'అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా!' అంటాడు కరకటశాస్త్రి...తన మేనల్లుడితో. అప్పుడు వెంకటేశం 'నలదమయంతులిద్దరు మన:ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘ వాసర నిశల్...' అంటూ ఏకబిగిన చెప్పేస్తుంటాడొక పద్యాన్ని. 'అట్టే అట్టే... 'మన:ప్రభవానల'వంటే యేవిట్రా?' అంటాడు కరకటశాస్త్రి. అర్థం తెలియని వెంకటేశం.... యింటి కప్పువేపు చూస్తుంటాడు మౌనంగా. తన శిష్యుడేదో కొంపముంచేలా వున్నాడని... గిరీశం అందుకుంటాడు. 'పసిపిల్లలికి అలాంటి కఠినవైన పద్యానికి అర్థం తెలుస్తుందా అండీ? యిప్పటిమటుకు వేదంలాగా భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాలమీద ఖాతరీ లేదండి..' అంటూ సన్నాయినొక్కులు నొక్కుతాడు తనదైన ధోరణిలో. ఈ సన్నివేశం గురజాడ వారి 'కన్యాశుల్కం'లోనిది. నాటి వేదాధ్యయనం, నేటి ఇంగ్లీషు చదువులు ఒక్కటేనని... వాళ్లకు కావాల్సిన విధంగా నోరెత్తని గుమస్తాలను తయారు చేసుకోవడమేననే అర్థంలో విద్యావ్యవస్థ మీద గురజాడ వారు ఆనాడే సంధించిన అస్త్రం ఇది. నూటేభై ఏళ్ల క్రితం గిరీశం పాత్ర ద్వారా గురజాడ విద్యావిధానం మీద సంధించిన ఈ విమర్శ నేటి చదువులకు సైతం ఎంతోకొంత వర్తిస్తుంది. పిల్లలకు సులువుగా అర్థమయ్యే మాతృభాషను వదిలేసి అర్థంకాని ఇంగ్లీషు మాధ్యమానికి వారిని బలిచేస్తున్నది ప్రస్తుత విధానం.
మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. యునెస్కో ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా మే, 2021 నాటికి 26 దేశాలలోని పాఠశాలలు మూసివేయబడ్డాయి. 55 దేశాల్లో పాక్షికంగా మాత్రమే తెరిచారు. 90 శాతం మంది పిల్లల విద్యకు అంతరాయం ఏర్పడింది. కరోనా కాలం విద్యార్థి లోకాన్ని రెండు ముక్కలు చేసింది. ఆర్థిక స్తోమత వున్నవారు ఇంట్లో పిల్లలను ఆన్‌లైన్ చదువులు చదివిస్తున్నారు. వాళ్లు ఎంత నేర్చుకున్నారన్నది పక్కన పెడితే, వీళ్లకి కంప్యూటర్, ల్యాప్‌టాప్, బైజు వంటి యాప్స్ అందుబాటులో వుంటున్నాయి. మరోవైపు పేదలకు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, అందుబాటులో లేవు. అక్కడక్కడ ప్రభుత్వం ఉమ్మడిగా ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించినా నెట్ సౌకర్యం వుండదు. కేరళలో దాదాపు 80 శాతం మందికి ఆన్‌లైన్ చదువులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే సమకూర్చింది. కాని, మన రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామ్యం 20 శాతం కూడా లేదు. కార్పొరేట్ స్కూళ్లకు, ప్రభుత్వ స్కూళ్లకు నడుమ అంతరాలు ఇప్పటికే వున్నాయి. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ అంతరాలు మరింత పెరిగాయి. నిరంతర ప్రక్రియగా సాగాల్సిన విద్యాసముపార్జన ప్రక్రియకు బ్రేకు పడింది. ఇప్పుడు ఆ అంతరాన్ని పూడ్చే విధంగా ఉపాధ్యాయులు, విద్యావ్యవస్థ నిర్వాహకులైన అధికారులు ప్రత్యేకచర్యలు చేపట్టాలి.
చాలా రోజుల తర్వాత కరోనా పడగనీడలో, అనేక సందేహాలు... సందిగ్దాల నడుమ మళ్లీ పాఠశాలలు ప్రారంభమౌతున్నాయి. చదువుకు తరగతి గది ఒక ప్రయోగశాల. వివిధ భావాల సంఘర్షణకు వేదిక. ఈ సంఘర్షణను సక్రమమైన మార్గంలో నడిపించడమే ఉపాధ్యాయుడు చేసేపని. క్లాసురూమ్ చదువులకు ఆన్‌లైన్ బోధన ఎప్పటికీ సాటిరాదు. క్లాసురూమ్‌లలో అన్ని సామాజిక తరగతుల వారు వుంటారు. అనేక ఆదర్శ భావాలున్నవారు, వివిధ ఆలోచనలున్నవారు వుంటారు. తరగతి గదిలో టీచర్‌తో, తోటి విద్యార్థుల మధ్య పరస్పరం భావాల, అనుభవాల మార్పిడి జరుగుతుంటుంది. విజ్ఞాన తృష్ణ... భవిష్యత్ సమాజ నిర్మాణానికి అవసరమయ్యే సామాజిక స్పృహ అలవడేది ఇక్కడే. ప్రశ్నించే తత్వం నేర్చుకునేది క్లాసురూమ్‌లోనే. ఈ క్రమంలో భయం భయంగానే క్లాసులు ప్రారంభమౌతున్నాయి. పిల్లలు గుంపులుగా రావడం వల్ల ఎక్కడ కరోనా అంటుకుంటుందోననే బెంగ, ఆందోళనల నడుమ పాఠశాలలు ప్రారంభమౌతున్నాయి. 'మీదే, మీదే సమస్త విశ్వం!/ మీరే లోకపు భాగ్యవిధాతలు!/ మీ హాసంలో మెరుగులు తీరు/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు!' అంటాడు మహాకవి శ్రీశ్రీ. త్వరలోనే ఆ పరిమితుల్ని, భయాందోళనల్ని జయించి, తిరిగి పూర్వపు స్వేచ్ఛ, సృజన... తరగతి గదిలోకి ప్రవేశించగానే కలిగే ప్రజాస్వామ్య స్ఫూర్తి... అనుభూతి తప్పకుండా మళ్లీ వస్తుందని మనమందరం ఆశిద్దాం...










