Nov 04,2021 06:54

ఇటీవల కాలంలో బిట్‌కాయిన్‌, ఇతర ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలు ఉరకలు వేస్తున్నాయి. గతంలో కన్నా బిట్‌ కాయిన్‌ ఎక్కువగా పరుగులు తీయడానికి భారత్‌లో రిటైల్‌ పెట్టుబడిదారులు ఇందులో పెద్ద యెత్తున పాల్గొంటుండడమే కారణమని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ మారకంపై ఆంక్షలు విధిస్తూ ఏప్రిల్‌ 6, 2018న భారత రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటి నుండి అంటే 2020 నుండి, భారత్‌లో దేశీయ క్రిప్టో కరెన్సీ మార్పిడుల రద్దీ అనేక రెట్లు పెరిగింది. అయినా, చాలా మంది భావిస్తున్నట్లుగా బిట్‌ కాయిన్‌ ఇతర క్రిప్టో కరెన్సీల భవితవ్యం ఏమంత దివ్యంగా వుండకపోవచ్చు.

ఎందుకీ వేలం వెర్రి?
క్రిప్టో కరెన్సీల్లో అత్యంత ముఖ్యమైన అంశం వాటి సరఫరా పరిమితంగా వుండడడం. దీనికోసం ఎగబడేవారు ఎక్కువగా ఉండడం. అనూహ్యమైన రీతిలో పెద్ద మొత్తంలో డబ్బును సృష్టించే కేంద్ర బ్యాంకులు ఉన్న ఈ ప్రపంచంలో తమ సంపదను కాపాడుకునేందుకు మదుపరులు తమ సంపదను ప్రత్యామ్నాయ ఆస్తుల రూపంలో దాచుకునేందుకు దారులు వెతకడం సాధారణంగా జరుగుతుంది. అయితే వీటి సరఫరా అంత సులువుగా జరిగేది కాదు. కేంద్ర బ్యాంకులు డబ్బు విపరీతంగా సృష్టించడం వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది ప్రత్యామ్నాయ ఆస్తులను కరెన్సీలుగా ఆమోదించే ధోరణుల పెరుగుదలకూ దారి తీస్తుంది. కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో డబ్బు సృష్టించినపుడు... కేవలం ఆహారం, ఇతర నిత్యావసర సరుకులు, కార్లు వంటి వస్తువుల ధరలే కాదు, డబ్బుకు ప్రత్యామ్నాయ రూపాలుగా భావించే బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతాయి. అయితే, బిట్‌ కాయిన్‌ విలువ వివిధ ఊహాజనితమైన వేలం వెర్రికి మించి పెరగడానికి ఇదే కాకుండా ఇంకా చాలా కారణాలున్నాయి.

క్రిప్టో కరెన్సీలను డబ్బుగా ఆమోదించాలంటే వాటి కొరత ఒక్కటే కారణం అని చెప్పలేం. ఏ సంపదకైనా దాని వినియోగ విలువ లేదా మారక విలువ అనేది తప్పనిసరిగా వుండాలి. అప్పుడే దానికి ప్రాథమికంగా ఏ విలువైనా వుంటుంది. తిరిగి ఈ ప్రాథమిక విలువ సుదీర్ఘకాలంలో ఈ ఆస్తుల ధరల్లో ప్రతిఫలించాలి. ఉదాహరణకు, స్టాక్స్‌ మరియు బాండ్లకు మారక విలువ వుంటుంది. అంటే ఈ ఆస్తుల నుండి భవిష్యత్తులో నగదు లభిస్తుందనే నమ్మకం వుంటుంది. చమురు, ఉక్కు వంటి వస్తువులకు వినియోగ విలువ వుంటుంది. ఎందుకంటే, వాహనాలు నడిపేందుకు, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను నిర్మించేందుకు వీటిని ఉపయోగిస్తారు. బిట్‌ కాయిన్‌ ఇతర క్రిప్టో కరెన్సీల కొరత వుండవచ్చు కానీ, వీటికి వినియోగ విలువ లేదా మారక విలువ వుందా అంటే ప్రశ్నార్ధకమే. బంగారం, వెండి వంటివి ద్రవ్యోల్బణ సమయాల్లో సాంప్రదాయంగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే వాటికి ప్రాథమిక విలువ వుంది. ఆభరణాలుగా, నగదుగా వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టో కరెన్సీల వల్ల ప్రత్యక్షంగా ఎలాంటి వినియోగ విలువా లేదు. లేదా గణనీయంగా మారక విలువా లేదు. క్రిప్టో కరెన్సీలు ఇప్పుడున్న గరిష్ట విలువను స్థిరపరచుకునే అవకాశం లేదు. మౌలికంగా దానికి అంతటి ప్రాధాన్యత లేకపోవడమే అందుకు కారణం.

అయినా, ఇప్పటికీ కొందరు పెరుగుతున్న క్రిప్టో కరెన్సీ విలువను చూసి భవిష్యత్తులో కరెన్సీగా దీనికే ఒక విలువ ఉంటుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్రైవేట్‌ కరెన్సీని నగదుగా ఆమోదించే పరిస్థితులు తలెత్తవచ్చని అంటున్నారు, అందువల్ల బిట్‌కాయిన్‌ విలువను పెంచుకుంటూ పోవడం పెట్టుబడిదారులకు సాధ్యమైంది. అదలా ఉంచితే, అన్ని పెట్టుబడులు ఎప్పుడూ భవిష్యత్‌వైపే దృష్టి సారిస్తాయి. క్రిప్టో కరెన్సీ విలువల్లో తీవ్రంగా ఒడుదుడుకులు వుండడాన్ని కూడా ఎవరైనా ఆమోదించాల్సి వుంటుంది. అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ కొత్తదైనందున, పైగా ఆ మార్కెట్‌కు ఎలాంటి ద్రవ్య స్వభావం లేనందున వాటి ప్రాథమిక విలువల్లో ఒడిదుడుకులు ఎదురైనా వాటితో సంబంధం లేనట్లు కనిపిస్తుంది. అయితే, వస్తువులు, సేవలకు మారుగా మరింత ఎక్కువగా క్రిప్టో కరెన్సీలను ఆమోదిస్తున్నట్లైతే వాటిపై ప్రభుత్వాలు కుప్పకూలే అవకాశాలు మరింత ఎక్కువగా వుంటాయి.

నగదు జారీ
డబ్బును ముద్రించి విడుదలజేయడంలో ప్రభుత్వాలు (కేంద్ర బ్యాంకులు) గుత్తాధిపత్యాన్ని కలిగి వుండడమే వారు అధికారాన్ని, ప్రాబల్యాన్ని కలిగి వుండడానికి మూలాధారంగా వుంది. ఇది, ప్రభుత్వాలు తమ బడ్జెట్‌ లోటులకు నిధులను సమకూర్చడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం తలెత్తిన కరోనా మహమ్మారి వంటి సంక్షోభ సమయాల్లో అనూహ్యమైన రీతిలో పన్ను రాబడులు దెబ్బ తిన్నపుడు ఇది పనికొస్తుంది. ఇది, ఆర్థిక వ్యవస్థలో పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో నగదు సరఫరాలో మార్పులు తీసుకురావడానికి కూడా కేంద్ర బ్యాంకులను అనుమతిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, నగదుపై గుత్తాధిపత్య నియంత్రణ అనేది కరెన్సీల సరఫరాలను పెంచడం ద్వారా ప్రభుత్వాలు పరోక్షంగా పౌరులపై పన్ను వేయడానికి అనుమతిస్తుంది. ఆ రకంగా వాటికి విలువ తగ్గిపోతుంది. బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలు మారక మాధ్యమంగా అమెరికా డాలరు వంటి ఫియట్‌ కరెన్సీలను సవాలు చేయబోతున్నట్లైతే అవి, తప్పనిసరిగా ముద్రించడానికి, ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి గల అధికారాన్ని కూడా సవాలు చేస్తాయి. దీనిని ప్రభుత్వాలు ఎక్కువ కాలం సహించవు. మారక మాధ్యమంగా వుండకుండా, కేవలం ఊహాజనిత ఆస్తిగా కొనసాగినంత కాలం మాత్రమే ఈ క్రిప్టో కరెన్సీలను ఆ ప్రభుత్వాలు అనుమతిస్తాయి.

క్రిప్టో కరెన్సీలకు వ్యతిరేకంగా తమ అణచివేత చర్యలను ప్రభుత్వాలు సమర్ధించుకుంటాయని చెప్పడం కాదు. అన్ని క్రిప్టో కరెన్సీలపైనా చైనా ఇటీవల పూర్తి నిషేధం విధించింది. పైగా తమ కేంద్ర బ్యాంక్‌ ద్వారా డిజిటల్‌ మనీని జారీ చేసే ఆలోచన కూడా చేస్తోంది. ఫియట్‌ కరెన్సీలకు ప్రైవేట్‌ ప్రత్యామ్నాయాలను చూపించడం వల్ల మారక మాధ్యమంగా ఏ కరెన్సీని ఉపయోగించుకోవాలో ఎంపిక చేసుకోవడానికి ప్రజలకు అవకాశం వుంటుంది. డబ్బులో స్వేచ్ఛా మార్కెట్‌ పోటీ ప్రయోజనాలను ఆర్థికవేత్త ఫ్రెడ్‌రిక్‌ హాయక్‌ 'ది డీ నేషనలైజేషన్‌ ఆఫ్‌ మనీ'లో వివరించారు. ఇందులో ముఖ్యమైన అంశమేమంటే, వినియోగదారుల డిమాండ్లను నెరవేర్చడంలో కరెన్సీల మధ్య పోటీ వల్ల విచక్షణారహితంగా ముద్రించే ఫియట్‌ కరెన్సీలతో ఎలాంటి ఉపయోగం వుండబోదని వినియోగదారులు నిర్ధారిస్తారు. ఇది ప్రభుత్వాలను బెంబేలెత్తిస్తున్నది. అందుకే దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని అవి నానా తంటాలు పడుతున్నాయి.

ప్రశాంత్‌ పెరుమాళ్‌
('ది హిందూ' సౌజన్యంతో)