Apr 18,2021 12:50

ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ మన దేశాన్ని గడగడలాడిస్తోంది. ఏడాదిగా మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి లాక్‌డౌన్‌ వంటి పరిణామాలను, అనేక ఆరోగ్య పాఠాలను నేర్పిన కరోనా మొదటిసారిగా డిసెంబర్‌ 8వ తేదీ 2019లో చైనాలో గుర్తించబడింది. అనంతరం కోవిడ్‌ 19 వైరస్‌ అతికొద్ది కాలంలోనే ప్రపంచమంతా పాకింది. అన్ని రంగాలనూ దెబ్బతీస్తూ ఆర్థికంగా అభివద్ధి చెందిన దేశాలను సైతం గడగడలాడిస్తోంది. మనదేశంలో 2020 జనవరి 30న తొలిగా గుర్తించబడింది. అతికొద్ది కాలంలోనే దేశమంతా విపరీతంగా విస్తరిస్తూ ప్రస్తుతం రోజుకు సుమారుగా రెండు లక్షల మందికి సోకుతోంది. దగ్గరదగ్గర వెయ్యికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటూ విలయ తాండవం చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి మనదేశంలో సెకండ్‌ వేవ్‌ దశలో ఉంది. అయితే చాపకింది నీరులో రెండో వేవ్‌ విస్తరిస్తోంది. రోజుకు సగటున లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మొదటి వేవ్‌ నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు అనేక కారణాలున్నాయి. ఈ సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే ప్రధానంగా ఈ కథనం..

కరోనా సందర్భంగా సెకండ్‌ వేవ్‌ దశ అన్నది సాధారణ ప్రజానీకం తరచూ వింటున్న మాటే.. ఇదేమీ కొత్త పదం కాదు. వాస్తవానికి శతాబ్దాల కాలంగా వింటున్న పదమే. అయితే వేవ్‌ అనే పదాన్ని ఉపయోగించేది సముద్రంలోని అలలను కదా. మరి వైరస్‌కు ఇది ఎలా సరిపోతుంది అంటే?. సాధారణంగా ఇన్ఫెక్షన్లు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా తరంగాలతో పోల్చుతారు. సముద్రపు అలల్లో హెచ్చు తగ్గులు ఉన్నట్టుగానే కోవిడ్‌లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. వందేళ్ల క్రితం స్పానిష్‌ ఫ్లూ విషయంలో కూడా ఇలాగే జరిగింది.

కరోనా కడలిలో రెండో అల..


సెకండ్‌ వేవ్‌ అంటే?
కరోనా వ్యాధి వచ్చినవారికి మళ్లీ రావడమే కరోనా సెకండ్‌ వేవ్‌ అని చాలా మంది భావిస్తున్నారు. వ్యాధి విపరీతంగా సోకి క్రమంగా తగ్గి, మళ్ళీ విపరీతంగా పెరగడాన్ని సెకండ్‌ వేవ్‌ అంటారు. పెరుగుతూ పోయి తగ్గినట్టే తగ్గి, మళ్లీ పెరగడం అన్నది సముద్రపు అలల్లాగా ఉంటుంది. కాబట్టి దీనిని సెకండ్‌ వేవ్‌ అంటారు. మనదేశంలో మొట్టమొదటి కరోనా కేసు 2020 జనవరి 30న గుర్తించబడింది. ఈ వ్యాధి క్రమంగా పెరుగుతూ మే 21 నాటికి రోజుకి 8105 మందికి సోకింది. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతూ సెప్టెంబర్‌ 16 నాటికి రోజుకు 97,894 మందికి సోకే దశకు చేరింది. ఆ రోజు నుంచి రోజు వారీ సంఖ్య తగ్గుతూ ఫిబ్రవరి 1 నాటికి 8,635 మందికి సోకింది. ఈ రోజువారీ సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రోజుకు సుమారు రెండు లక్షల మందికి సోకుతుంది. మొదటిసారి పెరుగుతూ ఉండడాన్ని మొదటి వేవ్‌ అంటారు. తగ్గుతూ వచ్చి మళ్లీ పెరగడాన్ని రెండో వేవ్‌ అంటారు. మళ్లీ తగ్గి పెరగడాన్ని మూడో వేవ్‌ అంటారు. కొన్ని దేశాల్లో ప్రస్తుతం మూడో వేవ్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మూడో వేవ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కట్టడి జరిగే లోపు ఎన్ని వేవ్‌లు వస్తాయో! ఎంత కాలం పడుతుందో!!


తాజాగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎప్పటివరకూ కొనసాగుతుందనే దానిపై ప్రముఖ వైరాలజిస్ట్‌ షాహిద్‌ జమీల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మే చివరివరకూ కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత కొనసాగుతుందని అన్నారు. దేశంలో రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య మూడు లక్షల వరకూ చేరొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శతాబ్దం క్రితం ప్రబలిన స్పానిష్‌ ఫ్లూ కూడా రెండోసారి అటాక్‌ చేసి, మరింత ప్రమాదకరంగా మారింది. ఇదే కోవలో కరోనా వైరస్‌ కూడా సెకండ్‌ వేవ్‌గా మారింది. ప్రమాదకరంగా మారుతూ ఉంది. ప్రపంచ కరోనా కేసుల లెక్కలు చూస్తే మొదటి స్థానంలో అమెరికా ఉంది. సెకండ్‌ వేవ్‌ కారణంగా రెండో స్థానంలో వున్న బ్రెజిల్‌ని మూడో స్థానానికి నెట్టి, రెండో స్థానానికి మనం చేరుకున్నాం.

అతి తీవ్రమైన వ్యాప్తి మనదేశంలోనే
కోవిడ్‌-19 సోకిన వారి సంఖ్యలో మొదటి, రెండో స్థానంలో ఉన్న అమెరికా, బ్రెజిల్‌ దేశాల కంటే మన దేశంలోనే రెండో వేవ్‌ విస్తృతంగా వ్యాపిస్తుంది. గతవారం సరాసరి లెక్కలు చూస్తే అమెరికాలో రోజుకి 65 వేల మందికి కరోనా సోకితే.. బ్రెజిల్‌లో సరాసరిన రోజుకు 63 వేల మందికి సోకింది. మనదేశంలో రోజుకు లక్షా ఇరవై వేల మందికి సోకింది. ఇంత తీవ్రంగా వ్యాప్తి చెందడానికి కారణాలు అనేకం.

కరోనా కడలిలో రెండో అల..


వైరస్‌ జన్యు రూపాంతరాలు..
ఈ వైరస్‌ జీవనం కొనసాగించడానికి అనుకూలమైన అనేక రూపాంతరాలు చెందినట్లుగా ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఇప్పటికే వెల్లడించింది. సౌత్‌ ఆఫ్రికా వేరియంట్‌, బ్రెజిల్‌ వేరియంట్‌, యునైటెడ్‌ కింగ్డమ్‌ వేరియంట్స్‌, సౌత్‌ ఆఫ్రికన్‌ వేరియంట్‌, డబుల్‌ మ్యుటేషన్‌ వేరియంట్‌ రకాలు మనదేశంలో నమోదైనట్లుగా ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. రూపాంతరాలు కారణంగా వ్యాధి వ్యాపించే తీవ్రత పెరుగుతోంది. వ్యాధి లక్షణాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మారిన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం సాధారణ ప్రజానీకానికే కాక డాక్టర్లకూ చాలా కష్టంగా ఉంది. పరీక్షలు జరిగి, వ్యాధిని నిర్ధారించే లోపు ఈ కోవిడ్‌ రోగి చాలామందికి వ్యాపింపజేసే పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికీ కోవిడ్‌ వ్యాధి రావడానికి ఈ మ్యుటేషన్‌ కూడా ఒక కారణం. ఈ మ్యుటేషన్‌ను గుర్తించడానికి ప్రభుత్వం చేసిన పరీక్షలు చాలా తక్కువగా ఉన్నాయి. జనవరి నుంచి మార్చి వరకూ కోవిడ్‌-19 సోకిన వారిలో ఒక్క శాతం మందికి మాత్రమే ఈ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలను ఇంకా ఎక్కువగా చేయాలి. ఇందుకు అవసరమైన లేబరేటరీలను, క్షేత్రస్థాయి పరీక్షలను మెరుగుపరచాలి. ఎందుకంటే ఇంతవరకూ ఉన్న సమాచారాన్ని బట్టి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ యునైటెడ్‌ కింగ్డమ్‌ వేరియంట్‌కి మాత్రమే రక్షణ కల్పిస్తుంది. మిగిలిన రకాలకు ఎంతవరకూ రక్షణ కల్పిస్తోందో తెలియదు.

లాక్‌డౌన్‌ కాలాన్ని ఉపయోగించుకోని ప్రభుత్వం.. 
లాక్‌డౌన్‌ కరోనా కట్టడికి పూర్తి పరిష్కారం కాదు. ఇది వ్యాధి తీవ్రతను కట్‌డౌన్‌ చేస్తుందేగానీ కట్టడి చేయలేదు. తీవ్రతను తగ్గించుకుంటూ సెకండ్‌ వేవ్‌ లాంటివి రాకుండా, వచ్చినా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఈ లాక్‌డౌన్‌ సమయం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ సమయాన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఈ సమయంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. నివారణా మార్గాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. వైద్య సేవలకు అవసరమైన పరికరాలను, సిబ్బందిని వారికి అవసరమైన శిక్షణా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం ఆ పని చేయకపోగా మొదటి వేవ్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకున్న వైద్య సిబ్బందినీ ఉద్యోగాల నుంచి తీసేశారు. కేటాయించిన ఆస్పత్రులను లిస్టులో నుంచి తొలగించారు. వైద్యానికి కేటాయించిన ఇంటెన్సివ్‌ కేర్‌ పడకలను తగ్గించేశారు. ప్రజల్లో చేయవలసిన నివారణ మార్గాలను, ప్రచారాలను మానేశారు. ప్రధానంగా ప్రభుత్వం విఫలం వల్లనే కరోనా రెండో వేవ్‌ వచ్చింది. ప్రధాని మాత్రం ప్రజల అశ్రద్ధ వల్లే వచ్చిందని చెబుతున్నారు. నిజమే ప్రజల అశ్రద్ధ కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ రావడానికి ఒక కారణం. కానీ ఆ అశ్రద్ధను శ్రద్ధగా మార్చే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా?

కరోనా కడలిలో రెండో అల..


కట్టడికి ముందే దేశంలో ఎన్నికలు..
కరోనా నివారణకు ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, సాధ్యం కాకపోతే కనీసం మూడడుగుల భౌతికదూరాన్ని పాటించాలని సైన్స్‌తో పాటు ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. అయినా గుంపులు గుంపులుగా వేల మందితో కొన్ని సందర్భాల్లో లక్షల మందితో ప్రచారాలు చేసుకునే ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం అనుమతించింది. ఇది కరోనా రెండోవేవ్‌కి ఒక ప్రధాన కారణమని విశ్లేషణలు తెలియ జేస్తున్నాయి. ''నమస్తే ట్రంప్‌'' కార్యక్రమంలో, ''జమాయతే ఇస్లామ్‌'' కార్యక్రమంలో వచ్చిన అనుభవాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. నేడు కుంభమేళాను బేఫికర్‌గా జరిపి, ఫలితం అనుభవిస్తున్నాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 

  • మాస్క్‌ను సరైన పద్ధతిగా, శానిటైజర్‌ని తరచుగా వాడడంలో అలసత్వం చేయవద్దు.
  • వీలైతే ఆరడుగులు కుదరకపోతే కనీసం మూడడుగుల భౌతికదూరాన్ని కచ్చితంగా పాటించాలి.
  • మత, రాజకీయపరమైనవీ, కుటుంబపరమైనవీ ఎటువంటి సామూహిక కార్యక్రమాలకైనా వీలైనంతవరకూ హాజరుకాకపోవడం మంచిది.
  • కరోనా వ్యాక్సిన్‌ చుట్టూ ఉన్న భయాలను పక్కన పెట్టి, అర్హులైన వారందరూ ధైర్యంగా రెండు కోర్సులనూ వీలైనంత త్వరగా తప్పకుండా వేయించుకోవాలి.
  • కారు, ఆటో, బస్సు, రైలు ప్రయాణాలను వీలైనంతవరకూ తగ్గించుకోవాలి.
  • వీలైనంతవరకూ పిల్లలలను బడులకు, కాలేజీలకు పంపడం మంచిది కాదు. అనివార్యమైతే పాఠశాలలో నిబంధనలు అమలు అయ్యేటట్టు చూసుకుని పంపించాలి.
  • క్లబ్బులు, మాల్స్‌, సినిమా థియేటర్స్‌, రెస్టారెంట్లు వీలైనంతవరకూ మానుకోవడం మంచిది.
  • కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నప్ఫటికీ వ్యాధి సోకినప్పటికీ మాకేం కాదని, మాకు వ్యాధి నుంచి రక్షణ ఉందని భావించవద్దు. వ్యాధి నివారణా జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం చేయకూడదు. వాక్సిన్‌ వల్ల వచ్చిన వ్యాధి నిరోధకత, కోవిడ్‌-19 వ్యాధి వల్ల వచ్చిన వ్యాధి నిరోధకత ఎంత కాలం పనిచేస్తుందో ఇంకా తెలియదు.
  • వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి వీలుగా రోజులో కనీసం గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి. కనీసం అరగంట పాటు సూర్యరశ్మి శరీరంపై పడేటట్టు చూసుకోవాలి.
  • విటమిన్‌-బి కాంప్లెక్స్‌, విటమిన్‌-సి, విటమిన్‌-డి ఉన్నటువంటి మాత్రలను ప్రతిరోజూ వేసుకోవాలి. ఇవి కుదరకపోతే రోజుకొక నిమ్మకాయను కానీ, బత్తాయిని కానీ తినాలి.
  • మనం సన్నిహితంగా తిరిగిన మిత్రులకు ఎవరికైనా కరోనా సోకి వుంటే వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించకపోయినా మనం తప్పకుండా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నాకు రాదులే అని ధీమాగా ఉంటే మనం ఏసింటమేటిక్‌ క్యారియర్స్‌గా ఉండి, సూపర్‌ స్ప్రెడర్స్‌గా మారతాం. మనకు తెలియకుండానే చాలామందికి ఈ వ్యాధిని అంటిస్తాం.
  • సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత వాహనాలనే వాడుకోవాలి.
  • వెలుపల పనులు చూసుకొని, ఇంట్లోకి వచ్చేటప్పుడు కచ్చితంగా సబ్బుతో చేతులను, కాళ్లను, ముఖాన్ని శుభ్రంగా కడుక్కునే ఇంట్లోకి అడుగుపెట్టాలి. వీలైతే వేసుకుని ఉన్న బట్టలను తీసి, వేరే బట్టలు వేసుకోవాలి.
  • కుటుంబసభ్యులకు ఎవరికైనా కోవిడ్‌ వ్యాధి వస్తే, మన ఇంట్లోనే ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ఒక ప్రత్యేకగదిలో ఉంచి కాపాడుకో గలిగిన పరిస్థితి ఉంటే హోం ఐసోలేషన్‌లో పెట్టి, తగిన జాగ్రత్తలు తీసుకో వచ్చు. అటువంటి ప్రత్యేక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో తప్ప కుండా ప్రభుత్వం నియమించిన క్వారంటైన్‌ సెంటర్‌కి వెళ్ళాలి. ఇందులో అలసత్వం చేస్తే కోవిడ్‌ వ్యాధి వ్యాప్తికి దోహదపడిన వాళ్ళమవుతాం.
  • మధుమేహ వ్యాధి, బిపి, థైరాయిడ్‌ వ్యాధి, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తమరి డాక్టర్ని సంప్రదించి, ఈ వ్యాధుల్ని అదుపులో పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారికి కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
  • ధూమపానం, మద్యపానం, గుట్కా, పొగాకు వాడడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారు వెంటనే వాటిని మానేయాలి. ఈ అలవాట్లు ఉన్నవారికి కరోనా వ్యాధి సులభంగా సోకుతుంది. మీరు వ్యాధిగ్రస్తులైతే కోలుకునే అవకాశం తగ్గి, మరణానికి చేరువవుతారు.

అదుపుకు ప్రభుత్వం చేయాల్సినవి : 

  • మాస్క్‌లు, శానిటైజర్‌, భౌతికదూరం పాటించే విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలి. కరోనా నివారణలో మాస్కుల పాత్ర చాలా ప్రధానమైనది. కాబట్టి వీలైతే ప్రభుత్వాలు ప్రజలకు మాస్కులను ఉచితంగా అందించడం మంచిది.
  • కుటుంబ, మత, రాజకీయపరమైన సామూహిక కార్యక్రమాలకు 50 మందికి మించి, అనుమతి ఇవ్వకుండా చూడాలి.
  • కరోనా కట్టడి జరిగేదాకా రాజకీయ ఎన్నికలు జరపరాదు.
  • వ్యాక్సిన్‌ భయాలను పోగొట్టి, ధైర్యంగా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలను చైతన్యపరచడమే మంచి పరిష్కారం. అందుకు ప్రభుత్వ సంస్థలనే కాకుండా ప్రైవేటు సంస్థలను, స్వచ్ఛంద సంస్థలనూ వినియోగించుకోవాలి.
  • ప్రజల్లో సరైన అవగాహనను కల్పించి, వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను ఎక్కువమందికి అందించాలి.
  • వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారిని, కరోనా వ్యాధి సోకినటువంటి వారిని ప్రత్యేక తరహా వ్యక్తులుగా భావించి, టీకా వేయించుకున్నంత మాత్రాన మళ్ళీ రాదనే గ్యారంటీ లేదని చెప్పాలి. వారిలో చైతన్యం తీసుకువచ్చి, వారూ సాధారణ కరోనా నివారణ జాగ్రత్తలన్నీ తీసుకునేలా తయారుచేయాలి.
  • పరిమిత సంఖ్యలో ప్రజా రవాణా జరిగేటట్టు చూడాలి. వాహనాల సంఖ్యను పెంచి, ప్రయాణికుల రద్దీని తగ్గించాలి.
  • స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ కరోనావ్యాప్తిలో సూపర్‌ స్ప్రెడర్స్‌గా మారిపోయారు. కరోనా సెకండ్‌వేవ్‌ అంతమయ్యే వరకూ కచ్చితంగా పాఠశాలలు, కళాశాలలు, బార్లు, క్లబ్బులు, సినిమా హాళు ్ల మూసివేయాలి.
  • కరోనా నివారణ, కరోనా వైద్యంలో భాగంగా చాలా మందుల షాపుల్లో బి కాంప్లెక్స్‌ మాత్రలు విటమిన్‌ ''డి'', విటమిన్‌ ''సి'', జింకు మాత్రలు దొరకడం లేదు. వీటి అవసరం దృష్ట్యా ఈ మందులను అన్ని షాపుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • కరోనా వ్యాధి నిర్ధారణకు అవసరమైన ప్రధానమైన ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షల లోపం చాలా ఉంది. కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ టెస్ట్‌ అందుబాటులో ఉంది. ఈ టెస్ట్‌ ఫలితాలను ఆధారం చేసుకుని మాత్రమే ఆస్పత్రుల్లో వైద్యం నిమిత్తం చేర్చుకుంటున్నారు. ఈ పరీక్ష ఫలితాలు రావడానికి రెండు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఈ రిపోర్టు ఆలస్యం కావడంతో రోగులకు జరిగే వైద్యంలో లోపం వస్తుంది. వ్యాధి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి దోహదపడుతుంది. ఈ పరీక్ష ఫలితాలను రెండోరోజులోపల వచ్చేలా పరీక్ష కేంద్రాలను, పరికరాలను, అందుకు అవసరమైన సిబ్బందినీ అత్యవసర ప్రాతిపదికన పెంచాలి.
  • కోవిడ్‌-19 వ్యాధి వైద్యానికి బాగా ఉపయోగపడుతున్న రెమిడీస్‌ విర్‌ అనే మందు సరిగా అందుబాటులో లేదు. ఈ మందు అందుబాటులో ఉండేలా చూడాలి.
  • కరోనా టీకాలు కట్టడికి ప్రస్తుతం మన ముందున్న ప్రధానమైన నివారణ మార్గం. ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. వేయించుకోదలచిన వారికి వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడం బాధాకరం. మనదేశంలో ఉత్పత్తవుతున్న కోవ్యాక్సిన్‌, కోవిషీల్డ్‌ ఉత్పత్తిని పెంచేలా తక్షణం చర్యలు తీసుకోవాలి. ఆ కంపెనీలకు అవసరమైన ఆర్థిక సహకారం, ముడిసరుకు ఏర్పాటు వంటి అంశాల్లో సహకరించాలి. తద్వారా టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలి. కొత్తగా రష్యా దేశ స్పుత్నిక్‌ వి టీకాను అత్యవసరం ప్రాతిపదికన అనుమతించిన విధంగానే వివిధ దేశ కంపెనీలనూ ఆహ్వానించాలి. టీకాను వేగంగా ప్రజలకు అందించాలి. అలా చేయగలిగినప్పుడే మనల్ని మనం కాపాడుకుంటూ ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు మనం చేస్తున్న కరోనా టీకా సహకార కార్యక్రమాన్నీ కొనసాగించగలుగుతాం.
  • టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా జరపాలి. గతంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైతే కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి వ్యాప్తిని తగ్గించే కార్యక్రమం జరిగేది. ఇప్పుడు అలా జరగడం లేదు. ఈ మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించి, నివారణా మార్గాలను, కట్టడి చర్యలను అమలుచేయాలి.
  • వెంటనే క్వారంటైన్‌ సెంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలి. ప్రత్యేకమైన గది ఉన్నటువంటి కుటుంబంలో ఐసొలేషన్లో పెట్టి, వైద్యం చేయవచ్చు. ఒక గది మాత్రమే ఉన్న పేదవారికి కరోనా వ్యాధి సోకితే.. వారందరినీ క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచి వైద్య సదుపాయాలు అందించాలి. లేనిపక్షంలో వీరు వారి కుటుంబానికి, సమాజానికి అంటించే పరిస్థితి తీవ్రమవుతుంది. దాంతో కరోనా కట్టడి కష్టమవుతుంది.

మొదటి వేవ్‌లో వచ్చిన అనుభవాలను రెండో వేవ్‌లో ఉన్నటువంటి తీవ్రతను, వ్యాధిని బాగా కట్టడి చేసుకుంటున్నా దేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, ప్రధానంగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో వేవ్‌ని అదుపు చేసుకొని, భవిష్యత్తులో మరో వేవ్‌ లేకుండా దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం సమిష్టిగా జరగాలి.

తీవ్రతకు కారణాలు..
1. కరోనా వైరస్‌లో వచ్చిన రూపాంతరాలు (మ్యుటేషన్లు).
2. ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలాన్ని కరోనా కట్టడికి సరిగా ఉపయోగించుకోకపోవడం.
3. కరోనా కట్టడికాక మునుపే దేశంలో ఎన్నికలు జరగడం.
4. రాజకీయ, మతపరమైన సామూహిక సమావేశాలు జరగడం.
5. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలు సరిగా పాటించకపోవడం. ప్రభుత్వం సరిగా అమలు చేయకపోవడం
6. స్కూళ్లను, బార్లను పునఃప్రారంభించడం.

కరోనా కడలిలో రెండో అల..


ఈసారి పిల్లల్లోనూ..
చిన్నపిల్లల్లో కరోనా సోకదులే అని ప్రజలు కొంత ధైర్యంగా ఉన్నారు. కానీ రెండవ వేవ్లో చిన్న పిల్లలకూ ఎక్కువ మందికి సోకింది. ఎందుకని పిల్లలకు ఎక్కువగా సోకుతుంది అనేదానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. కాలానుగుణంగా వైరస్‌ యొక్క నిర్మాణంలో జరిగినటువంటి మార్పులు ఒక కారణమని, లాక్‌డౌన్‌ తర్వాత బడులు ప్రారంభించడం మరొక కారణమని తెలుస్తుంది. చిన్నపిల్లల్లో ఎక్కువ మందికి సోకుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో చాలామందికి ఎటువంటి వ్యాధి లక్షణాలూ కనిపించడంలేదు. కొద్దిమందిలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, నాలుక తడి ఆరిపోవడం, నీరసం లాంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. వ్యాధి తీవ్రమై చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ. వ్యాధి తీవ్రత తక్కువేగానీ వ్యాప్తి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది.

సూపర్‌ స్ప్రెడర్లు...
పిల్లలు ఎసింటమ్యాటిక్‌ క్యారియర్స్‌గా ఉంటూ ''సూపర్‌ స్ప్రెడర్లు''గా మారుతున్నారు. వీరి ద్వారా కుటుంబసభ్యులకు, బడిలో ఉన్న పిల్లలకు బాగా అంటుకుంటుంది. పిల్లలకి టీకా కూడా అందుబాటులో లేదు. కాబట్టి వీలైనంత వరకూ జనసమూహలలోనికి తీసుకుపోకుండా ఉండాలి. మాస్క్‌ పెట్టుకోవడం, బడికి పోకుండా ఆన్లైన్‌ క్లాసులకు హాజరు కావడమే ప్రధానమైన నివారణా మార్గాలు. వ్యాధి లక్షణాలు లేకపోయినా కుటుంబంలో ఎవరికైనా కరోనా వ్యాధి ఉందని నిర్ధారణ అయితే, ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కరోనా పరీక్షలు చేయడం మంచిది.