Jan 21,2023 22:29

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
          విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యతివ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి డాక్టర్‌ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తెల్లం బాలరాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా పోటీలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యతిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు మండల, గ్రామీణస్థాయిలలో కూడా క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాపోటీల్లో అత్యుతమ ప్రతిభ కనబరిచిన వారికి శిక్షణ అందించి వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలు ఇరుకైన భవనాల్లో నిర్వహించడంతో క్రీడా సదుపాయాలు ఉండవని, అంతేకాక వారు క్రీడలకు ప్రాధాన్యతవ్వలేరన్నారు. ప్రతీ సంవత్సరం తన ఫౌండేషన్‌ ద్వారా క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆహ్లాదం, ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహానికి జిల్లా పరిషత్‌ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని యువతలో దాగిఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ఏడు గిరిజన మండలాల్లోని యువతకు వాలీబాల్‌, కబడ్డీ, విలువిద్య, తదితర క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.
అనంతరం రూ.42 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ ప్రారంభించారు. తొలుత ఎంఎల్‌ఎ బాలరాజు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కరాటం సీతాదేవి, ఎంపిపి కారం శాంతిరమణ, జెడ్‌పిటిసి సభ్యులు మొడియం రామతులసి, సర్పంచి టి.వెంకాయమ్మ, వైస్‌ఎంపిపిలు కుక్కల వరలక్ష్మి, గోపి, జి.మోహన్‌రావు, ఆర్‌డిఒ జాన్సీరాణి, కళాశాల ప్రిన్సిపల్‌ భక్త హనుమాన్‌, తహశీల్దార్‌ ఎస్‌.శాంతి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ శ్రీహరి పాల్గొన్నారు.