May 09,2023 21:34

ప్రజాశక్తి - మండవల్లి
              క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ప్రథమ స్థానాలు వాటంతట అవే కైవసం అవుతాయని యువసాయి ప్రదీప్‌ రుజువు చేశాడని ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామదుర్గ ప్రసాద్‌ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలకు చెందిన యువసాయి ప్రదీప్‌ పదో తరగతి పరీక్షల్లో 585 అత్యధిక మార్కులు సాధించి మండల ప్రథమ స్థానం సాధించాడు. యువసాయిప్రతీప్‌కు మంగళవారం నిర్వహించిన అభినం దన సభలో ఎంపిపి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతో కష్టపడి చదివి చదివినది జ్ఞాపకం పెట్టుకుని పరీక్షలు రాయబట్టే మండల ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. మరిన్ని ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులక,ు గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురా వాలని ఆయన కోరారు. అనంతరం 545 మార్కులు సాధించి పాఠశాల ద్వితీయ స్థానంలో నిలిచిన గొర్రెపర్తి కుసుమను, 528 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన గంగుల జగదీష్‌ను, 524 మార్కులు సాధించిన గంగునేని నాగ సాయిని, 519 మార్కులు సాధించిన గంగుల లిఖిత్‌ శివమణిని, 501 మార్కులు సాధించిన ముచ్చర్ల జయశ్రీని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పుర ప్రముఖులు విద్యా కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మెండ ఝాన్సీ, రైతు సంఘం నాయకులు చేబోయిన వీర్రాజు, సొసైటీ అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్‌, సుధామ ఫౌండేషన్‌ అధినేత విజరు కుమార్‌, ముళ్లపూడి సత్తిబాబు, మెండ సురేష్‌, ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.