
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడల్లో రాణించిన వారికి తగిన విధంగా ప్రోత్సాహం అందిస్తుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మొగల్‌రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కృష్ణాజిల్లా అండర్ -19 స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో క్రీడలను అభివృద్ది పరచేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటుచేసి దానికి అనుగుణంగా క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు. డైరెక్టర్ ఆఫ్ దనరి స్కూల్ ఎడ్యుకేషన్ పి.పార్వతి మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ప్రణాళికా ప్రకారం అన్ని కేటగిరిలలోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలు విజయవావలో నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేస్తామని ఎంపికైన రాష్ట్ర జట్టు జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ పి.అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ ఆడటం వలన ఎంతో మంది క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అధిరోహించారని వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.రవికాంత, కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, పలువురు క్రీడాకారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.