Oct 02,2020 07:48

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం మీద విస్తరిస్తూ ఒక పెను సవాలును విసిరింది. అయితే చాలా దేశాలు ఈ కరోనా మీద పోరాటంలో చేతులెత్తేశాయి. ఎప్పుడు వ్యాక్సిన్‌ వస్తుందా, ఎప్పుడు కరోనాను ఆపుతుందా అని ఎదురు చూసే పనిలో పడ్డాయి. ఇప్పటికి మూడు కోట్ల నలభై లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. పది లక్షల మందికి పైగా మరణించారు. గత శతాబ్ద కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా దెబ్బతిన్నది ఎన్నడూ లేదు. అమెరికా, ఇండియా దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిని ఏవిధంగా నిరోధించాలన్న విషయంపై ఈ రెండు ప్రభుత్వాలూ మాట్లాడడం మానివేశాయి. దానికి బదులు అమలులో ఉన్న నియంత్రణలను ఏవిధంగా సడలించాలన్న అంశంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.
ప్రభుత్వాలు కరోనా నియంత్రణ గురించి మాట్లాడడం మానుకున్నాయి అంటే అక్కడ ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఒప్పుకున్నట్టే. మన దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రైవేటీకరించబడిన వైద్య వ్యవస్థ ఇక్కడ ఉంది. సంపన్న దేశాలలోకెల్లా అత్యంత ప్రైవేటీకరించబడిన వైద్య వ్యవస్థ అమెరికాలో ఉంది. ప్రధానంగా ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా నిరోధించవలసిన కరోనా మహమ్మారి నియంత్రణలో ఈ రెండు దేశాలూ విఫలమవడంలో ఆశ్చర్యమేముంది? ప్రైవేటు పెట్టుబడికి లాభాలు రావాలంటే ప్రజలకు జబ్బులు రావాలి. ప్రజలకేమో ఆరోగ్యం కావాలి. ప్రజలకు, ప్రైవేటు పెట్టుబడికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కోవిడ్‌-19 మహమ్మారి స్పష్టంగా చూపిస్తోంది.
ఒక మంచి వార్త ఏమంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 38 వ్యాక్సిన్లు వివిధ ప్రయోగ దశలలో ఉన్నాయి. నిజానికి వీటిని అప్పుడే వ్యాక్సిన్లు అని అనలేము. ఇవి క్యాండిడేట్‌ వ్యాక్సిన్లు మాత్రమే. ఇవిగాక ఇంకో 149 వ్యాక్సిన్లు వివిధ దశలలో తయారవుతున్నాయి. క్యాడిల్లా హెల్త్‌ కేర్‌, భారత్‌ బయోటెక్‌ అనే రెండు ఇండియన్‌ కంపెనీలు మొదటి, రెండవ దశల ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడవ దశ లోకి అడుగుపెట్టనున్నాయి. ముక్కు ద్వారా ఎక్కించే ఒక వ్యాక్సిన్‌ తయారీ గురించి అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీతో భారత్‌ బయోటెక్‌ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
మామూలుగా అయితే ఒక వ్యాక్సిన్‌ ను రూపొందించి పరీక్షించడానికి 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. అందుచేత మనం గనుక ఈ సంవత్సరాంతం లోనో, వచ్చే ఏడాది ప్రారంభం లోనో వ్యాక్సిన్‌ తయారీలో విజయం సాధిస్తే అది చాలా గొప్ప విజయమే అవుతుంది. ఇటువంటి అంటువ్యాధులకు వ్యాక్సిన్లను కనుగొనగలిగే శక్తి, శాస్త్రీయ, సాంకేతిక సామర్ధ్యమూ మన దేశానికి ఉన్నాయని కూడా రుజువౌతుంది. ఈ తరహా అంటువ్యాధులు పేద దేశాలలో మాత్రమే వస్తాయని, వీటికి వ్యాక్సిన్లను తయారు చేసినా వాటి వ్యాపారంలో లాభాలు పెద్దగా రావని బడా ఫార్మా కంపెనీలు భావించడం వల్లనే ఇంతవరకూ ఇటువంటి వ్యాక్సిన్ల తయారీపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. సంపన్న దేశాలలో సైతం ఈ కరోనా విస్తరించి ఒక అత్యవసర పరిస్థితిని సృష్టించడంతో వైద్యశాస్త్రం కరోనా వ్యాక్సిన్‌ తయారీని అత్యవసర కర్తవ్యంగా స్వీకరించింది.
ఇప్పుడు వస్తున్న నివేదికలను బట్టి చూస్తే కరోనాకు నిరోధకశక్తి శాశ్వతంగా ఉండదని స్పష్టం అవుతోంది. ఈ వైరస్‌కు దేశాల హద్దులంటే ఎటువంటి ఖాతరూ లేదు. దేశదేశాలకూ ఇది విస్తరిస్తూనే వుంది. ప్రపంచం మొత్తం మీద సామూహిక నిరోధకశక్తి వస్తే తప్ప ఈ వైరస్‌ను నిరోధించడం సాధ్యం కాదు. ప్రపంచం మొత్తంమీద అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటు లోకి రావడం ఇప్పుడిప్పుడే సాధ్యపడేలా లేదు. తమ వద్దనున్న స్పీడ్‌ మనీతో, అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తమ దేశాల జనాభాకన్నా మూడు నుండి అయిదు రెట్లు ఎక్కువ వ్యాక్సిన్‌ను రిజర్వ్‌ చేసుకున్నాయి.
ఇతర అభివృద్థి చెందుతున్న దేశాలకన్నా మన దేశం లో వ్యాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉన్నందున మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. పూనే లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ లో ప్రయోగ దశలో ఉన్న ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గనుక విజయవంతమైతే ఆ వ్యాక్సిన్‌లో ఎక్కువ భాగం మన దేశంలో వినియోగానికే కేటాయించాలన్న ఒప్పందం ఉంది. క్యాడిల్లా, భారత్‌ బయోటెక్‌లకు కూడా ఉత్పత్తి సామర్ధ్యం గణనీయంగానే ఉంది. ఇక డా|| రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 'స్పుత్నిక్‌ వి' అనే వ్యాక్సిన్‌ తయారీలో రష్యన్‌ పరిశోధనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్‌ వివిధ దేశాల్లో మూడో దశ ప్రయోగాల్లో ఉంది.
ట్రంప్‌ ఈ మహమ్మారి విషయంలో ఘోరంగా విఫలమయ్యాక రాబోయే నవంబరు ఎన్నికల ముందు ఏదో సాధించినట్టు చెప్పుకోడానికి నానా పాట్లూ పడుతున్నాడు. అమెరికన్‌ ప్రభుత్వం 1100 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టి త్వరగా వ్యాక్సిన్లను అందుబాటు లోకి తేవాలని చూస్తోంది. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నా వాటిని ప్రజలలోకి విడుదల చేయడానికి అత్యవసరంగా అనుమతులు ఇవ్వాలని అమెరికన్‌ డ్రగ్‌ అధికారులపై ట్రంప్‌ వత్తిడి తెస్తున్నాడు. అయితే ఈ వ్యాక్సిన్లలో ఏవీ ఇంతవరకూ వ్యాధిని నియంత్రించగలవని గాని, కనీసం వ్యాధి వ్యాప్తిని నిరోధించగలవని గాని, తీవ్రతను తగ్గించగలవని గాని ఎటువంటి రుజువునూ చూపలేకపోయాయి. పైగా వీటిలో కొన్ని రెండు విదతలుగా ప్రయోగించవలసినవి. రెండో డోసు ప్రయోగించాక కనీసం రెండు నెలలు ఆగితేగాని వీటి ఫలితాలు తెలియవు. అందుచేత ట్రంప్‌ కోరుకున్నట్టు నవంబరు 3 (ఎన్నికల రోజు) కు ముందుగా వ్యాక్సిన్లు అందుబాటు లోకి రావు.
ఇప్పటికే అమెరికన్‌ డ్రగ్‌ అధికారులు అత్యవసరంగా 'హైడ్రాక్సీ క్లోరోక్విన్‌' వాడకానికి అనుమతించి ఆ తర్వాత నాలుక కరుచుకున్నారు. అదేవిధంగా కరోనా సోకిన వారు కోలుకోడానికి ప్లాస్మా థెరపీకి అనుమతించారు. ఆ తర్వాత దానివలన ఉపయోగం పెద్దగా లేదని తేలింది. మళ్ళీ మూడోమారు తొందరపడడానికి వారు సిద్ధంగా లేరు. మరోవైపున అమెరికాలో యాంటీ సైన్స్‌ ప్రచారం జాత్యహంకార ప్రచారంతోబాటు జమిలిగా సాగుతోంది. వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా వీరు చేస్తున్న ప్రచారం ప్రభావం అమెరికన్లపై పడుతోంది. ఇటువంటి సమయంలో తొందరపడి తగినంత రుజువుల లేకుండానే వ్యాక్సిన్ల వినియోగానికి గనుక తాము అనుమతులిస్తే అది తమకే ఎదురు తిరుగుతుందని డ్రగ్‌ అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
మన దేశంలో కూడా ఇటువంటి పొరపాట్లు జరిగాయి. భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ మీద చేస్తున్న ప్రయోగాల మూడు దశలూ ఆరు వారాల లోపు పూర్తి కావాలని, అలాగైతేనే ఆగస్టు 15న విజయం సాధించామన్న ప్రకటనను చేయవచ్చని ఐసిఎంఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ గట్టి ఆదేశం ఇచ్చారు. అంత తక్కువ వ్యవధిలో మూడు దశల ప్రయోగాలు ఏవిధంగా పూర్తికాగలవన్నది కూడా ఆలోచించలేని స్థితిలో అధికారులున్నారా అని విమర్శలు వెల్లువెత్తిన అనంతరం సర్దుకుని ''అబ్బే, ప్రయత్నం చేయమన్నాం, అంతే'' అని వెనక్కు తగ్గారు, మూడో దశ ప్రయోగాలు విజయవంతం అయితే మన సమస్యలు తీరిపోయాయని అనుకోలేము. ఆ వ్యాక్సిన్లను కనీసం 400 కోట్లు-500 కోట్లు మందికి అందిస్తేనే సామూహిక నిరోధకశక్తి కల్పించడానికి వీలవుతుంది. అంటే కనీసం 800 కోట్లు-900 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలి (వీటిలో ఎక్కువ రెండు డోసుల్లో ప్రయోగించాల్సినవి). ఆ తర్వాత వాటిని ప్రపంచంలో అన్ని కేంద్రాలకూ సరఫరా చేయాలి. ఆ తర్వాతే ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయడం సాధ్యపడుతుంది. పైగా ఈ వ్యాక్సిన్లను శీతల స్థితిలోనే రవాణా చేయాల్సి వుంటుంది. అంటే ప్రపంచమంతటికీ శీతలీకరణ స్థితిలో అందించడానికి తగిన ఏర్పాట్లను కూడా చేయాల్సి వుంటుంది. ఇదేమంత తేలిక కాదు. పాత తరహా వ్యాక్సిన్లను (పోలియో, ఫ్లూ వంటి వ్యాధులను అరికట్టేవి) 2 నుండి 8 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో ఉంచితే సరిపోతుంది. కాని ఈ కొత్త తరహా వ్యాక్సిన్లకు మైనస్‌ 70 నుండి మైనస్‌ 80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో ఉంచాలి. అమెరికా వంటి దేశాలకు సైతం ఇది చాలా కష్టసాధ్యమైన పని. ఇక మన దేశం సంగతి వేరే చెప్పాలా?
ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ చేయడం కూడా మన దేశంలో ఇంతవరకూ లేదు. చాలా విస్తృతంగా నిర్వహించే పోలియో వ్యాక్సినేషన్‌లో కూడా మనం 17 కోట్లకు మించి వ్యాక్సినేషన్‌ చేయడం లేదు. పైగా రెండు డోసుల్లో ఇచ్చే వ్యాక్సినేషన్‌ విషయంలో మరో సమస్య కూడా ఉంది. మొదటి డోసు పుచ్చుకున్న వారిని రెండవ డోసు సమయానికి గుర్తించి మళ్ళీ వారికే వ్యాక్సినేట్‌ చేయడం మన దేశంలో చాలా కష్టం.
సంపన్న దేశాలు తమ వద్దనున్న ధనంతో ముందుగానే కావలసినన్ని డోసుల వ్యాక్సిన్‌ను సేకరించుకోగలుగుతాయి. కాని తక్కిన దేశాల మాటేమిటి? తక్కిన ప్రపంచానికంతటికీ వ్యాక్సిన్లను అందించాలంటే కనీసం 200 కోట్ల డాలర్లు అవసరం అవుతాయి. కాని ఇప్పటికి డబ్ల్యుహెచ్‌వో సేకరించగలిగింది 70 కోట్ల డాలర్లు మాత్రమే. సంపన్న దేశాల నుండి సహాయం అవసరమయ్యే సమయంలోనే అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగింది. రష్యా, చైనా లు తమ దేశాల అవసరాల వరకు ద్వైపాక్షిక అవగాహనతో కలిసి వ్యవహరిస్తున్నాయి.
వ్యాక్సిన్‌ను తయారు చేయడమనేది ఒక శాస్త్రీయమైన సవాలు మాత్రమే అయితే ప్రయోగాలు విజయవంతం అయినట్టు ఎప్పటికి తేల్చగలం? ఎప్పటికి వ్యాక్సిన్‌ను అందరికీ సరిపడా ఉత్పత్తి చేయగలం? ఏ తరగతి ప్రజలకు ఎప్పుడు వ్యాక్సినేషన్‌ చేయాలి? ఏ ధరకు అందించాలి? ప్రపంచం యావత్తూ వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి మనం ఏం చేయాలి? వంటి ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు చెప్పగలిగి వుండేవాళ్ళం. కాని ఇప్పుడు మన ముందు ఉన్నది వికృతమైన వ్యాక్సిన్‌ జాతీయవాదం. ఏ దేశానికి ఆ దేశమే తన ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్‌ అందించాలి అన్న భావనతో వ్యవహరిస్తోంది. కాని కరోనా అదుపు కావాలంటే ఏ దేశానికి ఆదేశం జాగ్రత్త పడితే చాలదని ముందే చెప్పుకున్నాం. మరి ఈ తరహా సంకుచిత భావనలు మనని ఎక్కడకి తీసుకుపోతాయి? ఇటువంటి వైఖరితో మనం కరోనాను నియంత్రించగలమా? వాణిజ్య యుద్ధాల మాదిరిగా రాబోయే కాలంలో వ్యాక్సిన్‌ యుద్ధాలను కూడా చూడబోతున్నామా?