క్రీడాకారుణులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ, మంత్రిని అరెస్టు చేయాలి

ప్రజాశక్తి - పరవాడ
మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్‌ను, హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి మాణిక్యం అధ్వర్యంలో పరవాడ సంతలో మంగళవారం క్రీడాకారులకు మద్దతుగా సంతకాలు సేకరణ చేశారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ నిందితులిద్దరిని పదవుల నుండి తొలగించాలని కోరారు. మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించాలని, నిర్దిష్ట సమయంలో విచారణ పూర్తి చేయాలని కోరారు. ఢిల్లీలోని నిరసన ప్రదేశంలో విద్యుత్ తక్షణమే పునర్ధరించాలని, తాగునీరు, భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం జానకి, కె రత్నం, రెడ్డి అచ్చయ్యమ్మ, వి పద్మ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.