Dec 27,2022 22:54

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: కేబుల్‌ టీవీ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ ట్రోఫీని నలంద డిగ్రీ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. నలంద కళాశాల, సిద్ధార్థ కళాశాల జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో నలంద డిగ్రీ కళాశాల జట్టు తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలిచిన నలంద డిగ్రీ కళాశాల జట్టుకు, రన్నరప్‌ గా నిలిచిన సిద్దార్ధ జట్టుకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీ రావు ట్రోఫీలు, నగదు చెక్కులను అందజేశారు. కేబుల్‌ టీవీ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రా లయోలా కళాశాలలో నిర్వహిస్తున్న పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ సిద్దార్థ డిగ్రీ కళాశాల, నలంద డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగింది. నలంద కళాశాల జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నలంద జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 151 పరుగులు చేసింది. షేక్‌ ఖాజా మొహిద్దీన్‌ 28 బంతుల్లో 32 పరుగులు చేయగా, సుశాంత్‌ నాయుడు 29 బంతుల్లో 27 పరుగులు చేసాడు. సిద్దార్థ జట్టులో ప్రవీణ్‌, రవితేజ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ కి దిగిన సిద్దార్ధ కళాశాల జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. నలంద జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు చివరి ఎనిమిది ఓవర్‌ ల మ్యాచ్‌ ను తిలకించారు. అనంతరం విజేత నలంద జట్టుకు ట్రోఫీ, పది వేల రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ చెక్కు,రన్నర్‌ అప్‌ గా నిలిచిన సిద్దార్థ జట్టుకు ట్రోఫీ, ఐదు వేల రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ చెక్కును జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావు, సిటీకేబుల్‌ ఎండి పొట్లూరి సాయిబాబు అందజేశారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గ నిలిచిన ఎం.శ్రీనివాస్‌ కు, మొదటి, రెండు సెమీఫైనల్స్‌ లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గా నిలిచిన ఎం శ్రీనివాస్‌, సుశాంత్‌ నాయుడు, రవితేజకు బహుమతులు అందజేశారు.