Aug 29,2023 23:24

క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* జాతీయ క్రీడా దినోత్సవంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం క్రీడాకారులు సత్తా చాటి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ పిలుపునిచ్చారు. హాకీ లెజెండ్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, సెట్‌శ్రీ సంయుక్తంగా నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పాలకొండ రోడ్డు మీదుగా కోడి రామ్మూర్తి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్‌, తైక్వాండో, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలను కలెక్టర్‌ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానచంద్‌ తొలిసారిగా దేశానికి ఒలింపిక్‌ మెడల్‌ను సాధించడమే కాకుండా, మూడుసారు బంగారు పతకాలను సాధించి గొప్ప గుర్తింపు తెచ్చారని కొనియాడారు. ఆయన విజయాలను వందేళ్లయినా నేటికీ గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఆయన స్ఫూర్తితో జిల్లా క్రీడాకారులు ఎన్నో విజయాలను సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశం మనదైనప్పటికీ క్రీడల్లో వెనుకబడి ఉన్నామని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'ఖేలో ఇండియా, ఆడుదాం ఆంధ్రా ' వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న సంగతిని కలెక్టర్‌ గుర్తు చేశారు. క్రీడల్లో పతకాలు సాధిస్తే దేశానికి, రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. క్రీడల్లో రాణించాలనే జిజ్ఞాస, ఉత్సాహం ఉంటే తప్పకుండా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రీడల్లో విశేష కృషి చేసిన జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం.ఎస్‌.ఆర్‌ కష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.సాంబమూర్తిని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాన్ని అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 2 వరకు నిర్వహిస్తుందన్నారు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, ఖో-ఖో, కబడ్డీ పోటీలు ఇందులో ఉంటాయని, గ్రామ- వార్డు సచివాలయాలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నగదు బహుమతిని అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా చీఫ్‌ కోచ్‌ శ్రీధర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావు, నెహ్రూ యువ కేంద్రం అకౌంట్స్‌ ఆఫీసర్‌ జి.శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.