కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినట్టిది. వర్చువల్ కరెన్సీ విషయంలో బిజెపి ప్రభుత్వం ప్రకటించిన విధానం దేశ ప్రజల్లో ఎటువంటి నమ్మకాన్నీ కలిగించలేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం క్రిప్టో లావాదేవీల మీద పన్ను వేయడం, క్రిప్టో కరెన్సీని అనుమ తించడం వంటి ఆలోచనలను విడనాడి మొత్తంగానే క్రిప్టో కరెన్సీని నిషేధించడం మంచిది. ఆ తర్వాత తగిన భద్రతతో కూడిన టెక్నాలజీని ఉపయోగించి రిజర్వు బ్యాంకు ద్వారా డిజిటల్ కరెన్సీని విడుదల చేయవచ్చు.
గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో క్రిప్టో కరెన్సీ గురించి వాడిగా, వేడిగా చర్చ జరుగుతోంది. క్రిప్టో కరెన్సీని సమర్ధించేవాళ్ళు ఈ కరెన్సీ బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతుందని, అందుచేత చాలా భద్రంగా దీనిద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చని వాదిస్తున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా తేలిక అని వారంటారు. రూ.100 నుంచీ పెట్టుబడి పెట్టవచ్చునని అంటారు.
క్రిప్టో కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ. అంటే మామూలు కరెన్సీ నోట్ల లాగా దీనిని ముద్రించడం అనేది జరగదు. మొట్టమొదటి క్రిప్టో కరెన్సీని సతోషి నకమోటో అనే వ్యక్తి మారుపేరుతో 2009లో ప్రారంభించాడు. ప్రస్తుతం మన దేశంలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడుతున్నవారు 1.5 కోట్ల నుండి 2 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరి వద్ద రూ.40,000 కోట్ల విలువ గల క్రిప్టో కరెన్సీ ఉంటుందని అంచనా. కాని వాస్తవంగా ఎటువంటి అధికారిక లెక్కలూ ఎక్కడా లేవు.
క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎటువంటి నిబంధనలూ లేవు. దీనికి సంబంధించి సమాచారం అంతా అస్పష్టంగా ఉంది. ఎటువంటి తనిఖీ దీనిపైన లేదు. చాలా రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. వాటిలో బిట్‌కాయిన్ అన్నింటికన్నా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉనికి లోకి క్రిప్టో కరెన్సీ వచ్చింది. డాలరు, రూపాయి వంటి కరెన్సీలకు ఒక కేంద్రీకృత నియంత్రణ, నిర్వహణ, జవాబుదారీతనం ఉంటుంది. క్రిప్టో కరెన్సీకి అటువంటిది ఏదీ లేదు. ఒక ప్రభుత్వం గాని, ఒక బ్యాంక్ గాని, ఒక సంస్థ గాని, ఒక కంపెనీ గాని బాధ్యత వహించడం అనేది లేదు.
చట్టవిరుద్ధ లావాదేవీలకు, అవినీతికి ఆస్కారం
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ 2018 జులై 11న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కూలిపోక తప్పదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరగాళ్ళు క్రిప్టో కరెన్సీని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమ నగదు లావాదేవీల మీద, ఇతర చట్టవిరుద్ధ ఆర్థిక కార్యకలాపాల మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే క్రిప్టో కరెన్సీ రద్దు కాక తప్పదని స్టిగ్లిట్జ్ అన్నారు. ''ఒక పారదర్శకమైన బ్యాంకింగ్ విధానాన్ని నడపాలనుకుంటున్నప్పుడు నిగూఢంగా నడిచే క్రిప్టో కరెన్సీ విధానం ఏవిధంగా చెల్లుతుంది?'' అని ప్రశ్నించారు. ''ఆర్థిక వ్యవస్థకు బిట్‌కాయిన్ వంటి ఒక రంధ్రాన్ని పెట్టడానికి అనుమతిస్తే ఇక ఆ రంధ్రం గుండా అన్ని రకాల తప్పుడు వ్యవహారాలూ సాగూతూనే వుంటాయి. ఏ ప్రభుత్వమూ దీనిని అనుమతించజాలదు'' అన్నారు.
ప్రపంచంలోని అనేకమంది ఆర్థికవేత్తలు సైతం ఈ క్రిప్టో కరెన్సీని వ్యతిరేకిస్తున్నారు. హవాలా కార్యకలాపాలకు, నల్లధనం చెలామణీకి, మాదకద్రవ్యాల వ్యాపారాలకు, మహిళలను చీకటి వ్యాపారం లోకి దించే వ్యవహారాలకు, చట్టవిరుద్ధంగా ఆయుధాల వ్యాపారం సాగించడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు క్రిప్టో కరెన్సీ ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. పైగా క్రిప్టో కరెన్సీ హ్యాకింగ్‌కు గురి కావచ్చునని హెచ్చరిస్తున్నారు. 37 వేల కోట్ల డాలర్ల క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో దాదాపు 40 కోట్ల డాలర్ల సంపద హ్యాకింగ్ ద్వారా చోరీకి గురైనట్టు 'ఎర్నెస్ట్ అండ్ యంగ్' అధ్యయన సంస్థ వెల్లడించింది.
వర్చువల్ కరెన్సీ లావాదేవీలను నిషేధించిన రిజర్వుబ్యాంకు
2018 ఏప్రిల్ 6న రిజర్వు బ్యాంకు క్రిప్టో కరెన్సీని నిషేధిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ''ఇప్పటికే 24-12-2013న, 1-2-2017న, 5-12-2017న పలుమార్లు, బహిరంగ ప్రకటనల ద్వారా, వినియోగ దారులను, వ్యాపారులను, బిట్‌కాయిన్ తదితర వర్చువల్ కరెన్సీల వాడకంలో ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరించడం జరిగింది. అందులో ముడిపడి వున్న ప్రమాదం రీత్యా, రిజర్వు బ్యాంకు అటువంటి వర్చువల్ కరెన్సీల లావాదేవీలలో రిజర్వు బ్యాంక్ నియంత్రణలో ఉన్న సంస్థలేవీ పాలు పంచుకోరాదని, అటువంటి లావాదేవీలను నిర్వహించే సంస్థల కార్యకలాపాలకు ఏ విధమైన తోడ్పాటునూ అందించకూడదని నిర్ణయించడమైనది.'' ఇది ఒక విధంగా క్రిప్టో కరెన్సీపై నిషేధమే.
2018లో ఒకసారి, 2019లో మళ్ళీ మరోసారి కేంద్ర ప్రభుత్వం ఈ వర్చువల్ కరెన్సీలను నియంత్రిస్తూ చట్టం తీసుకురావడానికి బిల్లులను రూపొందించింది.
రిజర్వుబ్యాంకు సర్క్యులర్ చెల్లదన్న సుప్రీం కోర్టు
రిజర్వుబ్యాంకు 2018 ఏప్రిల్ 6న జారీ చేసిన సర్క్యులర్. చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పును 4-3-2020న వెలువరించింది. ఒక పక్క క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు జరపకూడదని అంటూనే మరోవైపు క్రిప్టో కరెన్సీని తాము నిషేధించలేదని రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ''గత ఐదేళ్ళ కాలంలో ఎక్కడా రిజర్వుబ్యాంకు క్రిప్టో కరెన్సీ లావాదేవీల వలన కలిగిన చెడు ఫలితాలేమిటో స్పష్టంగా నిర్ధారించలేకపోయింది. రిజర్వుబ్యాంకు పర్యవేక్షణ, నియంత్రణ లో నడిచే జాతీయ బ్యాంకులు గాని, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు గాని, సహకార బ్యాంకులు గాని, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు గాని ఈ క్రిప్టో కరెన్సీ లావాదేవీల కారణంగా ఏవిధంగా నష్టపోయాయో రిజర్వు బ్యాంకు చెప్పలేకపోయింది.'' అని సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.
2021 నవంబర్‌లో కేంద్రం మరోసారి క్రిప్టో కరెన్సీపై ఒక బిల్లు రూపొందించింది. అధికారికంగా రిజర్వుబ్యాంకు క్రిప్టో కరెన్సీని జారీ చేయడానికి వీలు కల్పించే బిల్లు ఇది. తక్కిన ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తూ ఆ బిల్లులో నిబంధనలను చేర్చింది. ఐతే, సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకత రీత్యా కొన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు మినహాయింపు ఇచ్చే వీలు కూడా ఆ బిల్లులో కల్పించింది. గత శీతాకాల సమావేశాలలో ఆ బిల్లును పార్లమెంటులో ఎందుకోగాని ప్రవేశపెట్టలేదు.
కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రకటన
2022 ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి క్రిప్టో కరెన్సీ గురించి రెండు ప్రకటనలు చేశారు.
1. ''దేశంలో వర్చువల్ డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. కనుక వీటికి వర్తించే ఒక పన్ను వ్యవస్థను నెలకొల్పవలసిన అగత్యం ఏర్పడింది. అందుచేత నేను వర్చువల్ డిజిటల్ లావాదేవీల మీద 30 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నాను.''
2. ''కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం వలన డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద ఊపు వస్తుంది. మరింత మెరుగైన చౌకైన నగదు నిర్వహణ వ్యవస్థ ఏర్పడుతుంది. కనుక డిజిటల్ రూపాయిని బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం ద్వారా 2022-23 నుండి ప్రవేశపెట్టాలని నేను ప్రతిపాదిస్తున్నాను.''
క్రిప్టో కరెన్సీ చట్టబద్ధమా ? కాదా ?
ఈ ప్రశ్న మౌలికంగా ముందుకొచ్చింది. రిజర్వుబ్యాంకు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌ను చెల్లదంటూ సుప్రీం కోర్టు కొట్టివేశాక ఆ విషయమై ఇంతవరకూ ప్రభుత్వం కాని, రిజర్వు బ్యాంకు కాని ఏ విధమైన నిర్దిష్ట ప్రతిపాదనతోనూ ముందుకు ఇంతవరకూ రాలేదు. ప్రభుత్వం తీసుకున్న వైఖరి పరస్పర విరుద్ధాంశాలతో కూడివుంది.
ఒకవైపు దేశంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం వద్ద ఎటువంటి అధికారిక సమాచారమూ లేదు. డిజిటల్ లావాదేవీలను నిర్వహించే కేంద్రాలలో పెట్టుబడులు పెడుతున్నవారి సమాచారమూ లేదు. దీనికి సంబంధించి పార్లమెంటులో వేసిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి ''ఈ సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడం లేదు'' అంటూ బదులిచ్చారు.
మరి ఏ విధమైన సమాచారమూ లేకపోతే ఆ లావాదేవీల మీద 30 శాతం పన్ను ఏవిధంగా వసూలు చేయబోతున్నారు? ఒకవేళ వసూలు చేయడం మొదలుపెడితే అది క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేసినట్టు అవదా? గత శీతాకాలపు సమావేశాలలో క్రిప్టో కరెన్సీ నిషేధం గురించిన బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడినట్టు?
బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ రూపాయిని విడుదల చేయాలన్న ప్రతిపాదన కూడా అయోమయానికే దారి తీస్తున్నది. ప్రైవేట్ వ్యక్తులు ఉపయోగించే టెక్నాలజీనే ప్రభుత్వమూ వినియోగిస్తే ఇక దానికి భరోసా ఏముంటుంది? దుర్వినియోగం కాదన్న గ్యారంటీ ఏది? ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులే ప్రభుత్వ డిజిటల్ కరెన్సీని వెంటాడవా ?
క్రిప్టో కరెన్సీని నిషేధించిన చైనా
గతేడాదే చైనా ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని నిషేధించింది. ఆ పని దశలవారీగా చేసింది. మొదట ప్రభుత్వ సంస్థలేవీ ఎటువంటి క్రిప్టో లావాదేవీలకూ పాల్పడకుండా మే 2021లో నిషేధం విధించింది. జూన్ లో దేశీయంగా ఎటువంటి క్రిప్టో కరెన్సీ జారీ చేయడానికీ వీలు లేకుండా నిషేధించింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో మొత్తంగానే క్రిప్టో కరెన్సీని నిషేధించింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా డిజిటల్ యువాన్ ను విడుదల చేసింది. చైనా మాదిరిగానే డిజిటల్ కరెన్సీలపై నిషేధాన్ని అమలు చేస్తున్న దేశాలు మరో ఎనిమిది ఉన్నాయి. అల్జీరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇరాక్, మొరాకో, నేపాల్, కతార్, ట్యునిషియా దేశాలు క్రిప్టో కరెన్సీని నిషేధించాయి.
పూర్తి నిషేధం అవసరమన్న రిజర్వుబ్యాంకు డెప్యూటీ గవర్నర్
రిజర్వుబ్యాంకు డెప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ దేశంలో మొత్తంగానే క్రిప్టో కరెన్సీని నిషేధించాలని అన్నారు. ''కరెన్సీ అనే నిర్వచనం కిందికి క్రిప్టో కరెన్సీ రానే రాదు. దానిని ఒక ఆస్తిగా గాని, సరుకుగా కాని పరిగణించలేం. వాటి వెనుక ఎటువంటి నగదు మార్పిడీ జరగదు. వాటికి స్వతహాగా ఎటువంటి విలువా లేదు. అవి చిట్‌ఫండ్ వ్యవహారం వంటివి. నిజానికి అంతకన్నా హోరం.'' అని ఫిబ్రవరి 14న (2022) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. '' క్రిప్టో కరెన్సీ వెనుక ప్రభుత్వ నియంత్రణను తప్పించుకోవాలనే ఒక దృక్పథం దాగివుంది. ఆర్థిక వ్యవస్థ నియంత్రణల పరిధి నుండి తప్పించుకోడానికే వీటిని రూపొందించారు. ఆర్థిక వ్యవస్థను, నగదు నిర్వహణ వ్యవస్థను అవి నాశనం చేయగలవు. దానితోబాటు ఆర్థిక వ్యవస్థను అదుపు చేయగల శక్తి ప్రభుత్వానికి లేకుండా పోతుంది. 2021లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఆర్థిక నేరాల విలువ 1400 కోట్ల డాలర్లు.'' అని రవిశంకర్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినట్టిది. వర్చువల్ కరెన్సీ విషయంలో బిజెపి ప్రభుత్వం ప్రకటించిన విధానం దేశ ప్రజల్లో ఎటువంటి నమ్మకాన్నీ కలిగించలేకపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం క్రిప్టో లావాదేవీల మీద పన్ను వేయడం, క్రిప్టో కరెన్సీని అనుమతించడం వంటి ఆలోచనలను విడనాడి మొత్తంగానే క్రిప్టో కరెన్సీని నిషేధించడం మంచిది. ఆ తర్వాత తగిన భద్రతతో కూడిన టెక్నాలజీని ఉపయోగించి రిజర్వు బ్యాంకు ద్వారా డిజిటల్ కరెన్సీని విడుదల చేయవచ్చు.
( స్వేచ్ఛానుసరణ )
సి.పి.కృష్ణన్










