైరస్ సోకిన వ్యక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల వైరస్ గాలిలోకి వెళుతుంది. ఇతరులు ఆ గాలిని పీల్చినప్పుడు వారికి వైరస్ సోకుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కింబర్లీ ప్రాథర్ చెబుతున్నారు. ఈ రకంగా కరోనాను ప్రసాదంలా పంపిణీ చేస్తోంది సాక్షాత్తూ కేంద్రప్రభుత్వమే.
కడపలోని ఒంటిమిట్ట దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను నిషేధించిన కేంద్రం... లక్షలాది మందితో నిర్వహించే కుంభమేళాకు మాత్రం నీరాజనాలు పడుతోంది. ఒంటిమిట్టకు కరోనా అడ్డొస్తే... కుంభమేళాకు ఎందుకు హారతులు పడుతున్నారు? వీరు నమ్ముతున్న మతానికో, రాముడికో విశ్వాసంగా వుండాలి కదా! అలా కానప్పుడు నీ మతానికే నువ్వు ద్రోహం చేస్తున్నట్లు కాదా..! మరోవైపు వేలాదిమంది రైతులు దీక్షలు చేస్తుంటే కరోనా పేరుతో శిబిరాలను ఖాళీ చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. మరి... కుంభమేళా యాత్రికుల వల్ల కరోనా విజృంభించదా? ఎందుకీ వ్యత్యాసం? ఏమిటీ రాజకీయం? 'సకల తీర్ధములను సకల యజ్ఞంబుల/ తలలు గొరుగుకున్న ఫలము కలదె?' అని వేమన అంటాడు. నేడు కరోనాను పారదోలడం దేశానికి... ప్రభుత్వాలకు, ప్రజలకు తక్షణ కర్తవ్యం.










