Nov 24,2022 22:41

షబ్నంను సత్కరిస్తున్న కెకె.రాజు, బర్కత్‌ ఆలీ

ప్రజాశక్తి -కంచరపాలెం : జాతీయ మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైన మర్రిపాలేనికి చెందిన ఎండీ షబ్నం ఎంపిక కావడంపై హర్షం వ్యక్తమౌతోంది. గురువారం 53వ వార్డు ó డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ మజీద్‌ ఈ అల్‌ ఖదీర్‌ కమిటీ ఆధ్వర్యంలో మస్జిద్‌ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో షబ్నంను ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, జివిఎంసి స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, స్థానిక కార్పొరేటర్‌ బర్కత్‌ ఆలీ దుశ్శాలువాతో సత్కరించి, అభినందించారు.
ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, 15మంది సభ్యుల జాతీయజట్టులో షబ్నం స్థానం సంపాదించడం ఆషామాషీ కాదన్నారు. క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించి, విశాఖ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేయడంతోపాటు ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. షబ్నంకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లవేలలా సిద్ధమని ప్రకటించారు. షబ్నం తల్లిదండ్రులు మొహమ్మద్‌ షకీల్‌, కరణం ఈశ్వరమ్మ (సల్మా)లను ప్రత్యేకంగా అభినందించారు.
బర్కత్‌ అలీ మాట్లాడుతూ జాతీయజట్టుకు షబ్నం ఎంపికతో మర్రిపాలెంలో పండగ వాతావరణం నెలకొందన్నారు. కార్యక్రమంలో మస్జిద్‌ కమిటీ అధ్యక్షులు మున్నా, కార్యదర్శి అన్సర్‌ వల్లి, సహాయక కార్యదర్శి నూరి, శివశివాని స్కూల్‌ అడ్వైజర్‌ ఇక్బాల్‌ బేగం, ప్రిన్సిపల్‌ రోజిదూత, భాష, రామలక్ష్మి, రామారావు పాల్గొన్నారు.
అంతే కాకుండా 297, 298 సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను కెకె.రాజు పంపిణీ చేశారు. పోలి పాడ్యమి సందర్శంగా కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో అన్నసమారాధనలో పాల్గొన్నారు. కార్యక్రమంలలో బూస రామలక్ష్మిరెడ్డి, ఈదుల రామారావు, అలజంగి కృష్ణ, రామశాస్త్రి, చిన్న, కోసూరు నాగేశ్వరరావు, లక్ష్మిపాల్గొన్నారు