ప్రజాశక్తి-పాడేరు:క్రమశిక్షణతోనే ఉత్తమ విద్య నభ్యసించి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థినీలకు హితబోధ చేశారు. సోమవారం పాడేరు మండలం కుమ్మరిపుట్టులో గల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాటశాలలో నిర్వహించిన జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2,910 పాఠశాలల్లో 1,66,709 మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు., ప్రభుత్వ పాటశాలలలో కార్పోరేట్ పాటశాలలకు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించటంతో పాటు శిక్షణ పొందిన ఉత్తమ ఉపాద్యాయులను నియమించడమే కాకుండా విద్యార్ధులకు అవసరమైన విద్యా కిట్లను కూడా అందించటం జరుగుతుందన్నారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు. గిరిజన ప్రాంతమైన ఈ జిల్లాలో ఉపాధ్యాయులపై మరింత భాద్యత ఉందన్నారు.
ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పాఠశాలలు పుణ్ణప్రారంభం రోజునే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక పేరుతో పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, షాక్స్, డిక్షనరీతో కూడిన బ్యాగులను పంపిణీ చేయటం గొప్ప విషయమన్నారు. విద్యార్ధుల భవితపై ముఖ్యమంత్రికి ఉన్న ఆదరాభిమానాలకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్ధులకు ఉత్తమ విద్యతో పాటు నాడు-నేడు కింద అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతోందన్నారు.
పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారని, వారికి నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామన్నారు. పోటీ ప్రపంచంలో అందరితో పోటీ పడే విధంగా వారిని తీర్చి దిద్దాల్సిన భాద్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసారు. జిల్లాలో 2,910 పాఠశాలలో 1,66,709 మంది విద్యార్ధులకు కిట్లు అందిస్తామని జిల్లా విధ్యాశాఖాదికారి సలీం భాషా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, స్థానిక సర్పంచ్ సీతమ్మ, ఎంపిపి రత్నకుమారి, ఎంపిటిసి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సూరిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాష, ఎటిడబ్ల్యుఓ రజని, మండల విద్యాశాఖాధికారి, పాటశాల ప్రదానోపాద్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.
కిట్లు పంపిణీ ప్రారంభం:
అరకులోయ:విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకుని వచ్చి మంచి భవిష్యత్తుకు పునాది వేయడానికి జగనన్న విద్య కానుక పంపిణీ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. జగనన్న విద్యా కానుక నాలుగో విడత కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అరకులలోని సిఏహెచ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్, సహాయ కలెక్టర్ ఆశతో శ్రీవాత్సవ, డిడి కొండలరావు, ఎంపీపీ ఉషారాణి లతో కలిసి కిట్ల పంపిణీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచి విద్యనందించాలన్నదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే నాడు- నేడు ద్వారా పాఠశాలల రూప రేఖలు మార్చారన్నారు.
ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అభిషేక్ మాట్లాడుతూ, నాడు నేడుతో పాఠశాల ముఖచిత్రం మారిందని అన్నారు. నాణ్యమైన పుస్తకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలను విధిగా బడికి పంపాలని 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడిని ప్రభుత్వం ఇస్తుందన్నారు.విద్యార్థులు బాధ్యతగా చదివితేనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అన్నారు.
అసిస్టెంట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. పాడేరు డిడి కొండలరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యా కానుక పంపిణీ చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భారతరత్న, ఎంపిపి రంజపల్లి ఉషారాణి, ఏటి డబ్ల్యూ వో మల్లికార్జునరావు, ఎంపిటిసి భీమరాజు, హెచ్‌ఎంలు ఎల్‌బి.దయానిది, బాలాజీ పాల్గొన్నారు.
హుకుంపేట:- మండలం మఠం పంచాయతీ దురువీధి గ్రామం ఎంపియుపి పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను విద్యా కమిటీ చైర్మన్ చేతులు మీదుగా విద్యార్థులకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కేశవరావు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పధకాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాజవొమ్మంగి:స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సూరారెడ్డి, పీఎంసీ చైర్మన్ సిహెచ్.వీరబాబు ఆధ్వర్యంలో నాలుగో విడత జగనన్న విద్యా కానుక కిట్లును ఎంపిపి గోము వెంకటలక్ష్మి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నాడు-నేడులో భాగంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రూపుదిద్దినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సిహెచ్ చంద్రరాణి, పాఠశాల ఉపాధ్యాయులు అర్జమ్మ, ఉదరు మనోహర్, గ్రామస్తులు రాణి, కె వీరబాబు విద్యార్థులు తల్లిదండ్రులు, పిఎంసి కమిటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.










