Jun 17,2023 20:54

తుంగభద్ర డ్యాం (ఫైల్‌)

ప్రజాశక్తి - హోళగుంద
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు మంచి వర్షాలు కురవకపోవడంతో తుంగభద్ర డ్యాం వెలవెలబోతోంది. డ్యాంలో కేవలం 4 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. డ్యాంలో నీరు లేకపోవడంతో ఎల్‌ఎల్‌సి కింద వరిసాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు మంచి వర్షాలు కురవకపోవడంతో తుంగభద్ర డ్యాం వెలవెలబోతోంది. వరద ప్రవాహం లేక గతేడాదికి సంబంధించిన నీరు కేవలం 4 టిఎంసిలు మాత్రమే ఉంది. ఈఏడాది ఎల్‌ఎల్‌సి కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జూన్‌ 15 నాటికి 50 టిఎంసిల నీరు నిల్వ ఉండేది. ఈఏడాది వర్షాల్లేక జీరో ఇన్‌ఫ్లో కొనసాగడం ఇదే మొట్టమొదటిసారి అని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.
తాగు, సాగునీరు ప్రశ్నార్థకమే
కర్ణాటకలోని శివమొగ్గ, చిక్క మంగళూరు, చిత్రదుర్గ, ధవనగిరి తదితర ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవలేదు. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో రాకపోతే తాగు, సాగునీరు కూడా ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కర్ణాటకతోపాటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఎల్‌ఎల్‌సి కాల్వ కింద లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. జూన్‌ నెల 16 దాటుతున్నా ఇంతవరకు తుంగభద్ర డ్యాంకు చుక్క నీరు కూడా చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
డ్యాం కెపాసిటీ 105 టిఎంసిలు
తుంగభద్ర డ్యాం కెపాసిటీ 105 టిఎంసిలు. ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో ఒక్క చుక్క వరద నీరు కూడా డ్యాంకు చేరలేదు. డ్యాం అధికారులతో పాటు డ్యాం నీటిపై ఆధారపడిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో కేవలం 4 టిఎంసిల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇంకో 15 రోజులు వర్షాలు కురవకపోతే ఉన్న నీరు కూడా ఆవిరైపోయే ప్రమాదం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.