ప్రజాశక్తి - ఆలూరు
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆలూరులో పంట పొలాలను సిపిఐ బృందం పర్యటించి పరిశీలించింది. రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశించిన వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు మొలక దశలోనే ఎండిపోతున్నాయని తెలిపారు. గతేడాది పత్తి, మిరపకు ధర బాగుండడంతో ఈ ఏడాది పశ్చిమ ప్రాంతంలో పత్తి, మిరప ఎక్కువగా సాగు చేశారని చెప్పారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికే రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారన్నారు. వ్యవసాయ శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా పంటలను పరిశీలించి, రైతులు సాగు చేసిన వేరుశనగ, పత్తి, మిరప పంటలకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కె.భూపేష్, మండల కార్యదర్శి పి.రామాంజనేయులు, రైతు సంఘం తాలూకా నాయకులు చంద్రకాంత్ రెడ్డి, హోతూరప్ప, ఎఐటియుసి తాలూకా అధ్యక్షులు శివ, మొలగవల్లి గ్రామ కార్యదర్శి రంగన్న, ఓబులేసు పాల్గొన్నారు.
పంట పొలాలను పరిశీలిస్తున్న నాయకులు










