Aug 04,2023 22:47

సర్వీస్‌ చేసి ప్రారంభిస్తున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

- జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే న్యాయవాదులు, జిల్లా కోర్టు సిబ్బందికి క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా కోర్టులో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రీడా పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఒకటో అదనపు జిల్లా జడ్జి కె.శ్రీదేవి క్రీడా జ్యోతిని వెలిగించి న్యాయవాదులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు న్యాయవాదులు ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరికీ శారీరక, మానసిక ఆరోగ్యం అవసరమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొనే న్యాయవాదులు, జిల్లా కోర్టు సిబ్బంది క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ న్యాయవాదుల్లో, కోర్టు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, క్యారం బోర్డు, క్రికెట్‌ తదితర క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో సీనియర్‌, జూనియర్‌, మహిళా న్యాయవాదులతో పాటు కోర్టు సిబ్బంది విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఎస్‌.మహేంద్ర ఫణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు ఆర్‌.సన్యాసినాయుడు, అదనపు సివిల్‌ జడ్జి అనురాధ, జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.శారదాంబ, ప్రోటోకాల్‌ జడ్జి రాణి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గేదెల వాసుదేవరావు, సీనియర్‌ న్యాయవాదులు వాన కృష్ణచంద్‌, శిష్టు రమేష్‌, సనపల హరి, బైరి దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.