
క్రమశిక్షణతో మెలిగినప్పుడే విజయం వరిస్తుంది
ప్రజాశక్తి - పగిడ్యాల
క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగినప్పుడే విజయం వరిస్తుందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి అన్నారు. గురువారం పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో జట్టు శిక్షణ శిబిరం ముగిసింది. జడ్పిటిసి పుల్యాల దివ్య, ఉమ్మడి జిల్లా ఖోఖో చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి దంపతుల కుమారుడు పుల్యాల చరణ్ రెడ్డి గత సంవత్సరం మృతి చెందారు. కీశే పుల్యాల చరణ్ రెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్రస్థాయిలో ఖోఖో పోటీలలో పాల్గొనే ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో జట్టుకు, శిక్షణలో పాల్గొన్న 32 మంది క్రీడాకారులకు, క్రీడా దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. క్రమశిక్షణతో పాటు పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే విజయం వరిస్తుందన్నారు. ప్రతి క్రీడాకానికి ముఖ్యంగా ఉండవలసింది క్రీడా స్ఫూర్తినని అన్నారు. ఓటమి చెందినప్పుడు కంగిపోవడం, విజయం వరించినప్పుడు అతి ఉత్సాహం చూపినప్పుడే క్రీడా జీవితానికి ముప్పు వస్తుంది అన్నారు. ఓటమిని గెలుపును సమానంగా స్వీకరించినప్పుడే విజయం తనంతట తానే వరిస్తుందన్నారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరుగు చిత్తూరు జిల్లా యాదమర్రిలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొని విజయం సాధించి కప్పు గెలుచుకొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరుమాళ్ల శేషన్న, గ్రామ పెద్దలు నాగేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మద్దిలేటి రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు కష్ణ, చక్రపాణి, శ్రీధర్ కుమార్, రాగన్న, క్రీడా శ్రీ తోకల పితాంబ రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు.
