Aug 21,2023 22:31

కరకట్టలకు కొర్రీ.. వరదలొస్తే వర్రీ

* 2020లోనే ప్రమాదకర వరద ముంపు ప్రాంతాల గుర్తింపు
* అధికారుల ప్రతిపాదనలకు పలుమార్లు కొర్రీలు
* మూడేళ్లుగా ఇదే తంతు
* అడుగు పడని వంశధార, నాగావళి కరకట్టల పనులు

    కరకట్టల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఉదాసీనత కనబరుస్తోంది. కరకట్టల నిర్మాణానికి పెద్దఎత్తున భూమిని సేకరించాల్సి ఉండటం, భూసేకరణకు అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వం 2019లో ఉన్నపళంగా కరకట్టలను రద్దు చేసింది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో వరద గట్ల నిర్మాణాలకు ప్రతిపాదన లను పంపాలని అధికారులకు సూచించింది. జిల్లాలో ఆ విధంగా ఉన్న ప్రాంతా లను గుర్తించి అధికారులు 2020 ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలను అధికారులు పంపుతున్నా ప్రభుత్వం అంచనా వ్యయం, భూసేకరణ.. అంటూ ఏదో ఒక కొర్రీ వేసి వెనక్కి పంపుతోంది. దీంతో వంశధార, నాగావళి కరకట్టల కొత్త పనులకు ఒక్క అడుగూ పడటం లేదు. ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు వంశధార, నాగావళిలో నీటి ప్రవాహం పెరగడంతో నదీతీర గ్రామాల ప్రజలు భయాందోళనతోనే కాలం గడిపారు.
ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : వంశధార, నాగావళి నదుల వరదల నుంచి నదీ తీర గ్రామాల రక్షణకు గతంలో కరకట్టల పనులను ప్రారంభించినా ఫలితం లేకపోయింది. 2009-10 మధ్య కాలం వరకు కాస్తా కూస్తో పనులు జరిగినా ఆ తర్వాత నుంచి ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 25 శాతంలోపు ఖర్చయిన పనులను నిలిపేసి, వరద ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించింది. ముంపు తీవ్రత అధికంగా ప్రాంతాలను గుర్తించి అందులో ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమివ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నాగావళి కరకట్టలకు సంబంధించి అధికారులు తొలుత ఐదు ప్రాంతాలను గుర్తించారు. నాగావళి నది పరివాహక ప్రాంతమైన ఆమదాలవలస మండలం తొగరాం వద్ద రూ.13.14 కోట్లతో, గండ్రేడు వద్ద రూ.8.82 కోట్లతో, బెలమాం వద్ద రూ.1.83 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బూర్జ మండలం అల్లెన నుంచి బూర్జ పాత కరకట్ట వరకు వరద గట్టు కోసం రూ.13.86 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మొత్తం రూ.37.65 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అదే విధంగా వంశధార నదీ పరివాహక ప్రాంతంలో 22.77 కిలోమీటర్ల మేర కరకట్టలను నిర్మించేందుకు రూ.77.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పంపి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు
కరకట్టల పనుల పరిస్థితి ఇలా..
వంశధార నదిపై నిర్మించాల్సిన కరకట్టలను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీ పనులు 2007లో ప్రారంభించారు. ఇప్పటివరకు 7.55 శాతం పనులే పూర్తయ్యాయి. 2007లోనే మొదలైన ప్యాకేజీ-2 పనులు 5.66 శాతం మాత్రమే జరిగాయి. ప్యాకేజీ-3 పనులను కూడా 2007లో ప్రారంభించారు. 2.45 శాతం పనులు పూర్తి చేశారు. 2009లో ప్రారంభమైన ప్యాకేజీ-4 పనులు 21.32 శాతం జరిగాయి. నాగావళి నదిపై నిర్మిస్తున్న కరకట్టల పరిస్థితి కూడా అలానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న కరకట్టలను నాగావళి-2 ప్యాకేజీ పనులుగా చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్‌ సంస్థకు రూ.61.45 కోట్లకు పనులను అప్పగింఆరు. 2008లోనే పనులను ప్రారంభించింది. ఇప్పటికి కూడా పనుల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. జిల్లా పరిధిలో 51.88 కిలోమీటర్ల మేర వరద కట్ట నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 17.29 కిలోమీటర్ల పొడవు మేర మాత్రమే పని పూర్తయింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 శాతం కంటే తక్కువ ఖర్చు చేసిన పనులను తాత్కాలికంగా నిలిపేయాలంటూ మే 29, 2019న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు ఎక్కడి పనులను అక్కడే నిలిపేశారు
గ్రామాలను ముంచుతున్నా ఉదాసీనమే
హిరమండలం మండలం గొట్టా బ్యారేజి వద్ద గతేడాది ఆగస్టు 15న వంశధారలో 82,470 క్యూసెక్కుల వరద నీరు రావడంతో కొత్తూరు మండలం మాతల, పెనుగోటివాడ తదితర గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. పొలాలను వరద నీరు ముంచెత్తి, రహదారులపైకి వచ్చి చేరింది. హిరమండలం మండలం అక్కరాపల్లి, రెల్లివలసలో అపరాలు, గులుమూరులో వరి చేలు వరదనీటిలో మునిగాయి. నాగావళిలో 50 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహిస్తే, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కాని గతేడాది సెప్టెంబర్‌లో 42 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికే ఆమదాలవలస మండలం కలివరం, బూర్జ మండలం అల్లెన గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.
మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం
జిల్లాలో అత్యంత వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ప్రభుత్వం 2019లో సూచించింది అందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి 2020లో పంపాం. పనులపై ప్రభుత్వం సూచించిన రిమార్కులను పరిగణనలోకి తీసుకుని తిరిగి పంపుతున్నాం. పనుల కోసం భూసేకరణ చేపట్టాలని సూచించడంతో మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.
- సుధాకరరావు, ప్రత్యేక కట్టడాల విభాగం ఇఇ