ప్రజాశక్తి-చింతూరు
చింతూరు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చింతూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా చింతూరు నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్ పోటీలో చింతూరు ఎఫ్‌వైఏసి, రామవరం జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చింతూరు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు తీయగా అనంతరం రామవరం జట్టు 13 ఓవర్లలో 67 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ ఎంవిఐ జగదీష్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో తోడ్పడుతాయని తెలిపారు. క్రీడల ద్వారా యువతకు ఎంతో భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత గ్రామస్థాయి నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం విన్నర్స్‌కు షీల్డ్‌తో పాటుగా నగదు బహుమతిని అందజేశారు. నెల రోజులపాటు సాగిన ఈ టోర్నమెంట్ 80 జట్లు పాల్గొనగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌గా గౌతమ్, బెస్ట్ ఆల్ రౌండర్‌గా రాము నిలిచారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రదీప్, దుర్గా, సూరి, అజరు రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










