ప్రజాశక్తి-కర్లపాలెం: గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ బాపట్ల సబ్ డివిజన్ పరిధి లోని కర్లపాలెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ నిర్వహించారు. ముందుగా సిబ్బంది వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను, ఎస్‌హెచ్‌ఓ, రైటర్, కంప్యూటర్ గదులను, కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించారు. కేసు ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి సంబంధిత కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. తదనంతరం స్టేషన్లో పనితీరును చూసి ఎస్‌ఐ శివయ్యను అభినందించారు. అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిఎస్‌పి టి వెంకటేశ్వర్లు, బాపట్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీనివాస్, సిసి హరికృష్ణ, కర్లపాలెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివయ్య, కర్లపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసులు పాల్గొన్నారు.










