Nov 21,2022 23:47

విద్యార్థులతో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి-అనంతగిరి : విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ తప్పనిసరి అని, క్రమశిక్షణ తప్పితే అనర్థాలేనని జెడ్‌పిటిసి దీసరి గంగరాజు, ఎంపిపి శెట్టి నీలవేణి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని సందర్శించారు. శనివారం తాడిగూడ జలాశయంలో జూనియర్‌ కాలేజీకి చెందిన విద్యార్థి మృతి చెందిన నేపథ్యంలో కళాశాలను సందర్శించి దీనిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలేజీకి వచ్చిన విద్యార్థులు సక్రమంగా తరగతి గదుల్లో ఉండి చదువుకోవాలని, కాలేజీ వేళల్లో ప్రిన్సిపల్‌, ఇతర సిబ్బంది అనుమతులు లేకుండా బయటకు వెళ్లడం సరికాదన్నారు. కొందరు పిల్లల చేష్టల వల్ల ఇటువంటి అనర్థాలే జరుగుతాయన్నారు. దీని వల్ల కాలేజీకి చెడ్డపేరుతోపాటు తల్లిదండ్రులకు గుండెకోత తప్పదన్నారు. కాలేజీకి వచ్చిన తర్వాత అత్యవసరమైతేనే ప్రిన్సిపల్‌, ఇతర లెక్చరర్ల పర్మిషన్‌తో బయటకు వెళ్లాలని సూచించారు. కాలేజీ విద్యార్థులు గుంపులుగా రోడ్లపైనే కనబడుతున్నారని, ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. గతేడాది ఇంటర్‌ ఫలితాలు మరీ తీసికట్టుగా వచ్చాయని, ఈ ఏడాది ఇప్పటికైనా బాగా చదువుకుని మంచి రిజల్ట్‌ సాధించాలని సూచించారు. విద్యార్థులు మాట వినకపోతే, తమ దృష్టికి తీసుకురావాలని కాలేజీ యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సోమల రూతు, కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మదీనా, వార్డు మెంబర్‌ సుబ్బారావు, టిడిపి మండల మహిళా నాయకురాలు బి లక్ష్మి, బుజ్జిబాబు ఎంపిడిఒ హర్షిత్‌, ఉప తహశీల్దార్‌ పాత్రుడు, కళాశాల ప్రిన్సిపాల్‌ సునంద, పోలీసులు పాల్గొన్నారు.