Jun 16,2021 06:52

జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశం దేశ ప్రజలకు ఊరటనివ్వలేదు. కరోనా చికిత్సలో అవసర మయ్యే మందులు, పరికరాలు, ప్రాణాధార మైన ఆక్సిజన్‌పై పన్నుల్ని సవరించింది కానీ తొలగించలేదు. ఆఖరికి శ్మశానవాటికలో వినియోగించే విద్యుత్‌ వాటిక ధరపై కూడా ఐదు శాతం పన్ను ఉంటుంది. దాదాపు తగ్గించినవన్నీ ముందు 12 శాతం ఉండగా తర్వాత ఐదు శాతానికి తగ్గించబడినవే. బాగానే తగ్గించామన్నది అధికారిక వాదన అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కరోనా సంబంధిత ఖర్చులో పన్ను మినహాయింపు పూర్తిగా ఉంటేనే సబబు కదా! కనుకనే ఈ సవరణ ఊరటనిచ్చిందని భావించలేం. అంతకన్నా ఆందోళనకరమైనది పెట్రోల్‌, డీజిల్‌ ధరల రోజువారీ పెరుగుదల. రోజురోజుకు పెరిగిపోయి లీటరు వంద రూపాయల్ని సునాయాసంగా దాటాయి. అవి ప్రజల జేబుల్ని నేరుగా చిల్లు చెయ్యడంతో బాటు, వాటి ప్రభావం రవాణా తదితర అంశాలపై పడి అన్ని వస్తువుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. వెరసి ద్రవ్యోల్బణం పెరిగింది. రికార్డు స్థాయి నిత్యవసర వస్తువుల ధరల సూచీ, టోకు ధరల సూచీ సాక్షిగా. కరోనా కారణంగా రాబడి తగ్గిన, ఉపాధి లేని ప్రస్తుత స్థితిలో ఇలా దైనందిక అవసరాల ఖర్చులు పెరగడం ప్రజలకు దెబ్బ మీద దెబ్బ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై కొన్ని పన్నులు తగ్గించుకొంటే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. అంతకన్నా ఎక్కువ మేలు చెయ్యాలంటే ఆ ధరల్ని కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడం. అప్పుడు ఇప్పటిలా ఇబ్బడిముబ్బడి పెరుగుదల ఉండదు. ఏ 20 శాతం పన్ను పరిధిలో పెట్టినా ఇప్పటికంటే చాలా తక్కువ ధరకే వుంటాయి. కనీసం ఆ ప్రయత్నమైనా జిఎస్‌టి కౌన్సిల్‌ చెయ్యలేదు.
                                                     -డా|| డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.