ప్రజాశక్తి - నూజివీడు రూరల్
క్రీడారంగ అభివద్ధిలో భాగంగా నూజివీడులో క్రీడా స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక డాక్టర్ బిఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల సమీపంలో క్రీడా స్థలాన్ని స్టేడియంగా నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించడానికి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్టేడియంకు సంబంధించిన ప్రహరీ, హద్దులు తదితర సమాచారాన్ని మ్యాప్ ద్వారా తహశీల్దార్ డివిఎస్.యల్లారావు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మామిడి పరిశోధనా కేంద్రం పక్కనే ఉన్న 40 ఎకరాల ప్రయివేటు భూమిని మధ్యతరగతి ప్రజలకు స్ధలాలు కేటాయించడానికి కొనుగోలు చేసిన స్ధలాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సిద్ధార్ధ్‌నగర్‌లో కొండపై శిధిలమై ఉన్న రెవెన్యూ విశ్రాంతి భవనాన్ని కలెక్టర్ పరిశీలించి ఈ భవనాన్ని పునఃప్రారంభానికి ప్రతిపాదనలు రూపొందించి చర్యలు తీసుకోవాలని నూజివీడు సబ్ కలెక్టర్‌కు సూచించారు. కొండపై సాగు చేసుకుంటున్న రైతులతో సాగుభూమి పట్టాల గురించి, ఫలసాయం గురించి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఖాన్, ఆర్‌ఐ అశోక్‌కుమార్, విఆర్‌ఒ రాజబాబు పాల్గొన్నారు.










