ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర, జాతీయ స్థాయిలో నడక పరుగు పోటీల్లో 78 ఏళ్ల వయసులోనూ పతకాల పంట పండిస్తున్న కనగాల మల్లికార్జునరావు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. కలకత్తాలో నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2023 పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నగరంలోని టీచర్స్ కాలనికి చెందిన కనగాల మల్లికార్జునరావును బుధవారం కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలకత్తాలోని వివేకనంద యువ భారతి కిరంగన్ అండ్ సాయి స్పోర్ట్ కాంప్లెక్స్‌లో ఈ నెల 14వ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి నడక పరుగు పోటీలలో మల్లికార్జునరావు 21 కిలోమీటర్ల పరుగును రెండు గంటల్లో పూర్తి చేసి ఛాంపియన్ షిప్‌ను సాధించడంతో పాటు మూడు గోల్డ్ మెడల్స్‌ను సాధించి రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన వివిధ పోటీలలో 21 కిలో మీటర్ల పరుగులో 16 పతకాలు, 5 కిలో మీటర్ల పరుగులో 16 పతకాలను సాధించిన మల్లికార్జునరావు నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. మల్లికార్జునరావు మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండేదని ఉదయాన్నే వ్యాయామాన్ని ముగించుకొని వ్యవసాయ పనుల్లో పాల్గొనేవాడినని తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేశానన్నారు. ఇప్పటివరకు ప్రతి నిత్యం వేకువజామునే నడక పరుగు వంటి వ్యాయామ కార్యక్రమాలలో పాల్గొంటున్నానని తెలిపారు.










