
రాజంపేట అర్బన్ : క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆర్‌డిఒ రామకష్ణారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 29, 30 తేదీలలో గోవాలో నిర్వహించిన జాతీయస్థాయి తేక్వాండో పోటీలలో రాజంపేట విద్యుత్ నగర్‌కు చెందిన బి.చిన్నయ్య కుమారుడు సాయి పవన్, సబ్ జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్‌డిఒ రామకష్ణారెడ్డి చేతులుమీదుగా సాయి పవన్‌కు స్వర్ణ పతకం, సర్టిఫికెట్టును అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభించడంతో పాటు విద్య, ఉపాధి నందు క్రీడా కోటా ద్వారా మెరుగైన అవకాశాలు ఉంటాయని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణ విద్య కావడం చేత నేటి యువతీ, యువకులు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందడం ఆవశ్యమని అన్నారు. జాతీయస్థాయిలో క్రీడాకారుడు పతకం సాధించడం రాజంపేటకే గర్వకారణం అని అన్నారు. ప్రత్యేక శిక్షణ అందించి తర్ఫిదునిచ్చిన ద్రోణాచార్య మార్షల్ అకాడమీ మాస్టర్ బి.సునీల్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అకాడమీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారులను అందించే దిశగా అకాడమీ ప్రయత్నించాలని, ఇందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు, మాస్టర్ బి.సునీల్, ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, కార్యదర్శులు వెంకటేశ్వర రాజు, దుర్గయ్య, సంధ్య పాల్గొన్నారు.
క్రీడాకారుడిని అభినందించిన చమర్తి జగన్ రాజు
జాతీయస్థాయిలో స్వర్ణ పతకం సాధించిన సాయి పవన్‌ను టిడిపి సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్మోహన్ రాజు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జగన్ రాజు మాట్లాడుతూ ఆరవ తరగతిలోనే జాతీయస్థాయిలో రాణించడం అభినందనీయమని అన్నారు. ఆ స్థాయిలో ప్రత్యేక శిక్షణ అందించిన ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ సునీల్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని, చిన్నతనంలోనే రాజంపేట ప్రాంతం గర్వించే విధంగా పతకం సాధించేందుకు ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. రాజంపేట ప్రాంతంలో క్రీడాభివద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.