
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : జిల్లాలో పలుమండలాల్లో సంచరిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గజరాజులు ఇప్పుడు జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణంలోనే ప్రవేశించి పురప్రజలను గజగజ వణికి స్తున్నాయి. గుంపునుండి వీడిపోయిన హరి అనే ఒంటరి ఏనుగు అదివారం వేకువజామున పట్టణశివారు కొత్తవలస ఐదో వార్డులోని మణికంఠ కాలనీలో సంచరిస్తూ భయోత్పాతం సృష్టించింది. కొమరాడ మండలం నుంచి పనులు జరుగుతున్న రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ నుండి మణికంఠకాలనీ, రైల్వే ఫ్లైవర్ బ్రిడ్జి పక్క నుంచి విజయరామరాజు కాలనీవైపు వెళ్లినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఏనుగు ప్రవేశించిన వేళ అర్ధరాత్రి కావడంలో జనసమ్మర్ధం లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. అయితే దృశ్యాలను 'సెర్చ్ ఫోన్లలో బంధించిన కొందమంది యువకులు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో ఏకంగా పట్టణలోనికి ప్రవేశించిన ఏనుగును చూసి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాధారణంగా పట్టణంలో వేకువజాముకు ముందే జనం సందడి మొదలౌతుంది. వ్యవసాయ పనులు, చిల్లరవ్యాపారస్తులు, ప్రయాణికులు, మోర్సింగ్ వాకింగ్, దైవదర్శనాలు నిమిత్తం బయటకు వచ్చేవారు ఈ ఏనుగబారిన పడే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల నియంత్రణలో అటవీశాఖ తీవ్ర వైఫల్యం
ఒడిషాలోని లకేరి అడవుల నుంచి ఆరేళ్లక్రితం వచ్చిన ఏనుగుల గుంపును నియంత్రించడంలోను, వాటిని వేరే ప్రాంతాలకు తరలించడంలో అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం తీవ్రమైన వైఫల్యమైందని జిల్లా వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా తిష్టవేసి ఉన్న మాజీ గిరిజన సంక్షేమశాఖమంత్రి, ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే ఏనుగుల తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ప్రజసంఘాల నాయకులు జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగితే బాధితులకు నష్టపరిహారానికి కృషి చేస్తున్నామని, ఏనుగులను తరలించేందుకు మచ్చిక ఏనుగులను (కొంకి) తెప్పించేందుకు పైఅధికారులకు సిఫార్సులు చేశామని చెబుతున్నారు. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు పెద్ద సమస్యగా మారిన ఏనుగుల తరలింపుపై ప్రభుత్వంగానీ, అధికారుల గానీ చర్యలు తీసుకోకపోతే ప్రజలే పెద్దఎత్తున ఉద్యమించే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
రాత్రి వేళల్లో గస్తీ పెంపు : డిఎఫ్‌ఒ
ఏనుగు సంచారంపై రాత్రి వేళల్లో గస్తీ (పెట్రోలింగ్) పెంపు చేశామని జిల్లా అటవీ అధికారి జిఎపి ప్రసూన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం అర్ధ రాత్రి ఒంటరి ఏనుగు ''హరి'' పార్వతీపురం పట్టణం మీదుగా కొత్త దారిలో అంకులవలస చేరుకుందన్నారు. ఏనుగుల సంచారంపై సమాచారం ఉంటే పార్వతీపురం ఫారెస్ట్ సెక్షన్ అధికారి 9493399467, ఏనుగుల పర్యవేక్షణ విభాగం అటవీ రేంజ్ అధికారి 9440821237 ఫోన్ నంబర్లకు అందించి ప్రజల భద్రతకు, సురక్షతకు చర్యలు తీసుకొనుటకు సహకరించాలని ఆమె కోరారు.