Oct 19,2023 19:41

కరపత్రాలు పంపిణీ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు సుదర్శన్‌, కల్లుబావి రాజు డిమాండ్‌ చేశారు. గురువారం కరువుపై ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖను ఆదోని మార్కెట్‌ యార్డులో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో ఆర్‌డిఎస్‌ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయాలని, రబీ సీజన్‌లో పంటలు వేయడానికి 90 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. ఎఐటియుసి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎంకన్న, వైటి.భీమేష్‌, షేక్షావలీ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం నాయకులు మధురి ఎల్లప్ప, బోయ ప్రకాష్‌ పాల్గొన్నారు.