Apr 28,2021 06:46

వ్యాక్సిన్‌ డిప్లమసీ పేరుతో ఖ్యాతి వస్తుందని నమ్మించి మన వ్యాక్సిన్‌ విదేశాలకు పంపారు. ఈలోగా దేశంలో కొరత వచ్చింది. ఒక డోసు తీసుకున్న వారికి రెండో డోసుకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఏప్రిల్‌ 11 నుండి 14 వరకు 'వ్యాక్సిన్‌ మహోత్సవం' పేరుతో మారుమోగించారు. కాని వ్యాక్సిన్‌ లేకుండానే 'వ్యాక్సిన్‌ ఉత్సవం' అంటే ప్రపంచమే నవ్విపోతుంది. ఈ మహమ్మారిని ఎదిరించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ ప్రభుత్వమే ప్రజలకు అందించాలి. కాని మోడీ ప్రభుత్వం దాన్ని సైతం వ్యాపారంగా మార్చేసింది.
  దేశాన్ని మరో కరోనా ప్రవాహం ముంచెత్తుతోంది. ఇది గత సంవత్సరం దాని కన్నా మరింత తీవ్రంగా ఉంది. వేగంగా విస్తరిస్తోంది. గ్రామాలను కూడా ముంచెత్తుతోంది. ఈసారి యువతరం ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇది అక్షరాలా ప్రజారోగ్య సంక్షోభమే. ఇది సాధారణ ఆరోగ్య అత్యవసర పరిస్థితికన్నా తీవ్రమైనది. భారత దేశం ఇంత దీనావస్థలో మునుపెన్నడూ లేదు. మనల్ని చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది. భారతదేశం కరోనాలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఆర్థిక రంగంలో అగ్రస్థానం లోకి రాకున్నా కరోనాలో మొదటి స్థానం సాధించినందుకు మోడీని అభినందించాలి. ఈ వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య అధికారిక లెక్కల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వుంటుందని, ప్రభుత్వం వాస్తవాలను దాస్తున్నదని మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. మన అనుభవం చూసినా ఇది నిజమని అర్ధమవుతుంది.


                                                నీరో చక్రవర్తిలా మోడీ మహారాజా

   మోడీ తీరు చూస్తుంటే రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటున్న చక్రవర్తి లాగా ఉన్నారు. దేశమంతా కరోనా భయంతో గగ్గోలు పెడుతుంటే ఆయన బెంగాల్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీలో కూర్చొని మన్‌ కీ బాత్‌ లో మాట్లాడుతూ జనం గుమికూడొద్దని, దూరం ఉండాలని సుద్దులు చెపుతారు. ఆయనే బెంగాల్‌ వెళ్లి అంత జనాన్ని పోగేసినందుకు తమ కార్యకర్తల్ని పొగుడుతారు. ఈ రెండు నాల్కల ధోరణి కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. ఆయనకన్నా తామేమీ తక్కువ తినలేదని కుంభమేళాలో లక్షలాదిమందిని చూసి భక్తబృందం మురిసిపోతుంది. అంతేకాదు గంగా జలాల్లో మునిగితే కరోనా దగ్గరకు కూడా రాదని సూక్తులు వినిపిసు ్తన్నారు. గత సంవత్సరం ఢిల్లీలో తబ్లిక్‌ సమావేశంపై బిజెపి చేసిన దాడిని మరిచిపోలేం.మానవత్వాన్ని మరచి మతాన్ని బట్టి తీర్పునివ్వడం మతోన్మాదులకు సహజ నైజం. జనం హాహాకారాలు మోడీ చెవిన పడటం లేదు. మోడీ భక్తబృందం జనం ఏడవటానికి నోరు తెరిచినా నొక్కేస్తున్నారు. మేధావులు, ప్రతిపక్షాలు సూచనలు చేసినా సహించలేకపోతున్నారు. వారిపై దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు. సిపియం నాయకులు సీతారాం ఏచూరి కుమారుడు చనిపోతే దేశమంతా విచారం వ్యక్తం చేసింది. కాని మోడీ బృందానికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. బీహార్‌ ఎమ్మెల్యే ఒకరు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఏచూరిని చైనా ఏజెంటు అంటూ ఆయన కొడుకును చైనా వైరస్‌ కాటేసిందని వాగాడు. దేశమంతా ఛీకొట్టినా వారికి సిగ్గులేదు. తమ నాయకుడు చేసిన నీచపు వ్యాఖ్యలకు బిజెపి కనీసం విచారంకూడా వ్యక్తం చేయలేదు. అదీ వారు నేర్చుకున్న భారతీయ సంస్కృతి. వారిని చూసి భరతమాత సిగ్గుతో తల దించుకుంటోంది.
 

                                                ప్రజారోగ్యంతో ప్రభుత్వాల చెలగాటం

  కరోనా కల్లోలం ఇంత తీవ్రంగా ఉన్నా దాన్ని నిరోధించడంలోను, ప్రజలకు ఉపశమనం కల్పించడంలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయ్యాయి. టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్మెంటు అనే త్రి సూత్ర పథకాన్ని అమలు చేయాలి. కాని ఈసారి పరీక్షల లేమి, ఆస్పత్రులలో పడకల కొరత, ఆక్సిజన్‌ కొరత, మందుల బ్లాక్‌ మార్కెటింగు ఇలా అన్నీ సమస్యలే.

                                                              పరీక్షలేవీ ?

    రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలి. కాని పాత పరీక్షా కేంద్రాలన్నింటికీ ఎత్తేశారు. రాపిడ్‌ టెస్టులు జరగ డం లేదు. ఇక ఆర్‌టిపిసిఆర్‌ టెస్టుకిస్తే ఫలితం ఎప్పుడొ స్తుం దో తెలియదు. ఈలోగా పేషంట్లు కలసిమెలసి తిరుగుతూనే ఉంటారు. ఇతరులూ దాని బారిన పడతారు. టెస్టు ఫలితం రాకముందే ఆస్పత్రిపాలై అసువులుబాసినవారున్నారు. ఇంత టి హృదయ విదారకరమైన దుస్థితి గతంలో కూడా లేదు.
 

                                                                 బెడ్లు లేవు

   ఒక వేళ పాజిటివ్‌ వస్తే ఆస్పత్రిలో బెడ్లు దొరకడం లేదు.ఇంటి దగ్గరే ఐసొలేషన్‌ లో ఉన్నా ఉన్నట్లుండి ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతే ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బెడ్డు దొరకడం లేదు. దానికీ పెద్ద పెద్ద రికమెండేషన్లు కావాల్సి వస్తోంది. అయినా దొరక్క అలసిపోయి ఆస్పత్రుల ముందే నేలకొరిగిన వారూ ఉన్నారు. పేదవారే కాదు మధ్యతరగతి ఆపైన వర్గాల వారికి కూడా తిప్పలు తప్పలేదు.
బ్లాకులో మందులు
   బెడ్డు దొరికించుకున్నా రెమ్‌డెసివిర్‌ లాంటి మందులు రాస్తే వాటి కోసం కాళ్లకు బలపం కట్టుకొని తిరగాల్సి వస్తోంది. ఎన్ని మందుల షాపు చుట్టూ తిరిగినా దొరక్క బ్రోకర్లను పట్టుకొని మూడు వేలుండే ఇంజక్షన్‌ను ముప్పయి నలభై వేలు పెట్టి బ్లాకులో కొనుక్కోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో మందుల బ్లాక్‌ మార్కెట్‌ గురించి వినడం ఇదే తొలిసారి. మందుల కంపెనీలే లాభాల కోసం వాటిని దాచిపెట్టి అమ్ముతున్నాయా? లేదంటే మధ్య దళారీలు బ్లాక్‌ చేస్తున్నారా? ఇంతవరకు ప్రభుత్వానికే అంతుబట్టలేదా? లేదా తెలిసీ చెప్పడం లేదా? ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఇంకేమి కావాలి? రెమ్‌డెసివిర్‌ లాంటి మందుల్ని తయారు చేసే కంపెనీలు రెండూ మూడే ఉన్నాయి. వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేదు.
 

                                                      ఆక్సిజన్‌కు దిక్కు లేదు

   ఆక్సిజన్‌ సరఫరా లేక ఆస్పత్రులలో జనం గిలాగిలా కొట్టుకొని డాక్టర్ల కళ్ల ముందే వారు కళ్లు మూస్తుంటే డాక్టర్లు కన్నీళ్లు పెట్టుకోవడం మినహా ఇంకేమీ చేయలేని తమ నిస్సహాయతకు తామే సిగ్గుపడే స్థితి నేడు కనిపిస్తున్నది. ఆక్సిజన్‌ కొరత దేశ రాజధానిలోని పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే వచ్చింది. ఆక్సిజన్‌ సరఫరా లేక విజయనగరం ఆస్పత్రిలో పదిమంది దాకా చనిపోవడం ఎవరికైనా కన్నీరు పెట్టిస్తుంది. అర్ధరాత్రి హాహాకారాలతో ఆస్పత్రి ఆవరణంతా మారుమోగిపోయింది. మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తగినంత ఆక్సిజన్‌ తయారు చేస్తున్నా దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఆక్సిజన్‌ కొరత లేదని మంత్రులు పదేపదే ప్రకటిస్తున్నారు. మరో వైపు అన్ని ఆస్పత్రులూ ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న ఆస్పత్రులకు అసలు సరఫరానే లేదు. మధ్యలో ఆక్సిజన్‌ ఎలా ఆవిరైపోతున్నది.

                                  పథకాలు అవసరమే...కానీ ప్రజల ప్రాణం అంతకన్నా ముఖ్యం

   మన రాష్ట్ర ప్రభుత్వం రోజువారి పథకాల అమల్లో మునిగి తేలుతోంది. వివిధ పథకాల ద్వారా ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు సహాయం అందించడం ముఖ్యమే. కాని దానికి ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని పనులు పక్కనపెట్టి ప్రారంభాలు చేసి పంచాల్సిన అవసరం లేదు. వాటిని రొటీన్‌ గా బ్యాంకులో జమ చేయొచ్చు. విలువైన ఆ సమయాన్ని కరోనా నివారణకు వినియోగించి ఉంటే దీని నష్టాన్ని కొంతవరకైనా తగ్గించడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే ఐసొలేషన్‌ లేదా క్వారంటైన్‌ కేంద్రాలను తెరచి చాలా మందికి ఊరట కల్పించి ఉండొచ్చు.
 

                                                      నరకం చూస్తున్న పేషంట్లు

  మరో వైపు ప్రైవేటు ఆస్పత్రులలో ఇదే అదనుగా టెస్టుల పేరుతో వేలకు వేలు గుంజేస్తున్నారు. హోం క్వారంటైన్‌ లో వుండే వారికి ఆన్‌లైనులో వైద్యం అందించడానికి లేదా కనీసం మందుల కిట్‌ ఇవ్వడానికి కూడా సరైన ఏర్పాట్లు లేవు. మారుమూల ప్రాంతాల ప్రజలు ఇక చెప్పనలవి కాదు. పట్టణాల్లోనే పేషంటు పరిస్థితి తీవ్రమైన వెంటనే 104 లేదా 108 అంబులెన్సు కోసం ఫోన్‌ చేస్తే వస్తున్నట్లే ఉంటుంది కానీ ఎప్పటికో కానీ రాదు. రాత్రి చేస్తే ఉదయానికి వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో తప్ప భరోసా ఆచరణలో కనిపించడం లేదు. ఒకటి రెండు రోజుల నుండి కొంత ప్రయత్నం మొదలైనా అది తీవ్రతకు తగ్గట్లుగా లేదు.
 

                                                   వ్యాక్సిన్‌ సరఫరాలో వైఫల్యం

   అన్నింటిలోకి పెద్ద వైఫల్యం వ్యాక్సిన్‌. గత సంవత్సరం ఆగస్టు 15కే భారతీయ వ్యాక్సిన్‌ వచ్చేస్తుందని డబ్బా వాయించారు ప్రధాని. వాస్తవాలతో నిమిత్తం లేకుండా బడాయికి పోయి ప్రజల్ని భ్రమల్లో ముంచారు. అయినా జనవరి నాటికి రెండో దశ టెస్టింగు పూర్తి చేసుకొని మూడో దశ టెస్టు నేరుగా ప్రజల మీద చేయడానికి అనుమతినిచ్చింది. రెండు కంపెనీలు ప్రధానంగా వీటిని తయారు చేస్తున్నాయి. కోవిషీల్డు పేరుతో సీరం సంస్థ (పూనా) ఆక్స్‌ఫర్డు నుండి దిగుమతి చేసుకున్న టీకాను అభివృద్ధి చేసింది. కోవాగ్జిన్‌ పేరుతో భారత్‌ బయోటెక్‌ (హైదరాబాద్‌) దేశీయ టీకాను తయారు చేసింది. రెండూ ముడి సరుకును విదేశాలు ముఖ్యంగా అమెరికా, యూరోపుల నుండి దిగుమతి చేసుకోవాలి. కాని అమెరికా ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. దానితో మన ఉత్పత్తి నిలిచిపోయింది. అప్పటికే విదేశాలకు ఎగుమతి చేయడానికి మన ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా అమెరికా ఒత్తిడి ఫలితమే. వ్యాక్సిన్‌ డిప్లమసీ పేరుతో ఖ్యాతి వస్తుందని నమ్మించి మన వ్యాక్సిన్‌ విదేశాలకు పంపారు. ఈలోగా దేశంలో కొరత వచ్చింది. ఒక డోసు తీసుకున్న వారికి రెండో డోసుకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఏప్రిల్‌ 11 నుండి 14 వరకు వ్యాక్సిన్‌ మహోత్సవం పేరుతో మారుమోగించారు. కాని వ్యాక్సిన్‌ లేకుండానే వ్యాక్సిన్‌ ఉత్సవం అంటే ప్రపంచమే నవ్విపోతుంది. కరోనా నివారణకు వ్యాక్సిన్‌ మినహా మరో మార్గం లేదని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్తున్నారు. ఈ మహమ్మారిని ఎదిరించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ ప్రభుత్వమే ప్రజలకు అందించాలి. చాలా దేశాలు అలా అందిస్తున్నాయి కూడా. కాని మోడీ ప్రభుత్వం దాన్ని సైతం వ్యాపారంగా మార్చేసింది. ఈ రెండు కంపెనీల నుండి కేంద్రం సగం రూ. 150కు సేకరించి 45 సంవత్సరాలు దాటిని వారికి అందిస్తుంది. మిగతా వారికి అంటే 18-45 సంవత్సరాల మధ్య వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాలని మొదట ప్రకటించింది. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే మాట మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుక్కొని ఉచితంగా ఇవ్వొచ్చని చెప్పి తాను బాధ్యత నుండి తప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.600 కు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1200కు అమ్మాలని కేంద్రం నిర్దేశించింది. ఇంతకన్నా వివక్షత ఏమన్నా ఉందా? ఏ కంపెనీ అయినా ప్రైవేటువారికే అమ్ముకుంటుంది తప్ప సేవాతత్పరతతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వదు. మే 1 నుండి 18 సంవత్సరాలు దాటిని వారికి కూడా ఉచితంగా టీకాలు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మరల వెనక్కి తగ్గింది. కారణం టీకాలు లభ్యం కాకపోవడమే. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది.
 

                                                         వైద్యం కార్పొరేట్‌ పరం

      వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కాని నేటి పాలకులు వైద్యో కార్పొరేట్‌ హరీ అంటున్నారు. వైద్య రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌ పరం చేసిన దుష్ఫలితం ఇది. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యకు అర్ధం ఇదే. విద్య, వైద్యం లాంటి సేవారంగాలను కార్పొరేట్‌ పరం చేస్తే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో, సమాజం ఎంతగా నష్టపోతుందో దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది. మోడీ పాలనా సామర్ధ్యంపై యువతలో కనువిప్పు విధానాల వైఫల్యంతో పాటు యాజమాన్య లోపాలూ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మోడీ పెద్ద సమర్ధుడైన పాలకుడని నమ్మినవారి కళ్లు తెరుచుకుంటున్నాయి. డబ్బాలో గులకరాళ్లు వేసి కొడితే వచ్చినట్లు శబ్దాడంబరం తప్ప ఆచరణ శూన్యమని దేశం నేడు కోడై కూస్తోంది. కంచు మోగినట్లు కనకంబు మోగునా అని ఏనాడో ఒక కవి అన్నాడు. అది మోడీ విషయంలో నూటికి నూరు పాళ్లూ నిజం. మోడీ బంగారం అనే నోళ్లే నేడు కరోనా సంక్షోభంలో ఆయన నాయకత్వ తీరును చూసి అది బంగారం కాదు కంచు మోతే అంటున్నాయి.
 

                                               పాలకుల విధానాలపై గొంతు విప్పాలి

   అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును మార్చాలంటే ప్రజలు గొంతు విప్పక తప్పదు. కరోనా భయంతో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకొచ్చి ముఖ్యంగా యువతరం గొంతు విప్పాలి. ఆరోగ్యం మన జన్మహక్కని అరవాలి. దాని కోసం రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా సోషల్‌ మీడియా ద్వారా మీ గొంతు వినిపించవచ్చు. పాలకుల కళ్లు తెరిపించడానికి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. సార్వజనీన వ్యాక్సినేషన్‌ ఉచి తంగా వేయాలని డిమాండు చేయాలి. బ్లాక్‌ మార్కె టింగుపై యుద్ధం ప్రకటించాలి. ప్రభుత్వాల మత్తు వదిలిం చాలి. ప్రజా చైతన్యమనే కొరడాతో ప్రభుత్వాలను మేల్కొలపాలి.
 

/ వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు /
వి. శ్రీనివాసరావు

వి. శ్రీనివాసరావు