May 24,2023 00:46

బహుమతి అందుకుంటున్న విజేత ఉత్తర ప్రదేశ్‌ జట్టు

ప్రజాశక్తి-పర్చూరు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పర్చూరులో జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించటం అభినందించ దగ్గ విషయమని టిడిపి బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. ఎన్‌టిఆర్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పర్చూరులో జాతీయ స్థాయిలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు, ట్రస్టు ప్రతినిధులకు నరేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరి స్పోర్ట్స్‌ కల్చరల్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి టి-20 క్రికెట్‌ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఫైనల్‌ పోటీలో విశాఖపట్నం సిక్కోలు చీతాస్‌ జట్టుపై ఉత్తరప్రదేశ్‌ శౌర్య జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సాలూజ్‌ అందుకున్నాడు. ఉత్తమ బ్యాట్‌మెన్‌గా తిరుపతి జట్టు క్రీడాకారుడు తేజారెడ్డి, ఉత్తమ బౌలర్‌గా గుంటూరు మలినేని జట్టు క్రీడాకారుడు సుజిత్‌, ఉత్తమ కీపర్‌గా విశాఖపట్నంకు చెందిన గడ్డం సుజిత్‌, మ్యాన్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన విపిన్‌ చంద్ర ఎంపికయ్యారు. విజేత ఉత్తర ప్రదేశ్‌ జట్టుకు రు. 5 లక్షలు విక్రం నారాయణ అందజేశారు. ద్వితీయ స్ధానంలో నిలిచిన విశాఖపట్నం జట్టుకు రూ. 3 లక్షలు స్రీకర్‌ బయోటెక్‌ యాజమాన్యం, తృతీయ బహుమతిగా రూ. 2 లక్షలు తిరుపతి జట్టుకు కాకర్ల ఛారిటబుల్‌ ట్రస్టు, నాలుగో బహుమతి రూ. 1 లక్ష మలినేని గుంటూరు జట్టుకు పోట్రు శోభన్‌బాబు అందజేశారు. ఈ పోటీలకు ఎంపైర్లుగా అప్పలరెడ్డి, ముఖేష్‌ మోహన్‌, రవికృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు తులసి శ్రీనివాసరావు, మామిడిపాక హరిప్రసాద్‌, చెరుకూరి చింపయ్య, రవిచంద్ర, టిడిపి నాయకులు రాజశేఖర్‌బాబు, విక్రం వెంకట్రావు, సురేష్‌, షేక్‌ షంషుద్దీన్‌, నాయుడు, శేషబ్రహ్మాచారి, మానం హరిబాబు, పొద వీరయ్య, రంగయ్య చౌదరి పాల్గొన్నారు.