ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ల కారణంగా కోల్పోయిన పని దినాల వలన ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావం ఎంత? ఇతర పర్యవసానాలు ఏమిటి? ఈ విషయాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అధ్యయనం చేస్తోంది. తన అధ్యయనాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. వివిధ దేశాల ప్రభుత్వాలు అధికారికంగా ఎటువంటి వివరాలనూ ప్రకటించకపోయినా ఐఎల్‌ఓ ఆయా దేశాల నుండి తాను సేకరించిన సమాచారం ఆధారంగానే కొన్ని గణాంకాలను విడుదల చేసింది. మన దగ్గర ఉన్న సంబంధిత వివరాలతో పోల్చిచూసినా, ఈ గణాంకాలను తయారు చేయడానికి ఐఎల్‌ఓ పకడ్బందీగా అనుసరించిన విధానాన్ని చూసినా, వాటి ఆధారంగా మనం కొన్ని నిర్ధారణలకు రావొచ్చునని చెప్పాలి.
2019 సంవత్సరపు ఆఖరు త్రైమాసికంలో జరిగిన పని దినాలు కొలబద్దగా తీసుకుని వాటితో తర్వాత కాలంలోని పని దినాలను పోల్చి చూశారు. 2020 లోని మొదటి త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.6 శాతం పని దినాలను కోల్పోయింది. రెండవ త్రైమాసికంలో 17.3 శాతం, మూడవ త్రైమాసికంలో 12.1 శాతం పని దినాలను కోల్పోయింది. మొత్తం తొమ్మిది నెలలలోనూ కలిపి చూస్తే 11.7 శాతం పని దినాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోయింది. అదే దక్షిణాసియా ప్రాంతానికి చూస్తే మూడు త్రైమాసికాల్లోనూ వరుసగా 3.1 శాతం, 27.3 శాతం, 18.2 శాతం పని దినాలను కోల్పోయింది. ప్రపంచం మొత్తం మీద అతి ఎక్కువగా పని దినాలను నష్టపోయిన ప్రాంతం లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల ప్రాంతం. ఆ తర్వాత స్థానంలో దక్షిణాసియా ప్రాంతం ఉంది.
ఈ పని దినాల నష్టాన్ని కార్మికుల ఆదాయాలలో కలిగిన నష్టం రూపంలో చూద్దాం. లాటిన్ అమెరికా ప్రాంతంలో కార్మికులు 19.3 శాతం ఆదాయాన్ని కోల్పోగా, దక్షిణాసియా ప్రాంతపు కార్మికులు 16.2 శాతం ఆదాయాన్ని కోల్పోయారు. మొత్తం ప్రపంచంలో కార్మికులు 10.7 శాతం ఆదాయాన్ని కోల్పోతే పై రెండు ప్రాంతాల్లోనూ కోల్పోయినది చాలా ఎక్కువ. దక్షిణాసియా ప్రాంతంలో కరోనా వలన అత్యధికంగా ప్రభావితమైనది మన దేశమే. మన దేశ పరిమాణం, జనాభా కూడా తక్కిన దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. అందుచేత దక్షిణాసియాలో కార్మికుల ఆదాయంలో ఎక్కువ నష్టం వాటిల్లింది మన దేశంలోనే. అంటే లాటిన్ అమెరికా దేశాల తర్వాత అత్యధికంగా కార్మికులు ఆదాయాలు కోల్పోయినది మన దేశంలోనే అని స్పష్టం అవుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చేతకానితనాన్ని ప్రదర్శించిన ప్రభుత్వాల్లో మోడీ ప్రభుత్వం అందరికన్నా ముందుంది అని చాలా మంది చేస్తున్న విమర్శలు వాస్తవమని ఐఎల్‌ఓ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
ఆయా ప్రభుత్వాలు కరోనా కాలంలో అమలు చేసిన ఆర్థిక ఉద్దీపన పథకాలను పరిగణన లోకి తీసుకోకుండా ఐఎల్‌ఓ పైన వివరించిన గణాంకాలను నిర్ధారించింది. ఆ తర్వాత వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన సహాయ కార్యక్రమాలను, పన్ను రాయితీలను పరిగణించి చేసిన అధ్యయనం ప్రకారం తమ జిడిపిలో ఎక్కువ శాతం ఉద్దీపన పథకాలకు ఖర్చు చేసిన దేశాలలో కార్మికులు తక్కువ పని దినాలను నష్టపోయారని తేలింది. మామూలు తర్కం ప్రకారం చూస్తే ఎక్కువ పని దినాలు నష్టపోయిన చోట ఉద్దీపనకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వుంటుంది. దానికి పూర్తి విరుద్ధంగా జరిగినట్టు ఐఎల్‌ఓ అధ్యయనం తేల్చింది. ఇలా ఎందుకు జరిగింది?
పని దినాలు నష్టపోవడమనేది కేవలం లాక్‌డౌన్ వల్ల మాత్రమే కాదు. ఆ పనులను కోల్పోయిన కార్మికులు తమ కొనుగోలు శక్తి తగ్గినందువలన వారు మామూలుగా తమ అవసరాలను తీర్చుకోడానికి చేసే ఖర్చులను కూడా బాగా తగ్గించుకోవలసి వస్తుంది. ఉదాహరణకు...క్షౌరశాలలకు పోవడం, రిపేర్లు వంటివి చేయించడం వగైరా. లాక్‌డౌన్ తర్వాత ఇటువంటి సేవలకు అనుమతులు ఇచ్చినా కార్మికులు వాటిని ఉపయోగించుకునే స్తోమత కలిగి వుండరు. ఆ విధంగా లాక్‌డౌన్ వలన తగ్గే ఆదాయాలు డిమాండును తగ్గించి వేసి తద్వారా మరింతమంది పని దినాలు కోల్పోడానికి దారి తీస్తాయి. ఇలా లాక్‌డౌన్ వలన పని దినాలను కోల్పోయిన కార్మికులకు గనుక ఆర్థిక ఉద్దీపన ప్రయోజనాలు అందితే వారు ఖర్చు చేయగలిగిన శక్తి ఆమేరకు పెరుగుతుంది. దానివలన వారు అదనంగా సేవలను వినియోగించుకోగలుగుతారు. అందువలన మరికొంత మందికి దొరికే పని దినాలు పెరుగుతాయి. ఉద్దీపనకు చేసే ఖర్చు ఎంత ఎక్కువగా ఉంటే, అందులో ఎంత ఎక్కువగా కార్మికులకు దక్కితే అంత తక్కువగా వారు పని దినాలను నష్టపోతారు. ఐఎల్‌ఓ అధ్యయనం తేల్చిచెప్పింది ఇదే.
ఐఎల్‌ఓ ఈ విషయాన్ని మరో కోణం నుండి కూడా అధ్యయనం చేసింది. నష్టపోయిన పని గంటలను పూర్తి పని దినాలలోకి మార్చింది. ఉద్దీపన పథకాలలో కార్మికులకు అందిన వాటాలను పూర్తిరోజు జీతాలలోకి మార్చింది. ఎన్ని పని దినాలను నష్టపోతే ఎంతెంత పరిహారం ఉద్దీపన రూపంలో వారికి అందినదీ లెక్కగట్టింది. ఆ విధంగా చూసినప్పుడు అన్ని ప్రాంతాల కార్మికులకన్నా దక్షిణాసియా ప్రాంత కార్మికులకు అతి తక్కువగా ఉద్దీపన ప్రయోజనాలు అందినట్టు తేల్చింది. దక్షిణాసియా ప్రాంతం అంటే ముందే చెప్పుకున్నట్టు అందులో అతి పెద్ద భాగం మన దేశమే. ఇక్కడ ప్రపంచంలోకెల్లా అతి తక్కువగా కార్మికులకు మోడీ ప్రభుత్వం పరిహారాన్ని అందించిందని స్పష్టం అవుతోంది. కార్మికుల విషయానికి వస్తే అత్యంత పిసినారిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మనదే.
ఇలా అతి తక్కువగా ఉద్దీపనను కార్మికులకు అందించినందువలన వారు చేయగలిగే ఖర్చు తగ్గుతుంది. పర్యవసానంగా మరింతమంది పని దినాలను నష్టపోతారు. అంతేగాక ఈ కరోనా కాలంలో కార్మికులు ఆర్థిక సంక్షోభం ప్రభావం తట్టుకుని నిలదొక్కుకునే శక్తిని కూడా కోల్పోతారు. మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన లాక్‌డౌన్‌ను విధించి ఒకవిధంగా, అతి హీనమైన ఉద్దీపన పథకాన్ని అమలు చేసి మరొక విధంగా-ఇలా రెండు విధాలుగా కార్మికులను దెబ్బతీసింది. ప్రపంచంలో అత్యంత చేతకాని ప్రభుత్వంగా మాత్రమేగాక, కార్మికుల పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించిన ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం నిలిచిపోతుంది.
గత చాలా కాలం నుండీ ప్రభుత్వాలు మన ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఎదుగుతోందని చెప్పుకుంటూ వస్తున్నాయి. అటువంటి దేశంలో ఇంత కనిష్టంగా కార్మికులకు ఉద్దీపన అందించడం ఈ ప్రభుత్వపు కర్కశత్వాన్ని సూచిస్తోంది. ఐతే మూడో ప్రపంచంలోని చాలా దేశాలలో కూడా ఉద్దీపనకు చేసిన ఖర్చు తక్కువగానే ఉందని ఐఎల్‌ఓ అధ్యయనం తెలియజేస్తోంది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు నయా ఉదారవాద విధానాల కారణంగా బలహీనపడడమేగాక ఎటువంటి అదనపు ఖర్చునైనా ఉద్దీపన రూపంలో చేయాలంటే విదేశీ సహాయంపై ఆధారపడవలసిందే. ఇప్పుడు అటువంటి సహాయాన్ని అందించడానికి ఏ దేశమూ ముందుకు రావడంలేదు.
కరోనా కాలంలో నష్టపోయిన పని దినాల విషయంలోను, ఉద్దీపన అందించే విషయంలోను వివిధ దేశాలు వేరువేరు తీరుల్లో స్పందించాయి. సంపన్న దేశాలలో అమలు చేసిన ఉద్దీపన పథకాలు, అందులో కార్మికులకు అందిన సహాయం గణనీయంగా ఉన్నాయి. అదే మూడో ప్రపంచ దేశాలలో అతి హీనంగా ఉన్నాయి. భారతదేశంలో అవకాశం ఉన్నా తగిన ఉద్దీపనను కార్మికులకు అందించలేదు. కాని ఎటువంటి ఉద్దీపననూ అందించగల శక్తి తక్కిన మూడో ప్రపంచ దేశాలకు లేదు. అందువలన మూడో ప్రపంచ దేశాలకు కరోనా వలన కలిగిన కష్టాలు సంపన్న దేశాల కార్మికులకు కలగలేదు. కాని మొత్తం మీద ప్రపంచం అంతటా కార్మికులు కరోనా కాలంలో నష్టపోయారన్నది వాస్తవం.
కాని ఇంకొకపక్క శత కోటీశ్వరులు మాత్రం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ కాలంలో లాభపడ్డారు (ఆ విషయాన్ని గత వారం వ్యాసంలో చర్చించాం). మొత్తం కార్మిక వర్గంలో ప్రత్యేకించి మూడో ప్రపంచ దేశాల కార్మికులు ఎక్కువగా నష్టపోవడానికి కారణం ఆ దేశాల ప్రభుత్వాలు తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోవడమే. ఇది ప్రపంచీకరణ విధానాల పర్యవసానం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్










