ప్రజాశక్తి - అమరావతి : మండల కేంద్రమైన అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14, అండర్-17 బాలబాలికలకు ఖోఖో, కబడ్డీలో మండల స్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మండలంలోని మునుగోడు, మల్లాది, లింగాపురం, మండపూడి జెడ్‌పి పాఠశాలలతోపాటు, శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్ నుండి క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఎంపిపి ఎం.హనుమంతరావు తొలుత కబడ్డీ పోటీల ప్రారంభానికి టాస్ వేశారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ సభలో ఎంపిపి మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని, విద్యార్థులంతా క్రీడలను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుందని, అందులోనూ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఈ పోటీలు ఉంటాయన్నారు. ప్రస్తుతం మండల స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిల్లోనూ రాణించి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో ఎంఇఒలు ఎం.శ్రీనివాసరావు, శివబాబు, హెచ్‌ఎం ఎం.సీతారామాంజనేయులు, వైసిపి నాయకులు పి.శివరామిరెడ్డి, పిఇటిలు వినోద్ కుమార్, సి.అనురాధ, సునీత, హెలినా కుమారి పాల్గొన్నారు.










