భారత్ 'విశ్వగురు' పాత్రను పోషిస్తోందంటూ మోడీ చాలా గొప్పగా ఊహించుకున్నారు. కానీ, మితిమీరిన విశ్వాసంతో కూడిన ఆ వ్యాఖ్యలతో దేశం, ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మార్చి ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ, భారత్ కోవిడ్ మహమ్మారి ఆట కట్టించిందని ప్రకటించారు. దేశంలో ఒక పక్క కోవిడ్ కేసులు పెరుగుతుండగా
మంత్రి ప్రకటన వెలువడింది. ఇక్కడ వాస్తవం ఏమంటే... విజయం సాధించామని ప్రకటించిన ప్రభుత్వం, ఆరోగ్య శాఖాధికారులు... రక్షణ, అప్రమత్తత చర్యలు తగ్గించారు. ఇప్పుడు వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తుండడంతో పాలక వర్గాలు ఆ వైఫల్యాన్ని ప్రజలపై మోపుతున్నాయి.
ఈ నెల 17న దేశంలో కోవిడ్ కేసులు 2,34,000 దాటాయి. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ లోని అసన్‌సోల్‌లో ఎన్నికల సభలో ప్రసంగించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు వచ్చినందుకు మోడీ వారిని అభినందించారు. గతంలో ఎన్నడూ ఇంతమంది ప్రజలు ఇలా రావడాన్ని చూడలేదని కూడా వ్యాఖ్యానించారు.
ఇటువంటి నిర్లక్ష్యపూరితమైన రాజకీయాలు వేలాదిమంది ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసానికి మోడీ-షా ద్వయం నేరపూరితమైన బాధ్యత ఎంత వుందో ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. గతవారం రోజులుగా రోజువారీ కొత్త కేసులు రెండు లక్షలు దాటుతునే వున్నాయి. కానీ మోడీ, షాలు మాత్రం ఒకరి తర్వాత ఒకరు బెంగాల్‌లో భారీ సభల్లో ప్రసంగిస్తూనే వున్నారు.
కరోనా విపత్తుతో ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్‌లు లేవు, రోగులకు ఆక్సిజన్ లేదు. సకాలంలో కోవిడ్ పరీక్షలు జరగడం లేదు, వ్యాక్సిన్లు అయిపోతున్నాయి. మరణించినవారికి అంతిమ సంస్కారాలు చేసేందుకు శ్మశానవాటికల్లో కూడా ఖాళీ వుండడం లేదు.
మానవుడు సృష్టించుకున్న ఇంతటి విపత్తులో సైతం మోడీ, షాలు బెంగాల్‌ను ఎలాగైనా హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు! వారికి, ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందడమే కావాలి. కరోనా మొత్తంగా కబళించినా సరే.
కరోనా రెండవ దఫా విజృంభించడం, ఆ కారణంగా సంభవించే మరణాలు, విధ్వంసానికి దేశం ఏ మాత్రమూ సంసిద్ధంగా లేకపోవడంలో, అందుకు మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అనడంలో ఎలాంటి సందేహం లేదు.
జనవరిలో, కరోనా మహమ్మారిపై విజయం సాధించామని మోడీ ప్రకటించారు. జనవరి 29న దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో మోడీ ప్రసంగిస్తూ, కరోనాపై భారత్ సాధించిన పురోగతిని ప్రశంసించారు. భారత్ కోవిడ్‌ను సమర్ధవంతంగా కట్టడి చేయడం ద్వారా విపత్తు నుండి ప్రపంచాన్ని కాపాడిందని అన్నారు. ''ఇప్పటి వరకు, భారత్‌లో తయారైన రెండు వ్యాక్సిన్లు వున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయి. దీనివల్ల మనం ఇతర దేశాలకూ వేగంగా, పెద్ద ఎత్తున సాయపడగలుగుతాం.'' అని మోడీ ప్రకటించారు.
ఫిబ్రవరిలో, కోవిడ్ పై భారత్ సాగించిన పోరాటంతో ప్రపంచ దేశాలు స్ఫూర్తి పొందాయన్నారు. మార్చి 11న జరిగిన క్వాడ్ సదస్సు ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతానికి వ్యాక్సిన్లు సరఫరా చేయడంలో భారత్ మహత్తర పాత్ర పోషించడానికి అవకాశం వచ్చిందన్నారు. భారత్‌కు ఈ బాధ్యతను బైడెన్ అప్పచెప్పారు. అదే సమయంలో భారత్‌కు వ్యాక్సిన్ ముడి పదార్ధాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎంతో ఇష్టమైన పదం 'విశ్వగురు'. భారత్ 'విశ్వగురు' పాత్రను పోషిస్తోందంటూ మోడీ చాలా గొప్పగా ఊహించుకున్నారు. కానీ, మితిమీరిన విశ్వాసంతో కూడిన ఆ వ్యాఖ్యలతో దేశం, ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
మార్చి ప్రారంభంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ, భారత్ కోవిడ్ మహమ్మారి ఆట కట్టించిందని ప్రకటించారు. దేశంలో ఒక పక్క కోవిడ్ కేసులు పెరుగుతుండగా మంత్రి ప్రకటన వెలువడింది. ఇక్కడ వాస్తవం ఏమంటే...విజయం సాధించామని ప్రకటించిన ప్రభుత్వం, ఆరోగ్య శాఖాధికారులు... రక్షణ, అప్రమత్తత చర్యలు తగ్గించారు.
ఇప్పుడు వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తుండడంతో పాలక వర్గాలు ఆ వైఫల్యాన్ని ప్రజలపై మోపుతున్నాయి. కోవిడ్ నిబంధనలను అమలు పరచడంలో ప్రజలు అలసత్వం ప్రదర్శించారని, విఫలమయ్యారని విమర్శలు మొదలెట్టారు. భారత్‌లో రూపాంతరం చెందిన వైరస్ (రెండుసార్లు జన్యు పరివర్తనం చెందిన) కొత్త వేరియంట్ పెరుగుతోందన్నా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఈ తరహా వేరియంట్ అక్టోబరు 5నే మొదటగా బయటపడినట్లు తెలుస్తోంది. కానీ, జన్యు క్రమ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు.
'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దర్యాప్తు ప్రకారం, వ్యయభరితమైన, సుదీర్ఘకాలం కొనసాగే ఈ పరిశోధనా క్రమానికి కేవలం రూ.80 కోట్లు అందచేశారు. ఈ అంటువ్యాధి ప్రాబల్యాన్ని, వ్యాప్తిని గుర్తించడంలో విఫలం కావడంతో పరిస్థితి ఈ దశకు చేరుకుంది.
మహారాష్ట్ర, ఢిల్లీ, దేశం లోని ఇతర ప్రాంతాలు తీవ్రమైన మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రుల్లో కేవలం ఆక్సిజన్ లేక రోగులు చనిపోతున్నారు. కరోనా మొదటి వేవ్ తర్వాత ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడంలో ప్రభుత్వం విఫలమైంది. 2020 అక్టోబరులో 150 జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కేవలం రూ.200 కోట్ల విలువ చేసే టెండర్లను ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లోని సంస్థ ఆహ్వానించింది. కరోనా ప్రారంభమైన 8 మాసాల తర్వాత ఇది జరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 33 ప్లాంట్లు మాత్రమే నెలకొల్పారు.
ఇక వ్యాక్సిన్ల విషయానికి వస్తే, భారత్‌లో రెండు టీకాలు సిద్ధమయ్యాయంటూ మోడీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఆ టీకాలు దేశంలో మొదటి 30 కోట్ల మంది జనాభాకు టీకా అవసరాలు తీరేలా వున్నాయి. అసలు భారత్‌లో తయారైన వ్యాక్సిన్ అంటూ చేసే ప్రచారమే బూటకమైనది. ఎందుకంటే ప్రధాన వ్యాక్సిన్ కోవి షీల్డ్-ఆస్ట్రాజెనికా-ఆక్స్‌ఫర్డ్ ప్రాజెక్టు ఉత్పత్తి. భారత్‌లో తయారు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు లైసెన్స్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి మొత్తంగా వున్న గందరగోళ పరిస్థితులను పత్రికలో ఇంతకుముందే చాలా స్పష్టంగా వివరించాం. ఎక్కడ లభ్యమైతే అక్కడ నుండి పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను తెప్పించుకోవడంలో విఫలమవడంతో మోడీ ప్రభుత్వం ఇప్పుడు వరుస ట్రయల్స్‌ను రద్దు చేసి విదేశాల నుండి వ్యాక్సిన్లు తెప్పించడానికి పాట్లు పడుతోంది.
కొత్త వ్యాక్సినేషన్ విధానంలో ప్రకటించినట్లుగా, సార్వజనీన ప్రాతిపదికన ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వం విడనాడింది. 45 ఏళ్ళ లోపు వారికి టీకాలు వేసే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై మోపింది. వ్యాక్సిన్ తయారీదారులకు ఆర్డర్లు పెట్టి బహిరంగ మార్కెట్ నుండి వాటిని సేకరించుకోవాలని సూచించింది.
కేంద్ర బడ్జెట్‌లో వ్యాక్సిన్ల కోసం కేంద్రం రూ.35 వేల కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటివరకు చాలా కొద్ది మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా, మలి విడత వ్యాక్సినేషన్ కోసం బిల్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. ఏడాది కాలంగా కరోనా కొనసాగుతున్నా ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలపై గణనీయంగా, అదనంగా ఖర్చు పెట్టలేదు. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి కేసులో మాదిరిగానే ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు, విస్తరించేందుకు అవసరమైన వ్యయాన్ని పెంచేందుకు కేంద్రం తిరస్కరిస్తోంది.
ఈ నిర్లక్ష్యం, ఉదాసీనతకు ప్రభుత్వ అశాస్త్రీయమైన హిందూత్వ ధోరణి తోడైంది. మూఢ విశ్వాసాలకు ప్రధాన ఉదాహరణగా హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహణకు అనుమతించిన తీరు కనిపిస్తోంది. ఆ కుంభమేళాలో లక్షలాది మంది ప్రజలు పవిత్ర స్నానాల పేరుతో గుమిగూడుతున్నారు. ప్రతి 12 ఏళ్ళకోసారి జరిగే ఈ కుంభమేళా 2022లో జరగాల్సి వుంది. కానీ జ్యోతిష్య లెక్కల కారణంగా ఒక ఏడాది ముందే వచ్చింది. ఎలాంటి నియంత్రణలు, ఆంక్షలు, కట్టడి లేకుండా కుంభమేళాను నిర్వహించేలా ఉత్తరాఖండ్‌లో బిజెపి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ సర్కార్ చర్యలు తీసుకున్నాయి. అయితే తీవ్రంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం, అంతర్జాతీయంగా కూడా కరోనా విజృంభణపైనే అందరి దృష్టి వుండడం చూసిన తర్వాత మాత్రమే మోడీ చివరి నిముషంలో విజ్ఞప్తి చేశారు. కుంభమేళా చివరి దశలో కేవలం లాంఛనప్రాయంగా కొన్ని కార్యక్రమాలను మాత్రమే చేపట్టాలని కోరారు.
మోడీ ప్రభుత్వ ఉదాసీనత, నిర్వహణా లోపం, దూరదృష్టి లేకపోవడం కారణంగానే భారత్‌లో ఈ స్థాయిలో ప్రజారోగ్య విపత్తు సంభవించింది. దీర్ఘకాలంగా ప్రజారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, గత మూడు దశాబ్దాలుగా ఆరోగ్య రంగ ప్రైవేటీకరణ చర్యలతో ఈ దుస్థితి ఏర్పడింది.
ఇంతటి నిరాశా సముద్రంలో వున్నప్పటికీ మనకు ముందుకు దారి చూపించే చిన్న ఆశా రేఖ కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి సంపన్న రాష్ట్రాలు ఆక్సిజన్ కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే కేరళ వంటి రాష్ట్రంలో మాత్రం కొరత లేదు. వాస్తవానికి, కేరళలో మెడికల్ ఆక్సిజన్ మిగులు ఉత్పత్తి వుంది. కోవిడ్‌పై పోరులో భాగంగా దాన్ని తమిళనాడు, కర్నాటక, గోవా, లక్షద్వీప్ కు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు కేరళ ప్రభుత్వం నిధులు సమకూర్చింది. దాంతో ఆక్సిజన్ మిగులు ఉత్పత్తి సాధ్యమైంది. 2020 ఏప్రిల్‌తో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆక్సిజన్ ఉత్పత్తి నిముషానికి 50 లీటర్ల నుండి 1250 లీటర్ల వరకు పెరిగింది.
ప్రజారోగ్య వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా అబివృద్ధి పరచడం, ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఇందుకు ప్రధాన కారణం. కేరళలో కోవిడ్‌కి ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన వారిలో దాదాపు 95 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన వారిలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారి ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, కేరళలో వంద శాతమూ వ్యాక్సిన్లను ఉపయోగించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎక్కడా ఎలాంటి వృధా కాలేదు. 88 లక్షల కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను ప్రభుత్వం ఇప్పటికీ అందిస్తూనే వుంది. తద్వారా ఎవరూ ఆకలితో బాధపడకుండా చూస్తోంది. ప్రజారోగ్యం పట్ల పూర్తి నిబద్ధత, రాజకీయ సంకల్పం వుంటే ఇటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనగలం.
ఈ ప్రజారోగ్య విపత్తుతో పాటు అనివార్యంగా తోడై వున్న మరో ప్రమాదం ఆర్థిక దుస్థితి, ఉపాధి విధ్వంసం. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మోడీ ప్రభుత్వం తన సంకుచిత, వేర్పాటువాద, నయా ఉదారవాద హిందూత్వ దృక్పథాన్ని, ధోరణిని విడనాడాలి. అన్ని రకాల వనరులను సమీకరించి ప్రజలకు సాయపడాలి.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










