
రాయచోటి ; క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతమైన నక్కవాండ్లపల్లి సమీపంలో జరుగుతున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీలోగా ్ల క్రికెట్ స్టేడియం అన్ని హంగులతో అత్యంత సుందరంగా పూర్తి చేయాలని పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. క్రికెట్ స్టేడియం వరకు రోడ్డు, ఆర్చి నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. స్టేడియంలో చూపరులను ఆకట్టుకునేలా మొక్కలు విరివిగా నాటి పచ్చదనాన్ని పెంపొందిం చాలన్నారు. మైదానం చుట్టూ నీడనిచ్చే పెద్ద పెద్ద మొక్కలను నాటలన్నారు. దాదాపు 32 ఎకరాలలో నిర్మించే స్టేడియం నిర్మాణ పనులన్నీ నాణ్యతతో మన్నికగా ఉండేలా చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణం, స్టేడియం సరిహద్దుల చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం ఏర్పాటు తదితరాలపై రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రికెట్ స్టేడియంలో కలియతిరిగి పిచ్ నిర్మాణం, అక్కడ నిర్మిస్తున్న గదులను పరిశీలించి శరవేగంగా స్టేడియం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. స్టేడియం మొత్తం రైన్‌గన్‌తో తడిపి ఎత్తు పల్లాలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఇఇ సహదేవారెడ్డి, డిఇ వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ ప్రేమంత్ కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.