ప్రజాశక్తి -బాపట్ల జిల్లా : క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అనిఎస్‌పి వకుల్ జిందాల్ తెలిపారు. పోలీస్ శాఖలో ఎఆర్ విభాగం వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఎఆర్ సిబ్బంది శుక్రవారం కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పి పాల్గొని సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతును వీక్షించారు. అనంరం ఎఆర్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ క్రమశిక్షణ అనేది పోలీస్ శాఖకు పునాది రాయి లాంటిదన్నారు. పోలీస్ సిబ్బంది క్రమ శిక్షణతో మెలుగుతూపై అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారన్నారు. అర్‌ఐ మన్మధరావు పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించి ఎఆర్ సిబ్బందితో నిర్వహించిన కవాతు ఆద్యంతం అద్భుతంగా ఉందన్నారు. ఆగస్టు 15న నిర్వహించే కవాతును విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేయాలన్నారు. ప్రజల భద్రత కోసం పాటుపడుతున్న పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా ఏర్పడినప్పటి నుండి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి అవసరాలని ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అల్పాహార క్యాంటీన్ భవన నిర్మాణం పూర్తికావస్తుందని, వెల్ఫేర్ క్యాంటీన్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. సిబ్బంది సమస్యలను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, మాయోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు ప్రీమియం చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి పి.మహేష్ , ఎఆర్‌డి ఎస్‌పి ప్రేమ్ కుమార్, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్‌ఐ బి.శ్రీకాంత్ నాయక్,అడ్మిన్ ఆర్‌ఐ ఎల్.మన్మధరావు, ఎఆర్ సిబ్బంది పాల్గొన్నారు.










