Nov 19,2022 23:38

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి గౌతమిశాలి

ప్రజాశక్తి-అనకాపల్లి
క్రిమినల్‌ కేసుల్లో స్టేషన్‌ హౌస్‌ అధికారులు విధిగా నేర స్థలాన్ని సందర్శించి సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారులు స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారిచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించి హోటళ్లు, లాడ్జిల్లో తనిఖీ లు నిర్వహించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా రెండోసారి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన అనకాపల్లి పట్టణ సిఐ మోహన్‌రావు, ట్రాఫిక్‌ సిఐ శ్రీను, ఎలమంచిలి సిఐ గఫూర్‌, రాంబిల్లి ఎస్‌ఐ దీనబంధు, ఎలమంచిలి టౌన్‌ ఎస్‌ఐ పాపి నాయుడు, కె.సన్నిబాబు, అనకాపల్లి పట్టణ ఎస్సైలు సత్యనారాయణ, దివాకర్‌, వెంకన్న సింహాచలం, ఐటీ కోర్‌ టీం రాంబాబు, డిసిఆర్‌బి కె.సన్నిబాబును ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విజయభాస్కర్‌, అనకాపల్లి, నర్సీపట్నం, పరవాడ డిఎస్‌పిలు బి సునీల్‌, ప్రవీణ్‌ కుమార్‌, శ్రీనివాసరావు, డిఎస్‌పి మళ్ల మహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.