ప్రజాశక్తి- విఆర్.పురం
ఎగువన నాలుగు రాష్ట్రాల్లో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో శబరి గోదావరి సంగ్రామంలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో పోలవరం ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే కాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల వారు పడిన ఇబ్బందులు, నెలల తరబడి ఇళ్లను వదిలి గుట్టలపై తలదాచుకున్న వైనాన్ని గుర్తు చేసుకొని భయకంపితులవుతున్నారు. తాగేందుకు నీరు లేక, రెండు పూటలా అన్నం లేక, బిక్కుబిక్కుమంటూ చెట్టు కొకరు, పుట్టకొకరు ఉన్న పరిస్థితిని తలుచుకొని భయపడుతున్నారు. గతేడాది వరదులు తగ్గిన తరువాత ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి ఒక్కొక్కరు రూ.50వేలకు పైగా చేసిన ఖర్చులను తలుచుకుంటున్న నిర్వాసితుల గుండెలు గుబేలు మంటున్నాయి. గతేడాది లాగా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని తమకు సరైన పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.










