
పజాశక్తి - కడియం టిడిపికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ప్రభుత్వం కక్షపూరితంగా మద్యం కేసును పెట్టిందని టిడిపి బిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆరోపించారు. వేమగిరిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బయట ఉంటే తమకు ఓటమి తప్పదని గ్రహించిన సిఎం జగన్ రెడ్డి అక్రమ కేసులతో జైలులో పెట్టారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో బిసి యువతకు ఒక్క రుణాన్ని ఇవ్వలేదన్నారు. బిసి సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి బిసిలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలను అణగదొక్కుతున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.