కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. అయితే ఇలాంటి వారి కోసం ఓ సామాజిక కార్యకర్త ముందుకు వచ్చారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 100 మంది చిన్నారులను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఎన్‌జిఓ స్వచ్ఛంద సంస్థ జారు (జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్) నిర్వాహకులు జై శర్మ ముందుకొచ్చారు. అంతేకాకుండా కరోనా క్లిష్ట సమయాల్లో అనేక సేవా కార్యక్రమాలనూ చేశారు ఈ సంస్థ సభ్యులు.. ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ కిట్లు, శానిటరీ మెటీరియల్ వంటివి అందజేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కరోనా వైరస్ లక్షల మంది ప్రాణాలను తీసింది. అనేక కుటుంబాలను అల్లకల్లోలం చేసింది. ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా కరోనా కారణంగా అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. లోకం తెలియని పసివారు కన్నవారు లేకపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సర్వం కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. అయితే ఇలాంటి వారి కోసం ఓ సామాజిక కార్యకర్త ముందుకొచ్చారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 100 మంది చిన్నారులను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనే డెహ్రాడూన్‌కు చెందిన సామాజిక కార్యకర్త జై శర్మ. ఆయనకు చెందిన జారు (జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే 20 మందిని దత్తత తీసుకోగా.. త్వరలోనే మరో 80 మంది అనాథలను చేరదీయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఎన్‌జీవో ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'కరోనా రెండో వేవ్ ప్రారంభమైన రెండు వారాలకే.. వైరస్ వల్ల తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలున్న ఐదు కుటుంబాలను గుర్తించాం. కన్నవారు లేక ఆ పిల్లలు ఒంటరివారయ్యారు. ఇందులో 4, 5వ తరగతి పిల్లలు కూడా ఉన్నారు. ఒకరు 12వ తరగతి కాగా.. మిగిలిన వారంతా చిన్న వయసు వారే. ఆ సమయంలో వారి పరిస్థితి చూసి చాలా బాధేసింది. ఇప్పటికి 20 మంది పిల్లలను చేరదీశాం. వారికి ఆహారం, వసతి, వైద్యం, ఆర్థిక సదుపాయాలతో అన్నీ చూసుకుంటున్నాం. ఆ పిల్లల్లో ఇద్దరు డెహ్రాడూన్ వారు కాగా.. మిగిలిన వారు వేరే ప్రాంతాల వారు. వారంలోగా 50 మంది పిల్లలను తీసుకొస్తాం. మొత్తంగా ప్రస్తుతానికైతే 100 మంది పిల్లలను చేరదీయాలని నిర్ణయించాం. జారు నుంచి నేను (వ్యవస్థాపకులు జై శర్మ) పిల్లలకు సాధ్యమైనంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా' అంటూ జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
జాయ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నిత్యం కొన్ని గ్రామాలకు వెళుతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు ఉంటే సాయం చేసేందుకు సమాచారం సేకరిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు జారు ఎన్‌జీవో ఫౌండర్ జై శర్మ ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయకుండా ఆక్సిజన్‌ను సైతం ఎన్జీవో తరపున అందించారు. అలాగే ఎన్జీవో బందాలు.. కోవిడ్ మెడికల్ కిట్లు, శానిటైజేషన్ కిట్లు (శానిటరీ ప్యాడ్లు, శానిటైజర్లు, మాస్క్‌లు, సబ్బులు) అవసరమైన వారికి ఇతర వైద్య సామాగ్రిని అందించారు. కొందరికి వైద్య సాయం కూడా చేశాయి. దీంతో పాటు కొన్ని గ్రామాల్లోని పేదలకు నిత్యావసరాలైన ఆటా, బియ్యం, చక్కెర, మషాల దినుసులు, పప్పు, నూనెతో సహా రేషన్ కిట్లనూ సరఫరా చేశారు. వీరందరికీ సాయం చేయడానికి నిధులు సమకూర్చిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాలన్నింటినీ జై శర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.