మనుషుల్ని కాపాడటం దేవుళ్ళకు, దైవాంశ సంభూతులు అనుకునేవారికి సాధ్యం కాదు.
కరోనా ధాటికి తట్టుకోలేక అన్ని మతాల అందరు దేవుళ్ళు పారిపోయారు. యుద్ధంలో ఓడిపోయిన - ఎవరికీ ఉపయోగపడని ఆ దైవ భావనని ఇంకా నిలుపుకోవడం ఎందుకూ? మనకు నిజంగా సహాయ పడ్డవారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన విలువ పెరుగుతుంది. నిరంతరం మానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న శాస్త్రవేత్తల్ని గౌరవించుకుందాం. అలాగే వ్యాపారానికి దూరంగా ఉంటూ, సేవా భావంతో పని చేసే ఇతర వృత్తుల వారినందరినీ గుర్తిద్దాం. ఒకరకంగా కరోనా హేతువాదాన్ని తట్టి లేపింది. లేకపోతే మతం, భక్తి, పూజ, ప్రేయర్లు, నమాజులు అన్నీ ఎందుకు పనిచేయలేదూ? అవన్నీ బతుకుదెరువు కోసం మార్గాలు - ఆత్మవంచనలు - నటనలు అని తేలిపోయింది! మత విశ్వాసాన్ని మంచి ప్రవర్తనగా అనుకోగూడదు. ఎందుకంటే మత విశ్వాసానికీ నైతికతకు సంబంధం లేదు. మంచి ప్రవర్తనకు నైతికతకూ గట్టి సంబంధం ఉంటుంది. మత విశ్వాసకులే అనేక అనైతిక కార్యకలాపాలకు పూనుకుంటున్నది మనం ప్రతక్షంగా చూస్తున్నాం! నువ్వు మంచి వ్యక్తివా కాదా? అనేది నీ మత విశ్వాసం మీదనో, నీ స్థాయి మీదనో, నీ సంస్కృతీ సాంప్రదాయాల మీదనో, నీ చర్మం రంగు మీదనో, రాజకీయ ధోరణి మీదనో ఆధారపడి ఉండదు. అది కేవలం నువ్వు ఇతర మనుషుల్ని ఎలా చూస్తావు, వారితో ఎలా వ్యవహరిస్తావనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ప్రపంచంలో దయాళువులకు కొదవలేదు.
సినీ నటులు సోనూ సూద్, ప్రకాశ్‌రాజ్‌లు తెర మీద విలన్లు. కానీ నిజ జీవితంలో హీరోల్లాగా ప్రవర్తించారు. కొందరు సూపర్‌స్టార్లు మాత్రం ఇంట్లో దోశలు వేస్తూనో, చెట్లకు నీళ్ళు పెడుతూనో కాలక్షేపం చేశారు. ఉన్నవాళ్ళు రూ.కోట్లలో విరాళాలు ప్రకటిస్తే, కొందరు సామాన్యులు వెలకట్టలేని దాతృత్వం ప్రదర్శించారు. ఆస్పత్రులలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, ఇంటికొచ్చి వంటలు చేసి వలస కార్మికుల ఆకలి బాధ తీర్చిన వారున్నారు. ఎందరో దయార్ద్ర హృదయలు, ఎన్నో సామాజిక సంస్థలు కుల, మత, ప్రాంతీయ బేధాలు చూడకుండా కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆహారం అందించడం మన చూశాం. రాజకీయాలకు అతీతంగా మనిషిలోని మానవత్వమే గెలచి నిలిచింది.
పరిశుభ్రత - ఆరోగ్యాల ప్రాముఖ్యం తెలిసి వచ్చింది
చేతులు కడుక్కుంటూ ఉండటం, సానిటైజర్లు వాడుతూ ఉండటం మామూలైపోయింది. ఇమ్యూనిటీ గురించిన అవగాహన, విటమిన్ల పరిజ్ఞానం పెరిగింది. జీవ-వైద్య శాస్త్రాల ప్రాముఖ్యం తెలిసొచ్చింది. ఉన్న ఫళాన ఆక్సీ మీటర్ల వాడకం పెరిగింది. గోరు వెచ్చని నీరు తాగడం, అనవసరంగా బయటికి వెళ్ళకుండా ఇళ్లల్లోనే ఉండటం మనకు అలవాటైంది.
జంతుప్రదర్శనశాలల్లో జంతువులు ఎలాంటి బాధను అనుభవిస్తాయో అర్థమయ్యింది.
స్వేచ్ఛగా అడవుల్లో తిరిగే జంతువులు, మనుషుల వినోదం కోసం బందీలై, ముక్కుతూ మూల్గుతూ జంతు ప్రదర్శనశాలల్లో ఎలా కాలం గడుపుతాయో, హౌస్ అరెస్టయిన నాయకులు ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుందో.. ప్రపంచ వ్యాప్తంగా సామాన్య పౌరులు కూడా అలాంటి బాధను, వేదనను అనుభవించాల్సి వచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్లు ప్రకటించినా.. ఆ లాక్‌డౌన్లు ఎన్నో ఇతర రంగాల మీద ప్రభావం చూపాయి. పరిస్థితుల్ని ఎదుర్కొని, తట్టుకోలేని పిల్లల్లో, వద్ధుల్లో ఎన్నో మానసిక సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలకు విఘాతం కలిగింది. కొత్త జీవన విధానాలు అలవరుచుకోవాల్సి వచ్చింది.
మనిషి తన శాస్త్ర సాంకేతికాభివృద్ధిని చూసి విర్రవీగకూడదు. ఇంకా సాధించాల్సింది చాలా వుంది.
కోవిడ్-19కు వ్యాక్సిన్లు వచ్చినా, అవి నూటికి నూరు పాళ్ళు విజయవంతంగా పని చేస్తున్నాయన్న విషయం ఇంకా తేలలేదు.
మనిషి తప్పులు చేస్తే, గుర్తించుకుని వెంటనే సరిదిద్దుకోవాల్సింది కూడా మళ్ళీ మనిషేనన్నది రుజువైంది.
శాస్త్రవేత్తలయినా, మందుల కంపెనీ వారైనా, డాక్టర్లయినా, పారామెడికల్ సిబ్బందయినా, సఫాయి కార్మికులయినా, పోలీసులయినా.. శ్రమించి పని చేసేవారే 'హీరో'లవుతారు. అసమర్థతతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు కీలక స్థానాల్లో వున్నా జనం దృష్టిలో వారు 'జీరో'లే!
ఐ.టి సెల్ పెట్టి వేలాదిమందితో అబద్ధాలు ప్రచారం చేయించినంత మాత్రాన ప్రజల్ని విడదీయడం ఏ ప్రభుత్వానికీ చేతకాదు.
ఇతర దేశాల నుంచి ముస్లింలు రావడం వల్లనే ఇండియాలో కరోనా వ్యాపించిందన్న అబద్ధం ఏమైంది? పౌరసత్వ చట్టానికీ, ఇటీవల నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారి గురించి.. ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారం చేశారూ? కుల మత ప్రాంతీయ భేదాలతో దేశ ప్రజలు విడిపోలేదే? ఐకమత్యంగానే ఉన్నారు.
ప్రభుత్వపు ఆనాలోచిత నిర్ణయాల్ని తిప్పికొట్టారు.
డార్విన్ చెప్పిన 'మనుగడ కోసం పోరాటం' ఎలాగో నిజ జీవితంలో ప్రత్యక్షంగా చూశాం.
కాలి నడకన వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు ప్రయాణించడం, దేశవ్యాప్తంగా షాహీన్‌బాగ్‌లు, సింగూ సరిహద్దులో పంజాబ్, హర్యానా, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్ రైతుల ఆందోళనలు తాజా ఉదాహరణలు. ఇవన్నీ కరోనా రాక ముందు, వచ్చిన తర్వాతా జరిగినవే! ఊపిరి వదిలి, ఊపిరి తీసుకోవడంలో ఒక సంఘర్షణ ఉంది. అడుగు తీసి, అడుగేయడంలో ఒక పోరాటం ఉంది!
ప్రేక్షక పాత్ర వహించిన ప్రభుత్వాధినేతల వల్ల ఏమీ జరగదని తేలిపోయింది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో కోవిడ్-19 చర్యలు తీసుకున్నారు. వారితో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లు జరపడం తప్ప, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ చేసిందేమీ లేదు. నిధులిచ్చిందీ లేదు. ప్రోత్సహించిందీ లేదు. రెండు వ్యాక్సిన్లు బయటికి రాగానే 'మానవత్వ పరిరక్షణలో భారత్ ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్లు ప్రపంచానికి అందిస్తోంది' అని గొప్పగా చెప్పుకున్న ఈ దేశ నాయకుడు, వైజ్ఞానిక పరిశోధనాశాలలకు ఇవ్వాల్సిన నిధుల్లో ఎందుకు కోత విధించారు? వ్యాక్సిన్లు బయటికి రావడంలో శాస్త్రజ్ఞుల కృషి ఎంతో ఉంది. నిరంతరాయంగా ఆ ఇనిస్టిట్యూట్‌లు వ్యాక్సిన్లు కనిపెడుతూనే వున్నాయి. వాటిని ప్రోత్సహించడంలో దేశ నాయకుడి పాత్ర గానీ, కేంద్ర ప్రభుత్వ పాత్రగానీ ఏమీ లేదు. వారి వారి దేశాల్లో ట్రంప్, బోల్సోనారోల విధానాలూ ఇలాంటివే!
భక్తి, ఆధ్యాత్మికత, భజనలు, పూజలు అన్నీ వ్యర్థం! వివేకంతో మసలుకోవడమే ముఖ్యం...
నిజమే! అందుకే జనం వీటిని పక్కన పెట్టి, ఇమ్యూనిటీ పెంచుకోవడం గురించి తెలుసుకుంటున్నారు. నిన్నటి దాకా ఎవరికీ తెలియని 'ఆక్సీ మీటర్' ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటోంది. మదనపల్లెలో అత్యున్నత విద్యావంతులైన తల్లిదండ్రులే విద్యావంతులైన స్వంత కూతుళ్లని చంపుకున్నారు. పైగా వారు బతికి, తిరిగొస్తారని నమ్ముతున్నారు. ఇలాంటి విషయాల్ని అసహ్యించుకునే ప్రజలు...నిజం వైపు, వాస్తవం వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రమాదం కరోనా వల్ల ఎక్కువ జరుగుతోందా? లేక మనిషి వల్లనా అనేది ఇంకా తేలలేదు.
కరోనానే మొదటిది కాదు. చివరిదీ కాదు. కానీ, భ్రమల్లో బతికే మనుషుల వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతోంది. సత్వరం దాన్ని ఆపాలి!
* డా|| దేవరాజు మహారాజు (వ్యాసకర్త... సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)










