కడప అర్బన్ జిల్లాలోని యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకుని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ నాగరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సోసైటీ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థ, జిల్లా క్రీడా శాఖ వారు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని మహావీర్ సర్కిల్ నుంచి 5కె రన్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, జిల్లా క్రీడ సంస్థ అధికారి సాయిగ్రేసి, జిల్లా యువజన శాఖ కో-ఆర్డినేటర్ మణికంఠ మంగళవారం జెండా ఊపి పరుగు పందెం ప్రారంభించారు. స్త్రీ, పురుష, జిల్లా లోని వివిధ కళాశాలల నుంచి దాదాపు 200 మంది పై చిలుకు విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక మహావీర్ సర్కిల్ కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు, యూటర్న్ తీసుకుని మహా వీర్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో 1, 2, 3 అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరితోపాటుగా 9 మందికి ప్రోత్సా హక బహుమతులు అందించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. జిల్లా స్థాయిలో మొదటి 10,000, ద్వితీయ 7,000, తతీయ 5,000, మిగిలిన వారికీ 1,000 అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ యువత హెచ్‌ఐవి/ ఎయిడ్స్ బారిన పడకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ సి సి యూనిట్, జిల్లా విద్య శాఖా, వైద్య ఆరోగ్య శాఖా సిబ్బంది, జిల్లా క్రీడ శాఖా కోచ్ లు 10 మంది పాల్గొన్నారు.
చిన్న చౌక్‌లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరికష్ణ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్‌చంద్ గౌరవ సూచికంగా ఆయన జయంతిని ఆగస్టు 29న నిర్వహిం చుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులకు కొన్ని పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో సంధ్య రెడ్డి, పిఈటి జయచంద్ర, నాగార్జున, ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
క్రీడాకారులకు హాకీ స్టిక్కులు పంపిణీ
కడప : హాకీ మాంత్రికుడు ట్రిపుల్ ఒలంపియన్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను మంగళవారం ధ్యాన్ చంద్ హాకీ అకాడమీ డైరెక్టర్ సుభాన్ బాష ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో హాకీ క్రీడాకారుల మధ్య ఘనంగా నిర్వహించారు. ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ధ్యాన్ చంద్ జన్మదినం పురస్కరించుకొని హాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్కులను అందజేశారు. ధ్యాన్ చందును ఆదర్శంగా తీసుకొని హాకీలో ఉన్నత స్థాయికి ఎదిగి రాణించాలని క్రీడాకారులకు సూచించారు. 1905 లో ధ్యాన్ చంద్ ఓ పేద కుటుంబంలో జన్మించారని అన్నారు. హాకీ పట్ల ఆసక్తితో దేశానికి మూడు ఒలంపిక్స్ బంగారు పతకాలను ధ్యాన్ చంద్ అందించారన్నారు. హాకీకి వన్నెతెచ్చిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో కోచ్ కళ్యాణ్, నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడు విజరు, సీనియర్ ప్లేయర్స్ ప్రదీప్, శ్రీనివాసులు, రఫీ, హాసిం, నవాజ్ పాల్గొన్నారు. వేంపల్లె : ప్రపంచ హాకీలో లెజెండరీగా నిలిచిన క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ అని, అలాంటి గొప్ప క్రీడాకారుడు నేటి యువతరానికి మార్గదర్శకుడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక వైఎస్‌ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో హకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఓబుల్‌రెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర, అధ్యాపకులు డాక్టర్ మల్లేశ్వరమ్మ, డాక్టర్ నాగలక్ష్మిదేవి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ సుధాకర్, మాధవరావు, విద్యార్థులు పాల్గొన్నారు. పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఆహార విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ బేగ్ మాట్లాడారు. విద్యార్థులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజేష్, నజ్మా, నివేదిత, ఏడుకొండలు, సాయి శ్రీనివాస్, రాజశేఖర్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఖాజీపేట : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని కడప డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరాజు తెలిపారు. మండల పరిధిలోని కొత్త నెల్లూరు సమీపంలో ఉన్న బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కడప డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి ఎంపిడిఒ వీర కిషోర్, కడప ఎంపిడిఒ బీరం శ్రీకాంత్‌రెడ్డి హాజరుయ్యారు. కార్యక్రమాన్ని క్రీడాజ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. జాతీయ జెండాను, క్రీడా జెండాను ముఖ్యఅతిధులు ఎగురవేసి గౌరవ వందనం చేశారు. వివిధ రకాల క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు, వ్యాయామ శిక్షణ ఉపాధ్యాయులు మైదానం చుట్టూ కవాతు నిర్వహించారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కలగాల న్నారు. కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి, చైర్ పర్సన్ సరస్వతమ్మ మాట్లాడారు. వ్యాయామ శిక్షణ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఖోఖో, కబడ్డీ, హాకీ, త్రోబాల్, ఫుట్‌బాల్, రన్నింగ్ రేస్, వాలీబాల్ వంటి పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. వేడుకల్లో డైరెక్టర్ స్వాతిశ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా, కాలేజ్ ప్రిన్సిపల్ హేమ్‌చందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










