ప్రజాశక్తి-సీతమ్మధార : విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని ఇటీవల సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించిన పూసపాటి సాహిత్య చెప్పారు. విశాఖ పౌర గ్రంథాలయాన్ని శనివారం ఆమె సందర్శించారు. విద్యార్థులతో పలు విషయాలపై ముచ్చటించారు. గ్రంథాలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, పోటీపరీక్షల్లో చదువుకోడానికి సదుపాయాలు కలిగి ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు. ఆరోసారి సివిల్స్‌లో తనకు 24వ ర్యాంకు వచ్చిందని ఆమె చెప్పారు. మొదటి ప్రయత్నాల్లో ర్యాంకు రాలేదని నిరుత్సాహం ఉండకూడదన్నారు. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చదవాలని సూచించారు. అమెరికాలో ఉండే ల్యాబ్ కన్నా విశాఖపట్నం పౌర గ్రంథాలయం ఎంతో అందంగా ఉందన్నారు. అనంతరం గ్రంథాలయం అధ్యక్ష కార్యదర్శులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అధ్యక్షులు విజరు కుమార్, కార్యదర్శి డిఎస్ వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.










