May 08,2021 07:30

   నేటికీ ప్రజారోగ్యానికి కేటాయింపులు దేశ జిడిపి లో కేవలం 1.3 శాతం లోపే వున్నాయి. ఇది ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే అతి తక్కువ. కనీసం 6 శాతం కేటాయించాలని వామపక్షాలు, కొన్ని ఇతర విపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైపెచ్చు ఉన్న ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించ కపోవడంతో మరింత శిథిలావస్థకు చేరాయి. మందులు, వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా ప్రజలు గత్యంతరం లేక ప్రైవేటు వైద్యశాలల వైపు నెట్టబడ్డారు. కనీసం కరోనా మొదటి విడత అనుభవంతోనైనా ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టలేదు.
   భారత దేశం కరోనాపై విజయం సాధించిందని పండుగ చేసికొని మూడురోజులు తిరక్కముందే పెనుఉప్పెన వచ్చిపడింది. ప్రజలు కకావికలులైనారు. ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు దొరక్క దళారీల వలలో చిక్కుకొంటున్నారు. వేలాది రూపాయలు చెల్లించి బెడ్లు, మందులు దక్కించుకున్నా ఆక్సిజన్‌ దొరక్క, వెంటిలేటర్లు లేక నిస్సహాయంగా ప్రాణాలొదులుతున్నారు. శవ దహనానికి శ్మశానవాటికలో సమయం దొరక్క పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. మేమండగా ఉన్నామంటూ పలు దేశాధినేతలు ముందుకొస్తున్నారు. భారత ప్రజల దుర్భర పరిస్థితుల పట్ల ప్రపంచ ప్రజానీకం కన్నీరు పెడుతోంది. కానీ అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం మద్రాస్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు (30.4.2021) వచ్చిన వార్తలు కరోనా గాయాలపై కారం చల్లాయి. హృదయ విదారక దృశ్యాలు కఠోర వాస్తవాలా? లేక కేంద్రం అఫిడవిట్లో చెప్పిన మాటలు వాస్తవాలా? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
 

                                                          ఎందుకీ పరిస్థితి వచ్చింది ?

   వైరస్‌ రూపాంతరం (మ్యుటేషన్‌) చెందడం సహజమని, గత ఏడాది జనవరిలో ప్రారంభమైన తర్వాత పలు దేశాలలో రెండవ దశ విలయం వచ్చిందని, భారత్‌ కు కూడా ప్రమాదం పొంచి ఉందని, విపక్షాలు, శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికలను కాలదన్ని, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసికోకుండా నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యంతో కరోనాపై విజయం సాధించామని పాలకులు ప్రచారం చేసిన ఫలితమే నేటి దయనీయ స్థితికి కారణం. తీరా ప్రమాదపు హెచ్చరికలు మోగిన వెంటనే మేల్కొని యుద్ధ ప్రాతిపదికన సర్వ సన్నాహాలు చేయాలి. మేధావులు, వైద్య నిపుణులు, రాజకీయ పక్షాలన్నిటితో చర్చించి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. పారదర్శకతతో ప్రజలకు వాస్తవాలు వివరించి తగు సూచనలు చేస్తూ, ఆత్మస్తైర్యాన్ని నింపాలి. అందరిని అందులో భాగస్వాములను చేయాలి. ఇందులోనూ ప్రభుత్వం ఘోరాతిఘోరంగా విఫలమైంది. ఫలితంగా ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కొరత ఏర్పడి ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ మరణాలు కరోనా మరణాలు కాదు. ప్రభుత్వ సామూహిక హత్యలేనని కొందరు చేసి వ్యాఖ్యలు అక్షర సత్యాలు కాదా? ఇన్ని వైఫల్యాలు మూట కట్టుకొని ప్రజల ప్రాణాలతో చలగాటమాడి తీరా విపత్తుకు ప్రజలే కారణమని నిందించే దుర్మార్గానికి గోడీ మీడియా ఒడిగట్టింది.
 

                                                        వ్యాక్సిన్‌-ప్రభుత్వ వైఫల్యం

   వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించే ముందే ఎన్ని దశలలో ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలి? ఏ దశలో ఎంత మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలి, అందుకు ఎన్ని డోసులు కావాలి? తదితర వివరాలన్నీ క్రోడీకరించి ప్రణాళికలు సిద్ధం చేసి పారదర్శకంగా ప్రజలందరికి వివరించాలి. ఇవేవీ జరగలేదని నేటి పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అలాగే వ్యాక్సిన్‌కి ఉన్న పరిమితులు, ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి వారిని సన్నద్ధం చేయాలి. ఇవేవి చేయకుండా అర్ధాంతరంగా వ్యాక్సిన్‌ వేయనారంభించి... ప్రజలు ముందుకు రాలేదని ప్రజలను నిందించే పనిలో పడ్డారు. తీరా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించడం, వైద్య శాస్త్ర నిపుణులు వ్యాక్సిన్‌ ప్రయోజనాలు, ఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో ప్రజలు వ్యాక్సిన్‌ కోసం తరలివచ్చారు. దాంతో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. వచ్చిన వారు వెనుదిరిగి వెనక్కి వెళ్లాల్సి రావడం, మొదటి డోసు కాల పరిమితి ముగుస్తున్నదనే ఆందోళన ప్రజలను అయోమయంలోకి నెట్టాయి. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే తప్ప ప్రజల తప్పు ఎంత మాత్రం లేదు. ఇవేమీ పట్టని ప్రభుత్వం ఎన్నికల్లో నెగ్గడమెలా అనే దానిలో కూరుకుపోయింది. ప్రధాన మంత్రి, హోం మంత్రుల సభలకు వేలాదిగా ప్రజల సమీకరణలో పార్టీ శ్రేణులు తలమునకలైనారు. కుంభ మేళాకు లక్షలాదిగా తరలి వచ్చేలా ప్రేరేపించేందుకు వేలాది కోట్ల రూపాయల వాణిజ్య ప్రకటనలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఇది కూడా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దుగ్ధతో చేసిందేననే విమర్శ సరైనదేనని అర్ధమవుతున్నది.
 

                                                        న్యాయస్థానాలు నిలదీసినా...

   న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రజలకు జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దేశ రాజధాని ఢిల్లీ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఢిల్లీ హై కోర్ట్‌ పదేపదే నొక్కి వక్కాణించింది. ఢిల్లీ హైకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ నాయకులు తమ న్యాయవాదులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టును వేడుకోవాల్సి వచ్చింది. ఒక న్యాయవాది తన బంధువుకు ఆసుపత్రిలో బెడ్‌ కేటాయించేలా చూడాలని కోర్టుని వేడుకొంటుండగానే రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఆవేదనలో 'నేను ఓడిపోయాను, నాకు ఇంకా ఎలాంటి సహాయం అవసరం లేద'ని దయనీయంగా చెప్పాడు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి ఓడింది 'నీవు కాదు, ప్రభుత్వం, మనందరం' అని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే 5 నగరాలలో లాక్‌డౌన్‌ ప్రకటించాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. సుప్రీం కోర్ట్‌ సహితం రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరచింది. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో గత 12-14 నెలలుగా ముందస్తు జాగ్రత్తల కోసం మీరేం చేస్తున్నారని మద్రాస్‌ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జనవరి నాటికి కరోనా పూర్తిగా తగ్గిందని, ఆ తర్వాత విజృంభించింది, వెంటనే అన్ని చర్యలు చేపట్టామని కేంద్రం అఫిడవిట్‌ సమర్పించింది. ఇది అత్యంత దుర్మార్గం. కోర్టును పక్కదారి పట్టించడం తప్ప మరొకటి కాదు. అన్ని చర్యలు చేపడితే దేశ రాజధాని లోనే వందలాది మంది ఆక్సిజన్‌ దొరక్క ఎందుకు మరణించారు? ఐర్లాండ్‌ లాంటి చిన్న దేశాలు కూడా మనకు వైద్య పరికరాలు ఎందుకు పంపాల్సి వచ్చింది. విదేశీ సహాయం పెద్ద ఎత్తున అందక పోయి ఉంటే దేశంలో ఇంకెంత మంది బలయ్యేవారు? వ్యాక్సిన్‌ పై రెండు రకాల ధరలు ఏమిటని సుప్రీం కోర్ట్‌ కేంద్రాన్ని నిలదీసింది తప్ప ప్రజల రాజ్యాంగబద్ధ హక్కైన జీవించే హక్కును కాపాడటంలో విఫలమైనప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని శాసించలేదు. అలా జరక్కపోవడం శోచనీయం.
 

                                           పడకేసిన ప్రజారోగ్యమే నేటి దుస్థితికి కారణం

   ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని చిన్నచూపు చూశాయి. నేటికీ ప్రజారోగ్యానికి కేటాయింపులు దేశ జిడిపి లో కేవలం 1.3 శాతం లోపే వున్నాయి. ఇది ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే అతి తక్కువ. కనీసం 6 శాతం కేటాయించాలని వామపక్షాలు, కొన్ని ఇతర విపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైపెచ్చు ఉన్న ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించక పోవడంతో మరింత శిథిలావస్థకు చేరాయి. మందులు, వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫలితంగా ప్రజలు గత్యంతరం లేక ప్రైవేటు వైద్యశాలల వైపు నెట్టబడ్డారు. కనీసం కరోనా మొదటి విడత అనుభవంతోనైనా ప్రజారోగ్యం పైన దృష్టి పెట్టలేదు. రెండవ దశ వచ్చే ప్రమాదముందని అనేకమంది మేధావులు, వైద్య శాస్త్ర నిపుణులు, విపక్షాలు మొత్తుకున్నా పట్టించుకోలేదు. దాన్ని తట్టుకునే మౌలిక వసతుల కల్పనపై కనీస శ్రద్ధ పెట్టలేదు. కరోనా మొదటి దశ సందర్భంగా స్పెయిన్‌ దేశం ఆ దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులన్నిటిని జాతీయం చేసిన వైనం చూశాం.
   ఆరోగ్యమే మహా భాగ్యం అనేది మనందరికీ తెలిసిందే. నేడు అది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో కరోనా రుజువు చేసింది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆ దేశ సంపద పెరుగుతుందని, అనారోగ్యంతో ప్రజలు కునారిల్లుతుంటే ఆర్థిక వృద్ధి దివాళా తీస్తుందని గతంలో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా ప్రజారోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత లోకి వచ్చేందుకు ప్రజలే కదలాలి.
ఇన్ని వైఫల్యాలు, నిర్లక్ష్యం, అచేతనంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం ప్రభుత్వానికి లేదు. నైతిక హక్కు అంతకంటే లేదు. నేటి ప్రభుత్వానికి అవే ఉంటే ప్రజలకు ఈ దుస్థితి దాపురించేది కాదు. అందుకే ప్రజలు కదలాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రధాని, హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలి. ఓటుతో అధికారం అప్పగించిన ప్రజలకే అడిగే హక్కు ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకుండా తక్షణం ప్రజలంతా కదలాలి. ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకు నిలదీయాలి. ఇదే నేటి దేశభక్తులందరి కర్తవ్యం కావాలి.
 

/ వ్యాసకర్త ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌
జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి /
ఆర్‌. లక్ష్మయ్య