
అమ్మా..'చి.ల.సౌ' అని కదా పెళ్లి కూతురు పేరు ముందు వేస్తారు? కొత్తగా ఈ చి.స.సౌ. ధనిష్క ఏంటే ??!! కారులో నా పక్కనే కూర్చున్న స్వీటీ పెళ్లి పత్రికను చదువుతూ అడిగింది.
అంటే 'చిరంజీవి. సర్వైవర్. సౌభాగ్యవతి. ధనిష్క' అనీ,
అలాగే 'స.చి.ఉత్సవ్' అంటే వరుడు 'సర్వైవర్. చిరంజీవి. ఉత్సవ్' అనీనూ అందావిడ..
పెళ్లికి హాజరయేందుకు ఈ కోవిడ్ ఫ్రీ కుటుంబం తమ కారులో పక్కూరికి బయలుదేరింది. స్వీటీ ఆశక్తిగా ఆ శుభలేఖను ఆసాంతం చదవడం మొదలుపెట్టింది.
వారియర్ వెంకట్రావు గారి కరోనా కాల కల్యాణ ఆహ్వాన పత్రిక.
మా ద్వితీయ కరొనా సర్వైవర్
చి.స.సౌ.ధనిష్కను, గ్వాలియర్ వాస్తవ్యులు శ్రీ.గోవిందరావుగారి కనిష్ట కరోనా సర్వైవర్ స.చి ఉత్సవ్‌కు ఇచ్చి, కరోనా కాల ముహూర్తమున, కోవిడ్ రహిత రక్షణ వలయమునందు వివాహం చేయ అధికారులు అనుమతించినారు. కావున, మీ ఇంటగల కోవిడ్ సర్వైవర్స్ మాత్రమే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌తో వివాహానికి మూతి మాస్కులతోనూ, సొంత కారుల్లోనూ విచ్చేసి దూరం నుంచే దీవించి పో ప్రార్థన!
విందు: రాత్రి 7 గంటల నుండి (గమనిక : ఎవరి బాక్సులు వారివే.)
***
వివాహ పత్రిక చదివాక, 'మరి రాత్రికేం చేశావమ్మా అయితే'..అంది స్వీటీ..
పెళ్లి కదా అని, బిర్యానీ పెట్టానర్రా అందావిడ.
అయితే 'హేపీగా తినొచ్చు..ఎవరూ అడగరు కూడా కదా!' అంటూ చిన్నా బాగా ఆనందపడ్డాడు.
***
కారు హైవే పక్కనే ఉన్న ఓ తోటదగ్గర ఆపి ఆ కుటుంబం టిఫిన్లు తినడానికి ఉపక్రమిస్తుండగా ఆ తోటలో ఉన్నట్టుండి ఏదో గలాటా ప్రారంభమైంది.
ఓ ఇరవైమంది కుర్రోళ్లు తమ దోస్తుగాడి బర్త్ డే పార్టీలో మస్త్ ఖుషీగా ఉన్న టైంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి 'మాస్ గేదరింగ్ ఒద్దనీ, వెళ్లిపోమనీ' మర్యాదగా చెబుతున్నారు..
కానీ, వాళ్లు వినకుండా.. 'కేక్ కోసాక ముఖాలకు ఒత్తుగా పులుముకునీ, ములక్కాడలతో కొట్టుకునీ, గుడ్లు విసురుకునీ సింపుల్‌గా సెలబ్రేట్ చేసేసుకున్నాక, బిర్యానీ తినీ వెళ్లిపోతామనీ అందుకు ఇరవై మందికి సరిపడా ఒకే 'సామూహిక ఆకును' తమ ప్రేమకి చిహ్నంగా కూడా తయారుచేసుకున్నామనీ' వాదానికి దిగారు.
మా నాయనే.. ఏకత్వాన్ని చాటే 'ఏకాకు' కూడా డిజైన్ చేసుకున్నారా??!...ఏకాకి చావు ఛస్తార్రోరు.. అయినోళ్లు కూడా చావుకి రారు తెలుసా?? అంటూ.. పోలీసులు ససేమిరా అన్నారు.
'మాకేం కాదు సార్.. అందరం ప్రాణస్నేహితులం.. కలిసొస్తే క్వారంటైన్లోనూ కలిసే ఉంటాం.. కలిసే పోతాం. మీకేమైనా ప్రాబ్లమా?' అన్నారు వాళ్లు.!
'నాకోసం ప్రాణాలిస్తామని ఎన్నో సార్లు చెప్పారు వీళ్లు.. అది నిజమా?? ఉత్తుత్తికా అని తెలిసే టైంలో వచ్చేసి లొల్లి చేయకండి ఆఫీసర్'.. గంభీరంగా అన్నాడు చేతికీ, జుట్టుకూ ఉంగరాలున్న బర్త్ డే బాబు.
'నేను ఆఫీసర్‌ని కాదు! కానిస్టేబుల్‌ని!.'
'అంటే..అదీ.. చాలా సినిమాల్లో అలాగే అంటారని సార్..' కుర్రాడు సిగ్గు పడ్డాడు.
సార్.. నిమిషానికోసారి 'నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను బావా!' అనే ఈ వీరబాబుగాడి మాటైనా నిజమా? కాదా? అనైనా చూసుకోనివ్వండి. ప్లీజ్ సార్.. మళ్లీ బ్రతిమిలాడాడు పుట్టినరోజు పసోడు.
'ఒరే బాబూ.. నీకు అర్థం కావట్లేదా.. ఎవడి ప్రాణం అడ్డేసినా చీకేసి చంకనాకించేసే మహమ్మారిరా.. ఈ కోవిడ్డూ!.. తెలుసుకో.. నీ ఒక్కడితో పోదురా బాబూ'.. అన్నాడు పోలీసు తలబాదుకుంటూ.
ఏంటి సార్.. ఇంతకీ ఈ కరోనా ఆడా మగా??! 'మహమ్మారి' అనీ మీరే అంటారు. మళ్లీ కోవిడ్, డేవిడ్ అంటూ మీరే మళ్లీ మగ పేర్లెడతారు... కన్ఫ్యూజ్ చేయకండి సార్ అమాయకులనిచేసి! అన్నాడొక అతిబాబు.
హఠాత్తుగా ఓ ఔత్సాహిక యువకుడు పూనకం వచ్చినోడిలాగా ఊగిపోతూ..
'మా బావ తోపు వీలుంటే ఆపు' అంటూ బిగ్గరగా ఓ స్లోగన్ ఇచ్చాడు. అంతే.. ఇక అంతా మాస్ హిస్టీరియాతో ఆ మాటే రిపీట్ చేయడం మొదలెట్టారు.
మా బావ తోపు.!.. వీలుంటే ఆపూ.. మా బావ తోపూ.!.. వీలుంటే ఆపూ.. అని అరుస్తూ, మరో అత్యుత్సాహపు యువకుడు ఓ పోలీసుని వెనక్కితోశాడు.
మెరుపు వేగంతో వాడి గూబ గుయ్యిమంది..
'పోలీసులతో కిరి కిరీ.. పోతుందిరోరు వినికిడీ!' అంటూ పోలీసులూ అచ్చం యువకులలాగే తిరిగి గట్టిగా స్లోగన్లిస్తూ లాఠీలెత్తారు.
'పట్టుకున్న పుంజూ.. గెంతుతుంటే గుంజూ.. పట్టుకున్న పుంజూ.. గెంతుతుంటే గుంజూ'.. అని పోలీసులు అరుస్తూ కుర్రోళ్లని చెదరగొట్టారు.
కుర్రాళ్లంతా చెల్లా చెదురుగా పరిగెడుతూనే..
'మా బావ శిఖరం.. తడిసిపోద్ది ఎకరం'!.. మా బావ శిఖరం.. తడిసిపోద్ది ఎకరం! ఒక్కొక్కడికీ 'అని వేళ్లు చూపిస్తూ పోలీసుల్ని అటూ ఇటూ పరిగెత్తించారు.
చూసేవాళ్లకి అక్కడ ఓ కబాడీ ఆటలా కనిపించినా, ఓ పుంజీడు యువకుల బాడీలు బీటలేస్తేగాని.. అక్కడంతా క్లియర్ కాలేదు.
చూడబోతే.. నిజంగానే ఆ ప్రదేశమంతా 'తడి తడిగా' మారిపోయింది.
పాపం పిల్లలు మాటమీద నిలబడే రకం అమ్మా! పూర్తిగా తడిపాకే వెళ్లారు.'.. నవ్వాపుకుంటూ కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్.
దారిలో నూటికి నలభై మంది మాస్కులు లేకుండానే తిరుగుతూ కనపడ్డారు. కొందరైతే మాస్కులు కిందకిలాగి, ముఖంలో ముఖంపెట్టి మాట్లాడాక మళ్లీ పద్ధతిగా మాస్క్ పైకి లాక్కొని వెళ్లిపోతున్నారు.
వాళ్లని చూసి భయం బాగా భయపడి, బాధతో, బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుంది.
ఇంతలో ఓ చోట హఠాత్తుగా చిన్నాగాడు..'ఆపండీ!' అని అరిచాడు.
ఏంటీ ఇంకా పెళ్లికి పోకుండానే ఆపండీ డైలాగ్ వాడేస్తావేంటిరా??!.. స్వీటీ అంది.
'అబ్బ విను కావాలంటే'...
'కరోనా చిన్నది ఉందీ.. మజాకా కాదంటుందీ.. ఓసారటు రమ్మంటుందీ.. పొయ్యిరా పొరు.. శానిటైజర్ పొరు' గట్టిగా పాట వినవస్తోంది.
'మే.. మే.. అదిగో డి.జే. అదిగోనే..డీ.జే!..
ఇదే ఇదే..పెల్లి ఇళ్ళు..పెల్లి ఇళ్ళు..' అని గుండెలు బేజారెత్తేలా అరిచి కారు సడెన్ బ్రేక్ అప్రయత్నంగానే వేయించాడు చిన్నా.
ఒరే నువు 'ళ' ని ముందుకు తెచ్చి 'ల'ని ఎనకమాలకి పంపరా బాబూ.. అంది వాళ్లమ్మ విసుగ్గా.
అమ్మా.. వీడు 'పెళ్లి' అని సరిగా పలికితేనే ఈ సారి పెళ్లిళ్లకి తీసుకొద్దాం.. అది వాడి పెళ్లయినా సరే.. అని ఉడికిస్తూ కారు దిగింది వాడి అక్క స్వీటీ.
మండపం గేటు దగ్గర అందరి 'ఫిట్‌నెస్ పేపర్సూ' ఒకసారి చూసి, తర్వాత ఎగాదిగా రెండుసార్లు అనుమానంగా చూసి, టెంపరేచర్ చెక్ చేసి లోపలికి అనుమతించారు.
అందరూ పెయింట్ చేసిన గుండ్రాలలో గుండ్రాయిల్లా కాసేపు నిలబడ్డాక.. లైను కదిలింది.
పువ్వుల పి.పి.ఇ. డ్రెస్సుల్లో ఉన్న అమ్మాయిలు మాస్కులమాటున నవ్వు కనపడట్లేదని, అతికష్టం మీద కళ్లతో నవ్వటం ప్రాక్టీస్ చేస్తూ, వెండి పన్నీరు బుడ్డిలో సెంటు కలిపిన శానిటైజర్ని కొంచెం నెత్తినా, కొంచెం దోసిలిలోనూ కొడుతున్నారు..
గుమ్మంలోనే బలహీనంగా ఉండే మా 'బలరామ్' బాబారు కనపడి 'ఏమ్మా.. ఎన్ని రోజులైంది చూసి.. అంతా నెగిటివేగా?? అమ్మా, నాన్నా అంతా నెగిటివేగా??..శుభం.. రండీ.. రండీ.. అంటూ ఆహ్వానించాడు.
ఇదేంటమ్మా..అన్నాడు చిన్నా..
అదేరా మరి పూర్వం అంతా కులాసా.. అనేవారు.. ఇపుడు 'అంతా నెగిటివేగా!' అంటున్నారు.. అంతే!.. పెదాలు కదలకుండా గుసగుసగా అంది ఆవిడ.
పైకి ఎవర్నో చూసి అనవసరంగా నవ్వుతూ.
హాలంతా భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఎరేంజ్ చేశారు.
లోనికెళ్లేసరికి వారియర్ వెంకట్రావు అరుస్తూ
'అబ్బా.. మంగళ స్నానం తరువాత.. ముందు బయటినించి వచ్చారు గనుక వధూవరులను కరోనా స్నానం చేసి రమ్మనండి' అంటూ హడావుడిగా తిరుగుతున్నాడు.
'ఓరు.. పిన్నీ.. బాసికాలెక్కడ పెట్టావే ??'
'అమ్మా.. బాసికాలు లేకపోతే మానె.. ముందు మాస్క్‌లు వుండేలా చూడండి వధూవరులకి' పురోహితుడు ఆసికాలాడాడు.
'ముద్దబంతి మూతికీ పూల మాస్కులూ... మూసివున్న పెదవులపై ఎన్ని బాసలూ...
రాసుకునీ పూసుకుంటే ఓ కోయిలా.. పాజిటివ్‌లే వస్తాయి అన్ని వైపులా..'
పెళ్లికూతురొస్తుంటే.. సమయానికి తగు పాటేసుకుని తన ప్రతిభ చూపుతున్నాడు డి.జె.బారు.
పెళ్లి కొడుకు ఇంకా రెడీ అవలేదుట.. కొందరు పిల్లలు మెల్లగా స్టేజ్ ఎక్కి పెర్ఫార్మ్ చేయడం మొదలెట్టారు.
'కొలంబస్ కొలంబస్. సచ్చారూ జనమూ.. కోవిడ్ రాకుండుండటానికీ కావాలో భయమూ..
వినరు..వినరు..వినరూ..ఎదవలు..ఎవరు పోయినానూ'..
పిల్లలు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా డి.జే.బాబు స్లో సాంగేసుకున్నాడు.
'కోరి కోరి పాకుతోంది కోవిడిప్పుడూ.. పసివానిమీద లేనిపోని సాకులెందుకో..
స.రి.గ.మ.పదసా.. పాలకూర కోసమా??!..
గ.రి.గ.మ.నిదసా.. కొర్రమీనుకోసమా??!...
కోరి.. కోరి పాకుతోంది కోవిడిప్పుడూ..'
ఈసారి బాగా ఊపున్న సాంగేశాడు అతను.. పిల్లలు రచ్చ రచ్చగా ఎగరసాగారు.
'మీ రడేష్ రాలేదే అత్తమ్మా??' అడిగిందో ఆవిడ.
'ఏం చెప్పనే తల్లీ!.. మొన్న క్వారంటైన్‌కి అని వెళ్లి, పద్నాలుగోరోజు కల్లా కులమూ, మతమూ తెలీని ఓ పిల్లని ప్రేమించి జనరల్ హాస్పిటల్‌కి వెళ్లి మరీ పెళ్లాడి తీసుకొచ్చాడమ్మా..' చెప్పింది ఈవిడ బాధగా.
'ఊరుకోండి అత్తమ్మా!.. ఇంకెక్కడ కులాలూ, మతాలూనూ!?.. ఇకమీదంతా.. కోవిడ్ పాజిటివ్!.. కోవిడ్ నెగిటివ్!.. అని రెండే ఉండెటిది.. ఐనా హాస్పిటల్‌లో పెళ్లేంటీ, ఇడ్డూరం కాకపోతేనూ??!' అందావిడ.
'మరేం చేయటం..గుళ్లు మూసేసారాయే!. ఆసుపత్రులే దేవాలయాలు అన్నారు కదా.. డాక్టర్లే దేవుళ్లు అంటన్నారనీ.. అటే పోయి, సీనియర్ డాక్టర్ కాళ్లకి మొక్కి, తలమీద శానిటైజర్ స్ప్రే చేయించుకుని, 'సి' విటమిన్ బిళ్లలు ప్రసాదం పెట్టించుకుని మరీ వచ్చారు ఇంటికి' చెప్పుకొచ్చిందావిడ.
'మరి మామయ్య ఏరీ??!'
'హు.. ఆయనా??.. వీడు చేసిన పనికి హర్ట్ అయ్యి.. ఎందుకైనా మంచిదని, భౌతిక దూరంతో పాటూ, ఫోన్లు కట్టేసి మానసిక దూరం కూడా పాటించేస్తున్నారే వైజాగ్‌లో ఉండిపోయి. 'అందామె బాధగా కళ్లొత్తుకుంటూ.
ఈలోపు పెళ్లికొడుకుని తెచ్చి కూర్చోబెట్టారు.
రెండు పెళ్లి పీటలకీ రెండు గజాల దూరం, పురోహితుడికి, వారికీ రెండు గజాల దూరం పెట్టారు. ఇరువురి తలిదండ్రులూ, తమ తమ సర్కిల్స్‌లో నిలబడ్డారు.
పట్టుపీతాంబర పి.పి.ఇ. వస్త్రాలను ఇచ్చి పుచ్చుకున్నారు. వధువు తరఫున బొక్కలున్న బంగారు మాస్కూ, వెండి శానిటైజర్ స్ప్రేయింగ్ బుడ్డీ వరునికి ముట్టాయి.. వధువుకీ అలాంటివే వీళ్లూ బహూకరించారు..
జీలకర్రా బెల్లం పొడవాటి కర్ర గరిటెలతో దూరం నుంచి తలలమీద పెట్టుకున్నారు వధూవరులు.
అందరూ అక్షింతలు కూర్చున్న చోటునుంచే విసరగా, వధూవరులకు ప్రాబ్లెమ్ రాకుండా. ముందే వధూవరులు తలపై ఏర్పాటు చేసిన దోమతెరలాంటి తెరపై ఆ అక్షతలన్నీ పడ్డాయి..
'భౌతిక దూరం పాటిస్తూ, పిల్లాపాపలతో నిండు నూరేళ్లూ, నెగిటివ్ తెచ్చుకుంటూ వర్థిల్లండని' అంతా మనస్పూర్తిగా దీవించేశారు.
'ఎట్టెట్టా.. భౌతిక దూరమూ.. పిల్లా, పాపానా??!' అయోమయంగానూ, కంగారుగానూ ఒకరినొకరు చూసుకున్నారు వధూవరులు పాపం.
పంతులుగారు సమయం చూసుకుంటూ 'కరోనా తంతునానేనా.. సహజీవన హేతునాం'.. అని మంత్రం చదువుతూ తాళిబొట్టు మెడలో వేయిస్తుండగా 'ఆ.. పం.. డీ..' అంటూ గ్రామవాలంటీరు చేతిలో కాగితంతో ఒగురుస్తూ వచ్చి అరిచింది.
అంతా వరుడిని అనుమానంగా చూశారు.
'అందరూ అక్షింతలు తీసుకున్నారుగా??' ప్రశ్నించిందా పిల్ల.
'ఓ'.. అంటూ అంతా తలాడించారు.
'పురోహితులవారు స్వయంగానే ఇచ్చారు కదా?'
'ఓ'.. ఆనందంగా తలూపారంతానూ.
'శుభం.. మరైతే పదండి.. పురోహితులవారికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. బయట బండుంది. అంతా వచ్చి క్వారంటైన్ అవండి'. అంది ఆ అమ్మాయి.
'ఖర్మ.. ఖర్మ.. ఏం చేస్తాం.. పదండి. క్వారంటైన్లోనే కొత్త కాపురం మీకు!' అంటూ హడావుడిగా తాళి కట్టించి, వధూవరులను తీసుకు నడిచాడు వారియర్ వెంకట్రావు గారు విచారంగా.
మనోజ నంబూరి
94917 33100