ప్రజాశక్తి అద్దంకి: క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహ సంబంధాలు కూడా మెరుగుపడతాయని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంఖవరప్పాడు ప్రధానోపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని శంఖవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విద్యార్థులకు క్రీడా దుస్తులు అందించారు. పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయులు పి శ్రీనివాసులు బాలుర కబడ్డీ జట్టుకు, సోషల్ ఉపాధ్యాయులు సిహెచ్ రామ్మోహన్రావు బాలికలకు క్రీడా దుస్తులను అందించడంలో ఆర్థిక సహాయ సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఈటి డాక్టర్ ఎన్ వీరేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










