కడప ప్రతినిధి : జిల్లాను క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. మూడు వారాలుగా ఐసిసి దేశంలో క్రికెట్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. ఇండియా వరుసగా 9 లీగ్, సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. లీగ్, సెమీస్ దశలను దాటుకుని ఫైనల్‌కు చేరుకుని తుదిపోరుకు సిద్ధమైంది. ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన జట్టు ప్రపంచ విజేతగా నిలవనుంది. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ప్రజల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. ఇండియాకు గట్టి ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇండియా, ఆస్ట్రేలియా జట్లు సమవుజ్జీలుగా పరిగణింపబడుతున్న నేపథ్యంలో క్రికెట్ గేమ్ పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ పట్ల ఎనలేని ఆసక్తి కలిగిన అభిమానుల అభిరుచికి అనుగుణంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ స్క్రీన్, నగరంలోని పలు కూడళ్లలో పోస్టర్లను ఏర్పాటు చేసి లైవ్ మ్యాచ్‌ను తిలకించే ఏర్పాట్లు చేసింది.
ఏర్పాట్లలో జిల్లా క్రికెట్ అసోసియేషన్
కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో సెమీఫైనల్ వీక్షణ తరహాలోనే జిల్లా క్రికెట్ అసోసియేషన్ భారీస్క్రీన్ను ఏర్పాటు చేస్తోంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, భరత్‌రెడ్డి, అవ్వారు రెడ్డిప్రసాద్, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానానికి వేలాది మంది హాజరు కానున్న నేపథ్యంలో భారికేడ్ల సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. వీక్షకులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని జిల్లా పోలీసులను కోరినట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ కావడంతో మైదానం ఈలలు, కేకలతో ప్రతిధ్వనిం చనుంది.
బెట్టింగ్ భరతం పట్టేనా?
వర్తమాన ప్రపంచంలో సమవుజ్జీలుగా పరిగణన పొందుతున్న ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కావడంతో బెట్టింగ్ భారీ ఎత్తున సాగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు పోలీసులు హెచ్చరికలు, మరోపక్క ఆధునిక సాంకేతికత సహాయంతో బెట్టింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆధునిక యాప్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బెట్టింగ్‌ను అడ్డుకోవడం కష్టసాధ్యమని చెప్పవచ్చు. సెమీస్ సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి పులివెందుల తదితర ప్రాంతాల్లో కొంతమంది బెట్టింగ్‌రాయుళ్లను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మిగిలిన బెట్టింగురాయుళ్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.